SPACE DEBRIS: అంతరిక్ష వీధిలో ట్రాఫిక్‌ జామ్‌! | SPACE DEBRIS: Space debris are defunct human-made objects in space | Sakshi
Sakshi News home page

SPACE DEBRIS: అంతరిక్ష వీధిలో ట్రాఫిక్‌ జామ్‌!

Published Mon, Feb 5 2024 4:47 AM | Last Updated on Mon, Feb 5 2024 12:15 PM

SPACE DEBRIS: Space debris are defunct human-made objects in space - Sakshi

అంతరిక్ష వీధి ఉపగ్రహాలతో కిక్కిరిసిపోతోంది. అగ్ర రాజ్యాలు మొదలుకుని చిన్నాచితకా దేశాల దాకా కొన్నేళ్లుగా ఎడాపెడా ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నాయి. స్పేస్‌ ఎక్స్‌ వంటి బడా ప్రైవేట్‌ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతూ వస్తోంది.

అలా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్యా విపరీతంగా పెరుగుతోంది. దాంతోపాటే ఉపగ్రహ సంబంధిత వ్యర్థాల పరిమాణమూ నానాటికీ పెరిగిపోతోంది. ఈ ధోరణి అంతరిక్ష సంస్థలతోపాటు సైంటిస్టులను ఇప్పుడు బాగా కలవరపెడుతోంది...

2023లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలెన్నో తెలుసా? ఏకంగా 2,917! అప్పుడెప్పుడో 1957లో అమెరికా తొలిసారిగా స్పుతి్నక్‌ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించి చరిత్ర సృష్టించింది. అప్పటినుంచి 1987 దాకా 30 ఏళ్లలో జరిగిన మొత్తం అంతరిక్ష ప్రయోగాల కంటే కూడా ఒక్క 2023లో విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్యే చాలా ఎక్కువట!

ప్రస్తుతం అంతరిక్షంలో ఏకంగా 12,930 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి! ఇవిగాక అంతరిక్షానికి చేరాక విఫలమైనవి, కొంతకాలం పాటు పని చేసి చేతులెత్తేసినవి, కాలపరిమితి తీరి భూమితో లింకులు తెగిపోయినవి కనీసం 24 వేల పై చిలుకే ఉంటాయట! ఇవన్నీ కూడా భూమి చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాయి.

మొత్తమ్మీద యాక్టివ్‌ ఉపగ్రహాలు, వ్యర్థాలూ కలిపి 10 సెంటీమీటర్ల కంటే పెద్ద ‘అంతరిక్ష వస్తువుల’ మొత్తం సంఖ్య 2023 చివరికల్లా ఏకంగా 37 వేలు దాటిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి! అంతకంటే చిన్నవాటి సంఖ్యకైతే అయితే లెక్కాపత్రం లేదు. మొత్తమ్మీద అంతరిక్షంలో ఇలాంటి వ్యర్థాల పరిమాణం 2020 చివరికే 8 వేల టన్నులు దాటిపోయిందట!

వీటితో   ప్రమాదాలెన్నో...
► అంతరిక్ష వ్యర్థాలతో ప్రమాదాలు ఇన్నీ అన్నీ కావు...
► భూ కక్ష్యలో తిరుగుతున్న యాక్టివ్‌ ఉపగ్రహాలను ఇవి ఢీకొనే ముప్పుంటుంది. అదే జరిగితే అత్యంత వ్యయప్రయాసలతో ప్రయోగించిన ఉపగ్రహాల ఆయువు అర్ధాంతరంగా తీరిపోతుంది.
► 1981లో కాస్మోస్‌ 1275 ఉపగ్రహం ఇలాగే అంతరిక్ష వ్యర్థాలను ఢీకొని పేలిపోయింది.
► 1996లో ఫ్రాన్స్‌కు చెందిన బుల్లి ఉపగ్రహం సెరీస్‌ను కూడా 1986లో పేలిపోయిన ఏరియన్‌ ఉపగ్రహపు శకలాలు ఢీకొన్నాయి.
► 2006లో రష్యా ఉపగ్రహం ఎక్స్‌ప్రెస్‌ కూడా గుర్తు తెలియని శకలం దెబ్బకు           శాశ్వతంగా           మూగబోయింది.
► 2009లో టెరా, 2010లో ఆరా 2013లో జియోస్‌ వంటి పలు ఉపగ్రహాలు ఇలాగే బుల్లి శకలాల
బారినపడ్డాయి.
► 2009లోనైతే 950 కిలోల బరువున్న కాస్మోస్‌ 2251, 560 కిలోల ఇరీడియం33 ఉపగ్రహాలు పరస్పరం ఢీకొని పేలిపోయాయి. వినువీధిలో రెండు భారీ ఉపగ్రహాలు గుద్దుకోవడం అదే తొలిసారి!
► అంతరిక్ష వ్యర్థాల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే కొన్నాళ్లకు భూ దిగువ కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపడమే అసంభవంగా మారవచ్చు.


ఐఎస్‌ఎస్‌కూ ముప్పే
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు కూడా ఈ వ్యర్థాలతో పెను ముప్పే పొంచి ఉండటం మరింత ఆందోళనకరం. 2019 నాటికే ఐఎస్‌ఎస్‌ను 1,400కు పైగా బుల్లి వ్యర్థాలు ఢీకొట్టాయట. వీటి బారినుంచి కాపాడుకునేందుకు షీల్డింగ్‌ వ్యవస్థ ఐఎస్‌ఎస్‌లో ఉంది. కానీ ఐఎస్‌ఎస్‌ తాలూకు బయటి భాగాలకు మాత్రం ఆ రక్షణ లేదు. పైగా వాటిని వ్యర్థాలు ఢీకొనే ముప్పు మరింత ఎక్కువ! వ్యర్థాలు ఢీకొట్టనున్నాయన్న హెచ్చరికలతో ఐఎస్‌ఎస్‌ సిబ్బంది ఇప్పటిదాకా మూడుసార్లు సమీపంలోని సూయజ్‌ క్యాప్సూల్లోకి వెళ్లి దాక్కోవాల్సి వచి్చంది!

రోజుకొకటి చొప్పున భూమిపైకి...
► ఈ అంతరిక్ష వ్యర్థాలు కక్ష్య నుంచి జారి క్రమంగా భూ వాతావరణంలోకీ ప్రవేశిస్తుంటాయి.
► చిన్నవైతే భూమిదాకా చేరకుండానే గాల్లోనే మండిపోతాయి.
► పెద్దవి మాత్రం భూమిపై పడుతుంటాయి.
► అలా గత 50 ఏళ్లుగా సగటున రోజుకు కనీసం మూడు వ్యర్థాలు కక్ష్య కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయట.
► వాటిలో కనీసం ఒక్కటైనా భూమిపై పడుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి!
► ఓజోన్‌ పొర దెబ్బ తినేందుకు ఇవి కూడా కారణమవుతున్నాయి.
► పైగా ఈ వ్యర్థాల దెబ్బకు సౌర తుఫాన్లు, కాస్మిక్‌ రేడియేషన్‌ బారినుంచి భూమిని కాపాడే మాగ్నెటోస్పియర్‌ కూడా దెబ్బ తింటోందని తాజా అధ్యయనంలో తేలింది.
► ఈ అంతరిక్ష వ్యర్థాల కట్టడికి ఇప్పటిదాకానైతే అంతర్జాతీయంగా ఎలాంటి చట్టం గానీ, దేశాల మధ్య ఒప్పందాలు గానీ లేవు.
► అయితే ఈ దిశగా ఐరాస తాలూకు పీస్‌ఫుల్‌ యూజెస్‌ ఆఫ్‌ ఔటర్‌ స్పేస్‌ కమిటీ 2007లో కొన్ని నిర్దేశాలు రూపొందించింది. 


– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement