నేషనల్ బాక్సింగ్ పోటీలకు మౌనిక
నర్సీపట్నం: స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వచ్చే జూలై 21 నుంచి 24 తేదీ వరకు అసోంలో జరిగే ఏడో జాతీయ రూరల్ బాక్సింగ్ గేమ్స్, చాంపియన్‌షిప్స్ పోటీలకు నర్సీపట్నం నింజాస్ అకాడెమీకి చెందిన బాక్సర్ మౌనిక ఎంపికయ్యారు. స్థానిక రుషి కాలేజీకి చెందిన పి.మౌనిక (17) అండర్ 66 కిలోల విభాగంలో పాల్గొంటుందని కోచ్ కె.అబ్బు తెలిపారు.
జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి పది మంది మహిళా బాక్సర్లు వివిధ జిల్లాల నుండి ఎంపికయ్యారు. రాష్ట్ర రూరల్ బాక్సింగ్ అసోసియేషన్ వీరిని ఎంపిక చేసిందన్నారు. గత ఏడాది హర్యానాలో జరిగిన అరో జాతీయ రూరల్ బాక్సింగ్‌లో మౌనిక బంగారు పతకం సాధించిన సంగతిని వీరు గుర్తు చేశారు. ఈ ఏడాది జరిగే పోటీల్లో కూడా బంగారు పతకంతో పాటు బెస్ట్ బాక్సర్ కూడా అందుకోవాలని నింజాస్ ఆకాడెమీ చైర్మన్ వెలగా నారాయణరావు, కార్యదర్శి బంగారు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మౌనిక ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్విరామంగా బాక్సింగ్ సాధన చేస్తోందన్నారు.