ఎంతటివారైనా ఏదో కొంత సమయాన్ని తమతో తాము కాలక్షేపం చేసుకుంటూ గడిపినా, ఆ తర్వాత కొంత సమయాన్నైనా ఎవరితోనైనా గడపాలని అనుకుంటారు. అలా మరొకరితో సమయాన్ని గడపడం కోసం వాళ్లు మరో వ్యక్తి దగ్గరికి పోవడమో లేక ఆ పరిచితుడైన వ్యక్తికి కబురుచేసి రప్పించుకోవడమో చేస్తారు. ఇది లోక సహజమైన విషయం. అయితే సాయి మాత్రం ఎవరి సాంగత్యమూ తనకి అక్కర్లేదన్నట్లుగానే ఉండేవాడు. ఒంటరితనంలోనే – ఎందరితోనో తానున్నట్లుగా అనుకుంటూ ఉండేవాడేమో అనిపించేవాడు. సూర్యుడు అస్తమించాడనగానే మసీదులోకి వెళ్లేవాడు. పడుకోబోయేప్పుడు తన వస్తువులైన చిలుం – పొగాకు – రేకుడబ్బా – సటకాలని తృప్తిగా చూసుకుంటూండేవాడు. తన మోకాళ్ల వరకూ కప్పేస్తూ ఉండే పొడవైన చొక్కా(కఫనీ)ని ధరించి ఆ లోపల ఒక గోచీని ధరించేవాడు. తెల్లని శుభ్రమైన గుడ్డని తలచుట్టూ బిగించి గట్టిగా కట్టుకోవడమే కాక, ఆ మిగిలిన గుడ్డని బాగా మెలితిప్పి ఎడమచెవి వద్ద ముడివేసి ఉంచేవాడు. తన కఫనీకి అక్కడక్కడా చిరుగులున్నా ఎంతో సంతృప్తితో ఉండేవాడు. ఎవరైనా ఆయన్ని చూడ్డానికొచ్చినప్పుడు – తాను చిరిగిన దుస్తులతో ఉన్నాననే తక్కువదనం, బిడియం ఆయనలో ఏమాత్రమూ ఉండేది కాదు. వెనక్కి వేలాడుతూంటే ఆ ముడివేసిన వస్త్రం మిగిలిన భాగం ఓ జడలాగా అనిపిస్తూ ఉండేది, దూరంగా నిలబడి చూస్తుంటే. ఒక్కోసారి ఆ ఎడమచెవి వద్ద వస్త్రాన్ని ముడివేయగా మిగిలిన వస్త్రం అక్కడి నుండి ఎడమభుజం మీదుగా వక్షస్థలమ్మీదికి వేలాడుతూ కనిపిస్తూండేది.
ఒక్కోసారి వారం, మళ్లీ మాట్లాడితే పదిరోజులైనా స్నానమే చేయకుండా ఉంటూండేవాడు. పాదాలకెప్పుడూ చెప్పులు ధరించేవాడు కాదు. ఇటు తోటకి వెళ్లినా అటు చావడి వైపుకి వెళ్లినా ఒట్టి పాదాలతో వెళ్లడమే ఆయనకు అలవాటు. తిరిగి తిరిగి వచ్చాక కూచోవాల్సి వస్తే పాతబడి చిరుగులతో కనిపించే ఆ గోనెపట్టాయే అతనికి గొప్ప ఆసనంగా ఉండేది. దాన్నేదో రాజులు వేసుకునే మెత్తని పట్టువస్త్రం తొడిగిన మెత్తని దిండుగా భావించేవాడు. రాత్రింబవళ్లూ ఆ గోనెసంచి అక్కడే ఉండేది. చలి నుండి తనని తప్పించుకోవడానికి అక్కడ ‘ధుని’ (నిరంతరం నిప్పుతో వెలుగుతూండే స్థలం) ఉండేది. మసీదులో దక్షిణానికి ముఖాన్ని పెట్టుకుని, తన ఎడమచేతిని ఆ చిన్న గోడలా ఉండే కట్టడం మీద పెట్టుకుని కూర్చుని కనిపిస్తూండేవాడు. వ్యక్తిలోని అహంకారం, అజ్ఞానం, అవమానభారం, తిరస్కారం, ప్రాపంచికమైన ప్రలోభాలూ... ఇలాంటి వాటన్నింటినీ అగ్నిలో ఆహుతి చేయాలనే దానికి సంకేతంగా ధుని వెలుగుతున్నట్లుగా భావిస్తూ నిరంతరం ఆ ధునినే శ్రద్ధతో, ఏకాగ్రతతో చూస్తూ కాలాన్ని గడుపుతూ, ఎప్పుడూ ‘అల్లా హో మాలిక్!’ అని పైకి అంటూండేవాడు. అహంకారం, అభిమానం అనే రెంటికీ సాక్ష్యంగా ప్రతీకగా రెండే రెండు కర్రలని ఎప్పటికప్పుడు ధునిలో వేస్తూ ఆ అగ్ని ఆరిపోకుండా ప్రజ్వరిల్లుతూ ఉండేలా చూసుకుంటూండేవాడు. ‘అల్లాహ్ హో మాలిక్!’ అంటూ జెండాని ఎగరేస్తూండేవాడు. ఆ మసీదు చాలా ఇరుకుగా ఉండేది. అయినా సరే అదే మసీదులో తిరుగుతూండేవాడు, నిద్రించేవాడు. తనని కలవడానికి వచ్చిన భక్తుల్ని కూడా అక్కడికే రమ్మనేవాడు. మరో విచిత్రమేమంటే బాబాని కలవాలంటే ఆ మసీదులోకి పోవాలి కదా! అది చదును చేయబడిన నేల కాదు. మోకాళ్ల లోతు గుంటలు. చిన్న చిన్న గోతులు. ఎత్తు పల్లాలతో నేల ఉండేది. తన మీద గనక నిజమైన భక్తి, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం ఉంటే ఈ అసౌకర్యాలని లెక్కించరుగదా! అనేది ఆయన దృఢ విశ్వాసం. శారీరక వ్యాధుల్ని నివారించుకోదల్చిన వారూ, మనో వ్యాధుల్ని పోగొట్టుకోదల్చినవారూ, ఆయనని గురించి అనేక విధాలుగా విని ప్రసిద్ధుడైన ఆయన ఎందుకంతటి ప్రసిద్ధిని సంపాదించగలిగారో చూసి పోదామని వచ్చిన వారూ, వారి వెంట వచ్చినవారూ... ఇలా అందరూ ఆ ఇరుకు మసీదులోనే ఆ గుంతలు గోతుల్లోనే వస్తూ అసౌకర్యమనే భావనకి ఏ కోశానా గురయ్యేవారు కాదు.
ఆ కారణంగానే రోజురోజుకీ వచ్చేవారి సంఖ్య పెరిగిపోతూనే వచ్చింది గాని తరగనే తరగలేదు. అదే తీరుగా ఇందరు తండోపతండాలుగా తన దగ్గరికొస్తున్నారు గదా! అని ఏనాడూ సాయి తన ఆసనమైన పాతబడిన గోనె సంచినీ, ఇరుకు మసీదునీ, కుట్లూడిన చిరుగులతో కనిపిస్తున్న కఫనీని మార్చుకుందామనే ఆలోచనకీ రాలేదు. ఇదీ నిజమైన ఫకీరు లక్షణమంటే. ఇందరు ఇన్నిమార్లు వస్తూ మరికొందరిని కూడా ఎందుకు తీసుకొస్తున్నారు? రావడంలో, వస్తూ ఉండటంలో రహస్యమేంటీ? కారణమేమిటీ? దయనిండినవీ, దర్శించేవారికి వాళ్ల తప్పుల్ని వారికి అర్థమయ్యేలా వివరించగలిగినవీ, ఓదార్పునిచ్చేవీ, బాధలు తీరిపోతాయనే తీరు ఉపదేశాన్ని మౌనంగా ఇవ్వగలిగినవీ ఆకర్షణకి గనులలాగా ఉన్నవీ అయిన ఆయన ఆ కళ్లే. ఆ రోజున తన గుర్రమే ప్రాణంగా ఉన్న చాంద్‌పాటిల్ అంత ఎండలో అంతటి ఆందోళనలోనూ ఆకర్షించినవి సాయి కళ్లే. ఆయన్ని తన ఇంట్లో అలా ఉంచుకుని నిరంతరం సేవిస్తూ ఉండటానిక్కూడా కారణం ఆ కళ్లే. ప్రతిదానికీ తగిన కారణం కావాలంటూ ఆలోచించేవాడూ, దొరికిన కారణం నచ్చని పక్షంలో, ఏమాత్రమూ నమ్మనివాడూ అయిన అన్నాసాహెబు సాయిని దర్శించిన మరుక్షణంలో ఆయన జీవితాన్ని గ్రంథరూపంలో సాయిచరిత్రగా రాయాలనే ఆలోచనకి శ్రీకారాన్ని చుట్టించినవి కూడా ఆ కళ్లే. పరమ భయంకరుడూ, తన అరుపులతో షిరిడీ గ్రామ ప్రజలకి నిద్రాభంగాన్ని కలిగించేవాడూ, ఎందరు నచ్చజెప్ప ప్రయత్నించినా దగ్గరక్కూడా రానివ్వనివాడూ అయిన రోహిల్లా సాయిని దర్శించడానికి వచ్చి, దర్శించి అక్కడే ఉండిపోయేలా చేసినవి ఆ కళ్లే.
ఖండోబా దేవాలయ అర్చకుడూ, సంప్రదాయపరుడూ, బ్రాహ్మణుడూ అయిన మహల్సాపతి ‘యా! సాయీ!’ అని సాదరంగా ఆహ్వానించడానికి కారణం ఆ కళ్లే. దాసగణుకి గంగాయమునలని సాయి చూపించగలడనీ ఆ తీరు దృఢ విశ్వాసాన్ని కలిగించినది ఆ కళ్లే. అందుకే సాయిని దర్శించదలిచి వెళ్లిన అందరూ కూడా దర్శించవలసింది ఆ సాయి నేత్రాలనే. బాధలతో ఉన్నవారికి బాధ నివారిణులూ – మనోవ్యాధితో ఉన్నవారికి ఉన్న మనోధైర్య కారిణులూ – కష్టాలలో మునిగి తేలుతున్న వారికి చేతి ఊతనిస్తాననే విశ్వాసదాయినులూ – సాయికి మరింత దగ్గర కాగలుగుతామన్న ఆనంద విధాయినులూ ఆ కళ్లు. ఆ కళ్లు. ఆ కళ్లే.
చూసి తీరాలనే ఆర్తితో...
లోకంలో కనిపించే ఎన్నో పక్షుల్ని, పశువుల్ని, మృగాల్ని, సర్పాలని, వాహనాలని, వ్యక్తుల్ని అలా చూసేస్తుంటాం. అన్నింటినీ మన మనసు ఇష్టంతో చూడదు. అలా చూడని పక్షంలో ఆ దృశ్యాన్ని బుద్ధికి పంపించదు. అలా బుద్ధికి చేరని దేన్నీ, ఆ బుద్ధి తనలో దాచదు. ఆ కారణంగా వేటిని మన మనసు గ్రహిస్తుందో, తాను ఆనందించి బుద్ధికి అందజేస్తుందో ఆ దృశ్యాలు మాత్రమే మనకి అనుక్షణం కళ్లముందు కనిపిస్తూ ఉంటాయి. అందుకే శాస్త్రం అంది – ఏదో యథాలాపంగా చూడటాన్ని కేవలం చూడటమనీ, అదే మరి రెండవతీరుగా బుద్ధిలో దాచేంత విధంగా చూడటాన్ని దర్శనమనీ. అందుకే దైవ దర్శనం అంటూంటాం.
ఈ నేపథ్యంతో పరిశీలిస్తే సాయిని చూసినవారు కొందరున్నారు. దర్శించినవారు ఎందరో ఉన్నారు. మనం ఎదుటివారిని ఎలా చూస్తామో ఆ చూపుకి ఉన్న లోతుతనాన్ని బట్టే కదా ఎదుటివారు కూడా మనని చూసేది! ఆ కారణంగా కేవలం చూడటమనే పనిని చేసిన ఎందర్నో సాయి ‘రమ్మనలేదు – ఇంకా రావేమిటి? అనలేదు – ఎందుకు రావో చూస్తాననలేదు. నేను రానే రానని చెప్పిన నానా వంటి వారికి మళ్లీ కబురు చేసి మరీ రప్పించుకోకుండానూ ఉండలేదు! ఈ దృష్టిభేదాన్ని మనం గమనించాలి. ‘గౌలిబువా’ అనే తొంభై ఐదు సంవత్సరాల భక్తుడొకాయన ఉండేవాడు. ఆయనకి సాయి మీద కాదు భక్తి. పండరీపురంలో ఉండే విఠ్ఠలపాండురంగని మీదే దృష్టంతా. సంవత్సరంలో ఉండే 12 నెలల కాలంలో 8 నెలలపాటు పాండురంగని (విఠ్ఠలుడు) మీదే బుద్ధిని నిలిపి ఆ పండరీపురంలోనే ధ్యానంలోనే కాలాన్ని గడిపి, ఆ మిగిలిన 4 నెలల కాలాన్నీ గోదావరీ నదీ తీరాన తపస్సు చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తూండేవాడు. ఆ నెలల కాలమూ కూడా శ్రీహరి యోగనిద్రకి ఉపక్రమించే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ ఉండే కాలంలోనే. అంటే శయన ఏకాదశి (శ్రీహరి యోగనిద్రని ముగించి నిద్రనుండి లేచే రోజు) వరకు మాత్రమేనన్నమాట. ఈ మధ్యలో ఒకసారి గోదావరి ఒడ్డునే ఉంటాడు కాబట్టి షిరిడీకొచ్చి సాయిని కలిసి వెళ్తూండేవాడు. ఇలా చాలాకాలం పాటు జరుగుతూ వచ్చింది. పైన అనుకున్నట్టుగా సాయిని ఆయన చూసి వెళ్తూండేవాడే తప్ప దర్శించి వెళ్లేవాడు కాదు. ఆ కారణంగా సాయి గొప్పదనం సర్వదేవతా సమూహం సాయి అనే భావం ఏనాడూ కలగలేదు ఆ వృద్ధ భక్తునికి.
తన సామాను మోసేందుకోసం ఓ గాడిదని వెంటబెట్టుకుని దానికి తగిన ఆహారం మొదలైనవి సమకూర్చేందుకై ఓ వ్యక్తిని తోడు తీసుకుని ఈ 4 నెలలపాటూ గోదావరి ఒడ్డున ఉంటూండేవాడు. అలా ఒకసారి సాయివద్దకొచ్చి సాయిని అనుకోకుండా దర్శనదృష్టితో చూశాడు. అంతే! గౌలిబువా దృష్టి మొత్తం మారిపోయింది. దాంతో పైకి అననే అన్నాడు – సాయి నవరత్నాల్లో వజ్రంలాంటి వాడు. ఏ విధంగానూ ముక్కలు కానిదీ, నాశనం కానిదీ, కోయడానికి అవకాశమీయనిదీ అయిన వజ్రం ఎలా ఆకర్షణీయమైనదో, దృఢమైనదో అలా సాయి కూడా ఎవరికీ వశుడు కానివాడు – అహంకారం లేనివాడు – తన స్థాయిని గమనించి అందరినీ రానీయకుండా ఉంచాలనీ, కొందరినీ రప్పించుకోవాలనీ భావించేవాడు కాడు. ఇదంతా నా పూర్వ ఆలోచన. ఇప్పుడు మాత్రం సాయిని ఆర్తితో భక్తితో దర్శించాక నా ఆలోచనే మారిపోయింది. సాయి నన్ను చూసిన ఆ చూపులకున్న లోతుతనంతో నాకు అర్థమయింది – సాయి నాకిష్టమైన పండరీనాథుడు పాండురంగడే – అని అనేశాడు. మనం కూడా గమనించాలి. దైవాన్ని చూడరాదనీ, దర్శించాలనీ, అలా దర్శించగలిగినప్పుడూ, దర్శించినప్పుడూ మాత్రమే భవదవతార తత్త్వం మనకి గోచరిస్తుందనీ – అలా కాక ఏదో దేవాలయానికి వెళ్లాల్సిన అవసరం అలవాటూ ఉన్నాయనే భావంతోగాని వెళ్తే దేవుణ్ని చూడటమే జరుగుతుందనీ – దర్శించడం వీలు కాదనీ, ఇలా చూసిరావడం వల్ల సమయనష్టం తప్ప ప్రయోజనం ఏ మాత్రమూ ఉండదనీను. అలాంటి ఆర్తితో చూసినప్పుడే అది దర్శనం అనిపించుకుంటుందన్నమాట. కాబట్టి సాయిని దర్శించాలని అర్థం చేసుకుందాం!
అహంకారులకి మార్గదర్శనం
సాయికి ఇప్పుడు బాబాసాహెబ్ అనే అతనుండేవాడు. అతనింటికే వెళ్లి దాదాపు రోజురోజంతా అక్కడే గడిపేవాడు. అంతటి ఉత్తముడు బాబాసాహెబ్. అతనికో తమ్ముడున్నాడు. పేరు నానాసాహెబ్. అతనికి సంతానం ఎంతకాలానికీ కలగలేదు. ఎదురుచూసి ఎదురుచూసి తన భార్య అనుమతిస్తే రెండో పెళ్లిని కూడా చేసుకున్నాడు. అయినా అతనికి సంతానం కలగలేదు. నానా సాహెబ్ (నానా) తహశీల్దార్ ఉద్యోగాన్ని చేస్తుండేవాడు. ప్రభుత్వోద్యోగి అయిన కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువమందితో పరిచయాలున్నాయి అతనికి. అలాంటి నానాకి సాయి ఓసారి ‘అప్పాకులకర్ణి’ అనే అతనితో కబురు చేశాడు – ఓసారి నానాని చూడాలనుంది. తనవద్దకి రావలసిందని. ఆ మాటల్ని లెక్కచేయకుండా నానా కాలాన్ని గడిపేస్తూ వచ్చాడు. మళ్లీ మళ్లీ కబురుపంపాడు సాయి. దాంతో తనకి కబురు తెచ్చిన కులకర్ణిని నిందిస్తూ – ‘నేనేమీ ఖాళీగా ఫకీరులా లేను. ప్రభుత్వోద్యోగిని. పని ఒత్తిడిలో ఉన్నా’ అంటూ నిష్టూరంగా దెప్పిపొడుపుగాను కూడా మాట్లాడాడు. కులకర్ణి వెళ్లిపోయాక తనలో తాను నవ్వుకుంటూ – ఈ ముస్లిం ఫకీరు దగ్గరికి నేను పోవడమా? మాయా శక్తులూ, మాటల గారడీలూ ఉన్న సాయి దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది? పైగా రెవెన్యూ ఉద్యోగం చేస్తున్న నా స్థాయి ఎక్కడ? చెట్టు కింద చెప్పుల్లేకుండా కూచునే సాయి స్థాయి ఎక్కడ? చేతులు కట్టుకుని ఆ ఫకీరు ఎదురుగా నిలబడితే నన్ను గౌరవించే అందరూ నన్ను చూసి నవ్వరూ?’ అని ఆలోచించి రానేరానంటూ సాయికి వర్తమానాన్ని పంపించాడు నానా.
అయితే ఆశ్చర్యకరమైన అంశమేమంటే ఎందుకో తెలియదుగానీ నానా సాయిని దర్శించాల్సిన పరిస్థితొచ్చింది. నానా సాయిని చూస్తూనే ‘సాయీ! నన్నెందుకు పిలిపించారు?’‡అని అడుగుతూ ఆయన కళ్లలో కళ్లు పెట్టి చూశాడు. అయస్కాంతం దగ్గరగా ఇనుపవస్తువుని పెడితే ఎలా ఆ వస్తువు కాస్తా ఆ అయస్కాంతపు ఆకర్షణకి గురై అయస్కాంతానికి హత్తుకుపోతుందో, బలవంతాన లాగితే తప్ప ఇవతలికి రాదో అలా నానా కళ్లు సాయి కనుల ఆర్ద్రతనుండి బయటికి రాలేకపోయాయి. అంతటితో ఆగక, ‘నానా! లోకంలో ఎందరు లేరు? అయినా నిన్నే ఎందుకు పిలిపించానంటావు? నువ్వు నీ నోటికొచ్చిన తీరులో మాట్లాడినా మళ్లీ ఎందుకని ఆహ్వానించానంటావు? బాగా ఆలోచించుకో! నీకూ నాకూ మూడు జన్మలనుండీ బంధం ఉందయ్యా! అది నీకు తెలియదు. నాకే తెలుసు. అందుకే ఓసారి చూద్దామని కబురంపాను. నాకో నమ్మకం ఉంది నీ మీద – నువ్వు ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా వస్తావని. వచ్చావుగా!’ అంటూ సాయి మాట్లాడుతూ ఉంటే ఆయన దయార్ద్రమయమైన కళ్లలో తన కళ్లని తిప్పలేక ఉంచిన నానా వెక్కి వెక్కి ఏడుస్తూ, ‘సాయీ! అపరాధం. మహాపరాధం. అపచారం. మహాపచారం అయిపోయింది’ అంటూ ఉండగానే సాయి తన ఎడమచేతిని నానా తలమీద పెట్టాడు. అంతే! సాయి కనిపించలేదు. ఒక క్షణం నానాకి సాయిలో ధర్మమయమైన వింటిని ధరించిన శ్రీరామచంద్రుడు కనిపించాడు. మళ్లీ అంతలోనే జటాజూటాన్ని ధరించి పరమానందంతో ఆశీర్వదిస్తున్న శివుడు దర్శనమిచ్చాడు. మళ్లీ క్షణంలోనే మహా బలిష్ఠుడూ, నవవ్యాకరణ పండితుడూ, అమోఘకంఠస్వరం కలవాడూ అయిన ఆంజనేయుడు కనిపించాడు. నానా తనని తాను నమ్మలేక కలా? నిజమా? అనుకుని నిజమే అని అనిపించాక ‘సాయిదేవా!’ అన్నాడు హృదయపూర్వకంగా. అక్కడి నుండి దైవంతో సమానంగా కొలుస్తూంటే సాయి దర్శనం కారణంగా నానాకి సంతానం కలిగింది. సాయిని చూస్తే సంతానం కలగడమా? అది సాధ్యమేనా? సాధ్యమే! ఎలాగో చూద్దాం!
(సశేషం)
ఆ కనులు ఆకర్షణ గనులు
Published Sun, Jul 22 2018 12:41 AM | Last Updated on Sun, Jul 22 2018 12:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment