నగరాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించి ఓ ప్రదేశంలో కాల్చేయడమో లేదా రీసైక్లింగ్ చేయడమో జరుగుతూ ఉంటుంది. తీవ్ర దుర్గంధభరితమైన, అత్యంత కాలుష్యమయమైన ఆ ప్రాంతానికి పొరపాటున కూడా వెళ్లే సాహసం చేయలేం కదా? కానీ అలాంటి ప్రదేశానికి వెళ్లి సేద తీరడమే కాదు.. ఆడొచ్చు.. పాడొచ్చు.. ఇంకా కావాల్సింది సుష్టుగా తినొచ్చు. అవాక్కవుతున్నారా? నిజంగా ఇది నిజం. మరి అ అందమైన చెత్త వినోద కేంద్రం ఎక్కడుంది, దాని విశేషాలేంటో చూద్దామా?
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్.. రాజరిక వారసత్వం, ఆధునిక వాస్తుశిల్పాన్ని మిళితం చేసిన పర్యావరణ అనుకూలమైన అందమైన నగరం. 2017లో కోపెన్‌హాగన్‌ను ప్రపంచంలోని గ్రీన్‌సిటీగా ప్రకటించారు. ఇది ప్రధానంగా పునరుత్పాదక శక్తిని పెంపొందించడం, క్లీనర్ మొబిలిటీపై దృష్టి పెట్టింది. దీంతో నగరంలోని వ్యర్థాలను మొత్తం విద్యుత్‌గా మార్చే ఒక పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టారు.
కేవలం ప్లాంటు ఒకటే ఏం బాగుంటుందని అనుకున్నారు డెన్మార్క్ అధికారులు. అంతే వ్యర్థాల శుద్ధి కేంద్రానికి వినోదపు టచ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు అదిరిపోయే డిజైన్‌తో ఈ ప్లాంట్ నిర్మించారు. కోపెన్‌హాగన్‌లోని ఎత్తైన భవనాల్లో ఒకటైన ఈ ఆర్కిటెక్ట్ అద్భుతాన్ని అమేజర్ బక్కే లేదా కోపెన్‌హిల్‌గా పిలుస్తారు. కార్పొరేట్ ఆఫీసులను తలదన్నేలా ఉన్న ఈ భవ నాన్ని చూస్తే ఇది వ్యర్థ శుద్ధి కేంద్రమా అనే సందేహం కలగక మానదు.
100 మీటర్ల ఎత్తైన ఈ భవనంపైన అనేక కార్యకలాపాలతో కూడిన డైనమిక్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. ఇందులో స్కైయింగ్, హైకింగ్, క్లైంబింగ్ వంటి వినోద సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఇది వ్యర్థాలను ప్రాసెస్ చేసే ప్లాంట్‌గానే కాకుండా.. వినోదాలు పంచే విహారాల స్పాట్‌గా కూడా ప్రత్యేకతను సొంతం చేసుకుంది.
కార్బన్ న్యూట్రల్ సిటీగా..
2025 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ సిటీగా కోపెన్‌హాగన్ అవతరించాలనే లక్ష్యంతోనే ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. వ్యర్థాలను భూగర్భంలో ఉండే ఓ బాయిలర్‌లో ప్రాసెస్ చేయడం ద్వారా ప్లాంట్ పనిచేస్తుంది.
రోజుకు 300 ట్రక్కుల వ్యర్థాలను వెయ్యి డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వాతావరణంలోకి 250 కిలోగ్రాముల కార్బన్‌డైఆక్సైడ్ నీటి ఆవిరి రూపంలో 124 మీటర్ల చిమ్నీ ద్వారా బయటకు వస్తుంది. ఏటా 4,40,000 టన్నుల వ్యర్థాలను మండించడం ద్వారా 1,50,000 గృహాల విద్యుత్ అవసరాలను ఈ ప్లాంట్ తీరుస్తోంది.
పర్వతారోహకులకు పండుగే..
పర్యాటకులు ఈ ప్లాంట్ పై స్కైయింగ్ చేయొచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 85 మీటర్ల క్లైంబింగ్ వాల్‌ను ఈ ప్లాంట్‌లో ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడకు వచ్చే పర్వతారోహకులు బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కింది భాగంలో గ్లైడింగ్ ప్రాక్టీస్ చేసే సదుపాయం కూడా ఉంది. ఇక రిసార్ట్స్ తరహాలో ఇక్కడ కెఫే, బార్ కూడా ఉన్నాయండోయ్.. రూఫ్‌టాప్ కెఫేలో వేడి వేడి కాఫీ, చల్లని శీతలపానీయాలతో సేద తీరొచ్చు. సముద్రాన్ని చూస్తూ మీకు నచి్చన ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా డెన్మార్క్ వెళితే ఈ ప్లాంట్‌ను ఓ లుక్కేసి రండి.
Comments
Please login to add a commentAdd a comment