సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అజెండాతో నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకూ విశాఖపట్నంలో ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రెయినేజీ) 25వ అంతర్జాతీయ సదస్సు (ఇంటర్నేషనల్ కాంగ్రెస్) నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
గురువారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ఐసీఐడీ ఉపాధ్యక్షుడు, 25వ కాంగ్రెస్ నిర్వాహక కార్యదర్శి కె.యల్లారెడ్డితో కలిసి మంత్రి అంబటి రాంబాబు ఐసీఐడీ 25వ కాంగ్రెస్, ఆ సంస్థ 74వ ఐఈసీ (ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ ప్రతిష్టాత్మక సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని సదస్సుకు ప్రత్యేకంగా ఆహ్వానించామని తెలిపారు. ఐసీఐడీలో సభ్యత్వం ఉన్న 80 దేశాలకు చెందిన సుమారు 400 నుంచి 500 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారన్నారు. దేశంలో ప్రతిష్టాత్మక సంస్థల నుంచి సుమారు 500 నుంచి 600 మంది సాంకేతిక నిపుణులు సైతం సదస్సులో పాల్గొంటారన్నారు.
నీటి ఎద్దడిపైనే ఫోకస్
ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో నీటి ఎద్దడిని యాజమాన్య పద్ధతుల ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవడమే అజెండాగా 1951లో భారత్ ప్రోద్బలంతో ఐసీఐడీ ఏర్పాటైందని మంత్రి రాంబాబు చెప్పారు. తొలుత 11 సభ్య దేశాలతో ప్రారంభమైన ఐసీఐడీ ఇప్పుడు ప్రపంచంలో నీటిపారుదల, డ్రెయినేజీ వ్యవస్థలున్న 80 దేశాలు సభ్యులుగా ఉన్నాయన్నారు.
ప్రతి మూడేళ్లకు ఓసారి ఐసీఐడీ సమావేశమై నీటి యాజమాన్య పద్ధతులపై మేధోమథనం చేసి నీటిఎద్దడిని ఎదుర్కోవడంపై ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఐసీఐడీ 6వ కాంగ్రెస్ 1966లో మన దేశంలో జరిగిందని, 57 ఏళ్ల తర్వాత ఆ సంస్థ 25వ కాంగ్రెస్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తుండటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, సదస్సును విజయవంతం చేయడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
కృష్ణా డెల్టాకుగోదావరి జలాలు
పులిచింతలలో నిల్వ చేసిన నీటితో ఇన్నాళ్లూ కృష్ణా డెల్టాకు నీళ్లందించామని మంత్రి రాంబాబు చెప్పారు. ప్రస్తుతం పులిచింతలలో నీటి నిల్వ 17.41 టీఎంసీలకు చేరుకుందని, కృష్ణాలో వరద ప్రవాహం రావడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో పట్టిసీమ ఎత్తిపోతల పంపులను రీస్టార్ట్ చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. నాలుగేళ్లలో ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే పట్టిసీమ ఎత్తిపోతలను వాడుకున్నామని గుర్తు చేశారు.
గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువకు 5 టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానించాలా? లేదంటే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారని తెలిపారు.
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జల సంఘానికి నివేదిక ఇస్తారని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ డయా ఫ్రమ్ వాల్‌పై తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేయాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి చెప్పారు. ఐసీఐడీ 25వ కాంగ్రెస్ కార్యనిర్వాహక కార్యదర్శి కె.యల్లారెడ్డి మాట్లాడుతూ నీటి యాజమాన్యంలో మెరుగైన పద్ధతులు పాటించిన దేశాలకు ప్రోత్సాహకంగా అవార్డులు అందచేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment