Sesagiribabu
-
జేసీ మురళి.. జిల్లాలోనే!
విజయవాడ : జాయింట్ కలెక్టర్ జె.మురళిని జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆయన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా, గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ఆయన స్థానంలో వైజాగ్ ఈపీఎస్‌పీడీసీఎల్ సీఎండీగా పనిచేస్తున్న శేషగిరిబాబు నియమితులయ్యారు. జిల్లాలో కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్, ఇతర ముఖ్య అధికారులు ఇటీవలే కొత్తగా బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో అధికారులందరూ కొత్తవారు కావడంతో జాయింట్ కలెక్టర్ మురళిని ఇక్కడే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. శేషగిరిబాబు కూడా ఇక్కడకు రావడానికి విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న జాయింట్ కలెక్టర్ జె.మురళి ఇక్కడే కొనసాగుతారని తెలుస్తోంది. -
మూడు రోజుల్లో వెలుగులు
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు ఈపీడీసీఎల్‌కు రూ.750 కోట్ల నష్టం సీఎండీ శేషగిరిబాబు యలమంచిలి: మూడు రోజుల్లో జిల్లా అంతటా విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.శేషగిరిబాబు తెలిపారు. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా అందించడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. శనివారం రాత్రి యలమంచిలిలో విద్యుత్ పునరుద్ధరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. విశాఖ జిల్లా మొత్తం విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైందన్నారు. చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు నేలమట్టం కావడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు ఎంత వేగవంతం చేసినా ఫలితం కన్పించడం లేదన్నారు. కొన్నిచోట్ల విద్యుత్ లైన్లు పూర్తిగా దెబ్బతినడంతో తాత్కాలికంగా వేరొక లైన్ ద్వారా సరఫరా ఇచ్చి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని చెప్పారు. జిల్లాలో పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో దాదాపు ఏడు వేల మంది సిబ్బంది, రెండు వేల మంది అధికారులు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నట్టు తెలిపారు. హుదూద్ తుపాను బీభతానికి ఉత్తరాంధ్రలో ఏపీఈపీడీసీఎల్ కు సుమారు రూ.750 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 7.64 లక్షల విద్యుత్ కనెక్షన్లకు 7 లక్షల కనెక్షన్లకు విద్యుత్ పునరుద్ధరించామని తెలిపారు. విశాఖపట్నంలో 11.32 లక్షల కనెక్షన్లలో ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా కనెక్షన్లకు విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. గ్రేటర్ విశాఖ పరిధిలో మూడు జోన్లలో రెండు జోన్లకు పూర్తిగాను, మూడవ జోన్లో 75 శాతం కనెక్షన్లకు సరఫరా ఇచ్చామన్నారు. -
వుడా ఇన్చార్జి వీసీగా శేషగిరిబాబు
విశాఖపట్నం : వుడా ఇన్చార్జి వీసీగా ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ చైర్మన్ ఎం.వి.శేషగిరిబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు నిర్వహించిన జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో శేషగిరిబాబును నియిమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వుడా కార్యదర్శి జి.సి.కిశోర్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ ఐ.విశ్వనాథరావు, చీఫ్ అర్బన్ ప్లానర్ ఆర్.జె.విద్యుల్లత, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ డి.విజయభారతి, డీఎఫ్‌వో బి.రాజారావు, ఎస్టేట్ అధికారి భవానీదాస్ తదితరులు శేషగిరిబాబుకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై వుడా కార్యకలాపాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.