లేజర్‘షాక్’..
‘లేజేరియం’ టెండర్‌కు చుక్కెదురు !
ఒక్క బిడ్ కూడా దాఖలు కాని వైనం
ఖంగుతిన్న హెచ్‌ఎండీఏ అధికారులు
సాధ్యంగాని నిబంధనలే కారణం
సిటీబ్యూరో: గ్రేటర్ వాసులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న ‘లేజర్ షో’కు హంగులద్దేందుకు మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేసిన యత్నం బెడిసి కొట్టింది. ముచ్చటగా మూడోసారి చేసిన ప్రయత్నానికి కూడా చుక్కెదురవడం ఇంజినీరింగ్ అధికారులకు మింగుడుపడకుండా ఉంది. లుంబినీ పార్కు ఆవరణలోని లేజర్ షోను ‘న్యూ థీమ్స్’తో అద్భుతంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించిన హెచ్‌ఎండీఏ.. ఇటీవల గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. గడువు ముగియడంతో సోమవారం ఆ టెండర్స్ ఓపెన్ చేసిన అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో పిలిచిన టెండర్‌కు కనీసం ఒక్క బిడ్ కూడా దాఖలవ్వక పోవడం గమనార్హం. నగర సంస్కృతి, చరిత్ర తదితర అంశాలతో పాటు ఎడ్యుకేషన్ (అవగాహన), ఇన్ఫర్మేషన్ (సమాచారం) రిక్రియేషన్ (వినోదం) వంటి అంశాలను నేపథ్యంగా కొత్త థీమ్స్‌ను ప్లాన్ చేసిన అధికారులు రూ. 2.5 కోట్ల అంచనాలతో టెండర్లు ఆహ్వానించారు. అయితే, టెండర్‌లో ఆచరణ సాధ్యంకాని విధంగా నిబంధనలు పెట్టడంతో అసలుకే మోసం వచ్చిపడింది.
కఠిన నిబంధనల వల్లే..
లేజర్ షోను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు గతంలో రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినా పెద్దగా స్పందన రాలేదు. మొదట్లో రెండు సంస్థలు ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి చూపినా లేజర్ షోకు సంబంధించిన డిజైన్‌ను వారే రూపొందించుకోవాలన్న నిబంధనతో వెనుదిరిగారు. రెండోసారి ప్రదర్శన తాలూకు డిజైన్‌ను హెచ్‌ఎండీఏనే ఇస్తుందని స్పష్టం చేస్తూ మళ్లీ టెండర్ పిలిచారు. దీనికి సింగిల్ బిడ్ దాఖలు కావడంతో నిబంధనల ప్రకారం ఒక బిడ్ వస్తే ఆ టెండర్‌ను ఇవ్వడం సాధ్యం కాదని రద్దు చేశారు. ముచ్చటగా మూడోసారి టెండర్ పిలిచినా కొన్ని కఠిన నిబంధనలు పెట్టడంతో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గతానుభవం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన ఇంజినీరింగ్ అధికారులు ఆచరణ సాధ్యం గాని నియమ, నిబంధనలు టెండర్‌లో పొందుపరచడం ఆ ప్రాజెక్టు పట్ల వారికున్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.
ఈ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థ ఐదేళ్ల పాటు లేజర్ షో నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని, ఆ సంస్థ టర్నోవర్ రూ. 1 కోటి ఉండాలని, ఈ తరహా ప్రాజెక్టును గతంలో చేపట్టిన అనుభవం ఉండాలని, అందుకు నిదర్శనంగా తగిన సర్టిఫికెట్ జత చేయాలని, జాయింట్ వెంచర్‌కు అవకాశం లేదని.. ఇలా సవాలక్ష నిబంధనలు పెట్టారు. వంద కోట్ల ప్రాజెక్టుకు కూడా లేనివిధంగా రూ. 2.5 కోట్ల ప్రాజెక్టుకు నిబంధనలు విధంచడంతో దీనికోసం ఎవరూ ఆసక్తి చూపలేదు. ప్రీ బిడ్ మీటింగ్‌కు రెండు సంస్థలు హాజరైనా హెచ్‌ఎండీఏ విధించిన నిబంధనలు చూసి పత్తాలేకుండా పోయారు. ఈ విషయమై సంబంధిత అధికారిని సంప్రదించగా లేజర్ షోకు ఒక్క బిడ్ కూడా రాని విషయాన్ని స్పష్టం చేశారు. త్వరలో కన్సల్టెంట్‌తో మాట్లాడి నిబంధనలను సడలిస్తూ మళ్లీ టెండర్ పిలుస్తామని సెలవిచ్చారు.