Satellite experiments
-
SPACE DEBRIS: అంతరిక్ష వీధిలో ట్రాఫిక్ జామ్!
అంతరిక్ష వీధి ఉపగ్రహాలతో కిక్కిరిసిపోతోంది. అగ్ర రాజ్యాలు మొదలుకుని చిన్నాచితకా దేశాల దాకా కొన్నేళ్లుగా ఎడాపెడా ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నాయి. స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రైవేట్ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతూ వస్తోంది. అలా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్యా విపరీతంగా పెరుగుతోంది. దాంతోపాటే ఉపగ్రహ సంబంధిత వ్యర్థాల పరిమాణమూ నానాటికీ పెరిగిపోతోంది. ఈ ధోరణి అంతరిక్ష సంస్థలతోపాటు సైంటిస్టులను ఇప్పుడు బాగా కలవరపెడుతోంది... 2023లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలెన్నో తెలుసా? ఏకంగా 2,917! అప్పుడెప్పుడో 1957లో అమెరికా తొలిసారిగా స్పుతి్నక్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించి చరిత్ర సృష్టించింది. అప్పటినుంచి 1987 దాకా 30 ఏళ్లలో జరిగిన మొత్తం అంతరిక్ష ప్రయోగాల కంటే కూడా ఒక్క 2023లో విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్యే చాలా ఎక్కువట! ప్రస్తుతం అంతరిక్షంలో ఏకంగా 12,930 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి! ఇవిగాక అంతరిక్షానికి చేరాక విఫలమైనవి, కొంతకాలం పాటు పని చేసి చేతులెత్తేసినవి, కాలపరిమితి తీరి భూమితో లింకులు తెగిపోయినవి కనీసం 24 వేల పై చిలుకే ఉంటాయట! ఇవన్నీ కూడా భూమి చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాయి. మొత్తమ్మీద యాక్టివ్ ఉపగ్రహాలు, వ్యర్థాలూ కలిపి 10 సెంటీమీటర్ల కంటే పెద్ద ‘అంతరిక్ష వస్తువుల’ మొత్తం సంఖ్య 2023 చివరికల్లా ఏకంగా 37 వేలు దాటిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి! అంతకంటే చిన్నవాటి సంఖ్యకైతే అయితే లెక్కాపత్రం లేదు. మొత్తమ్మీద అంతరిక్షంలో ఇలాంటి వ్యర్థాల పరిమాణం 2020 చివరికే 8 వేల టన్నులు దాటిపోయిందట! వీటితో ప్రమాదాలెన్నో... ► అంతరిక్ష వ్యర్థాలతో ప్రమాదాలు ఇన్నీ అన్నీ కావు... ► భూ కక్ష్యలో తిరుగుతున్న యాక్టివ్ ఉపగ్రహాలను ఇవి ఢీకొనే ముప్పుంటుంది. అదే జరిగితే అత్యంత వ్యయప్రయాసలతో ప్రయోగించిన ఉపగ్రహాల ఆయువు అర్ధాంతరంగా తీరిపోతుంది. ► 1981లో కాస్మోస్ 1275 ఉపగ్రహం ఇలాగే అంతరిక్ష వ్యర్థాలను ఢీకొని పేలిపోయింది. ► 1996లో ఫ్రాన్స్‌కు చెందిన బుల్లి ఉపగ్రహం సెరీస్ను కూడా 1986లో పేలిపోయిన ఏరియన్ ఉపగ్రహపు శకలాలు ఢీకొన్నాయి. ► 2006లో రష్యా ఉపగ్రహం ఎక్స్‌ప్రెస్ కూడా గుర్తు తెలియని శకలం దెబ్బకు శాశ్వతంగా మూగబోయింది. ► 2009లో టెరా, 2010లో ఆరా 2013లో జియోస్ వంటి పలు ఉపగ్రహాలు ఇలాగే బుల్లి శకలాల బారినపడ్డాయి. ► 2009లోనైతే 950 కిలోల బరువున్న కాస్మోస్ 2251, 560 కిలోల ఇరీడియం33 ఉపగ్రహాలు పరస్పరం ఢీకొని పేలిపోయాయి. వినువీధిలో రెండు భారీ ఉపగ్రహాలు గుద్దుకోవడం అదే తొలిసారి! ► అంతరిక్ష వ్యర్థాల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే కొన్నాళ్లకు భూ దిగువ కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపడమే అసంభవంగా మారవచ్చు. ఐఎస్‌ఎస్‌కూ ముప్పే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు కూడా ఈ వ్యర్థాలతో పెను ముప్పే పొంచి ఉండటం మరింత ఆందోళనకరం. 2019 నాటికే ఐఎస్ఎస్ను 1,400కు పైగా బుల్లి వ్యర్థాలు ఢీకొట్టాయట. వీటి బారినుంచి కాపాడుకునేందుకు షీల్డింగ్ వ్యవస్థ ఐఎస్ఎస్లో ఉంది. కానీ ఐఎస్ఎస్ తాలూకు బయటి భాగాలకు మాత్రం ఆ రక్షణ లేదు. పైగా వాటిని వ్యర్థాలు ఢీకొనే ముప్పు మరింత ఎక్కువ! వ్యర్థాలు ఢీకొట్టనున్నాయన్న హెచ్చరికలతో ఐఎస్ఎస్ సిబ్బంది ఇప్పటిదాకా మూడుసార్లు సమీపంలోని సూయజ్ క్యాప్సూల్లోకి వెళ్లి దాక్కోవాల్సి వచి్చంది! రోజుకొకటి చొప్పున భూమిపైకి... ► ఈ అంతరిక్ష వ్యర్థాలు కక్ష్య నుంచి జారి క్రమంగా భూ వాతావరణంలోకీ ప్రవేశిస్తుంటాయి. ► చిన్నవైతే భూమిదాకా చేరకుండానే గాల్లోనే మండిపోతాయి. ► పెద్దవి మాత్రం భూమిపై పడుతుంటాయి. ► అలా గత 50 ఏళ్లుగా సగటున రోజుకు కనీసం మూడు వ్యర్థాలు కక్ష్య కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయట. ► వాటిలో కనీసం ఒక్కటైనా భూమిపై పడుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి! ► ఓజోన్ పొర దెబ్బ తినేందుకు ఇవి కూడా కారణమవుతున్నాయి. ► పైగా ఈ వ్యర్థాల దెబ్బకు సౌర తుఫాన్లు, కాస్మిక్ రేడియేషన్ బారినుంచి భూమిని కాపాడే మాగ్నెటోస్పియర్ కూడా దెబ్బ తింటోందని తాజా అధ్యయనంలో తేలింది. ► ఈ అంతరిక్ష వ్యర్థాల కట్టడికి ఇప్పటిదాకానైతే అంతర్జాతీయంగా ఎలాంటి చట్టం గానీ, దేశాల మధ్య ఒప్పందాలు గానీ లేవు. ► అయితే ఈ దిశగా ఐరాస తాలూకు పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్ కమిటీ 2007లో కొన్ని నిర్దేశాలు రూపొందించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉపగ్రహ ప్రయోగాలను చౌక చేసే కొత్త ఇంజిన్లు!
రాకెట్ ప్రయోగాలను మరింత చౌకగా పూర్తి చేసేందుకు గ్లాస్గౌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఇంజిన్‌ను అభివృద్ధి చేశారు. ఉపగ్రహాలను పైకి తీసుకెళ్లే క్రమంలో ఈ ఇంజిన్ తనను తాను తినేసుకుంటుంది. అదెలా? అని ఆశ్చర్యపోతున్నారా? కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు వాడే రాకెట్లలో ఇంధనం తక్కువగా ఉంటుందిగానీ.. వాటి బరువు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంధనాలు కలిసిపోకుండా, పేలిపోకుండా ఉండేందుకు ఇది అత్యవసరం. బరువు ఎక్కువ కావడం వల్ల ఇంధనంతోపాటు ప్రయోగించే ఉపగ్రహాల బరువుపై కూడా పరిమితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ఇంధనం ఖర్చయిపోయిన తరువాత భాగాలను కూడా కరిగించుకుని చోదకశక్తిని ఇచ్చే సరికొత్త ఇంజిన్‌ను తాము తయారు చేశామని డాక్టర్ ప్యాట్రిక్ హార్క్నెస్ తెలిపారు. బయటివైపున ఘన ఇంధనం.. లోపలివైపున ద్రవ ఇంధనమున్న ప్రొపెల్లంట్ కడ్డీలతో ఇది సాధ్యమవుతుందని, ఈ కడ్డీని బాగా వేడెక్కిన ఇంజిన్లోకి నెమ్మదిగా జొప్పించినప్పుడు అక్కడ ఏర్పడే వాయువులు మరింత చోదకశక్తిని అందిస్తాయని వివరించారు. నమూనా ఇంజిన్‌ను తాము దాదాపు నిమిషం పాటు మండించగలిగామని చెప్పారు. ఇంజిన్ బరువును తగ్గించడం ద్వారా మరింత ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలేర్పడుతుందని అన్నారు. -
చౌకగా ఉపగ్రహ ప్రయోగాలు
- సరికొత్తగా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం: ఇస్రో చైర్మన్ కిరణ్ - జీశాట్–9లో ఒకట్రెండు రోజుల్లో ఈ పరీక్ష - తక్కువ ఖర్చుతో బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధి సాక్షి, హైదరాబాద్: మరింత చౌకగా ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించే దిశగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలకమైన ముందడుగు వేసిందని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ చెప్పారు. సార్క్ దేశాల కోసం ఇటీవల ప్రయోగించిన జీశాట్–9 ఉపగ్రహంలో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, వాటిని ఒకట్రెండు రోజుల్లో పరీక్షించనున్నట్లు వెల్లడించారు. పోఖ్రాన్ అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన మే 11వ తేదీని జాతీయ టెక్నాలజీ దినంగా ఆచరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త, పద్మభూషణ్ ఏవీ రామారావు పేరిట ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థల వల్ల ఉపగ్రహాల్లో నింపే రసాయన ఇంధనం మూడొంతుల వరకూ తగ్గుతుందని.. ఫలితంగా ఇంధన ఖర్చు తగ్గడంతో పాటు అధిక బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించడం సులువవుతుందని చెప్పారు. విద్యుత్ వాహనాలకు కొత్త టెక్నాలజీ 2030 నాటికి దేశంలో అత్యధిక సంఖ్యలో విద్యుత్ వాహనాలను వినియోగించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు ఇస్రో సరికొత్త లిథియం–అయాన్ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసిందని కిరణ్‌కుమార్ తెలిపారు. విదేశాలతో పోలిస్తే ఐదోవంతు ఖర్చుతోనే ఈ బ్యాటరీలను రూపొందించామని, భారీ ఎత్తున తయారు చేస్తే వాహనాల వినియోగానికి కూడా చవకగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తాము అభివృద్ధి చేసిన టెక్నాలజీని పారిశ్రామిక వర్గాలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సామాజిక అవసరాల కోసం అంతరిక్ష ప్రయోగాలు చేయడంలో మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. చేపలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మత్స్యకారులకు సూచించడం ద్వారా దేశంలో ఏటా దాదాపు రూ.15 వేల కోట్ల మేర ఇంధనం ఆదా అవుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, ఆవ్రా ల్యాబ్స్ అధినేత, ఐఐసీటీ మాజీ డైరెక్టర్ ఏవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగానికి వేగంగా ఏర్పాట్లు నాలుగు టన్నుల బరువున్న ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లగల జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని కిరణ్‌కుమార్ తెలిపారు. జూన్ తొలివారంలో దీనిని ప్రయోగించనున్నామని, వ్యవస్థలన్నింటినీ ఏకీకరించే పని జరుగుతోందని చెప్పారు. ఇస్రో వేర్వేరు ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్ని, ఛాయాచిత్రాలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు త్వరలోనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతంలో ఏర్పాటయ్యే ఈ కేంద్రం స్టార్టప్‌లనూ ప్రోత్సహిస్తుందని.. వ్యవసాయంతోపాటు నగరాలకు సంబంధించిన సమస్యలకు జియోస్పేషియల్, రిమోట్ సెన్సింగ్ సమాచారం ఆధారంగా పరిష్కారాలను కనుక్కునే ప్రయత్నాలకు ఊతమిస్తుందని చెప్పారు. -
విభిన్నంగా ఆలోచిస్తే.. యువతదే ‘భవిత’
గెస్ట్ కాలమ్ మన దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శరవేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. జలాంతర్గాముల నుంచి శాటిలైట్ ప్రయోగాల వరకు ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేస్తోంది. విశ్వవ్యాప్త గుర్తింపు పొందుతోంది. ఇదే సమయంలో ప్రస్తుతం అన్ని రంగాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. నిపుణులైన మానవ వనరుల కొరత. ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. కాబట్టి విద్యార్థులు విభిన్న ఆలోచనలతో అడుగులు వేస్తే రాబోయే రోజుల్లో యువతదే భవిత అంటున్నారు మిధాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ ఎం.నారాయణరావు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, న్యూక్లియర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో పీజీ పూర్తి చేసిన ఆయన ప్రముఖ పరిశోధన సంస్థ బార్క్‌లో జూనియర్ సైంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. మినీరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ మిధాని సీఎండీ స్థాయికి ఎదిగిన నారాయణరావుతో ఇంటర్వ్యూ.. ‘కోర్’కున్న అవకాశాలెన్నో ఇంజనీరింగ్, టెక్నాలజీ అనగానే ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థుల ప్రాధాన్యం సాఫ్ట్వేర్ రంగమే. కారణం.. ఆ రంగంలో అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల వారికి అవకాశాలు లభిస్తుండటమే! ఇటీవల కాలంలో దేశంలో పెరుగుతున్న పరిశోధన కార్యకలాపాలు, పారిశ్రామికీకరణతో మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ ఇంజనీరింగ్ విభాగాల్లోనూ అవకాశాలు విస్తృతం అవుతున్నాయి. కంపెనీలకు కోర్ విభాగంలో నిపుణులైన మానవ వనరులను అన్వేషించడం పెద్ద సవాలుగా మారింది. కాబట్టి భవిష్యత్‌లో కోర్ రంగంలో అవకాశాలు పుష్కలమని చెప్పొచ్చు. ఉన్నత విద్యతో సమున్నత స్థానాలు ప్రస్తుతం చాలా మంది బీటెక్ విద్యార్థుల్లో ఉద్యోగ సాధన తొలి లక్ష్యంగా మారింది. విద్యార్థుల సామాజిక-ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాన్ని తోసిపుచ్చలేం. అయితే, ఇంజనీరింగ్, సైన్స్ రంగాల్లో ఉన్నత విద్య ద్వారా మరిన్ని సమున్నత స్థాయికి చేరుకోవచ్చు. ఇటీవల కాలంలో పీజీ స్థాయిలో పలు ఫెలోషిప్‌లు, స్కాలర్షిప్లు లభిస్తున్నాయి. ఫలితంగా పీజీ కోర్సుకయ్యే వ్యయభారం తగ్గుతోంది. అకడమిక్ నైపుణ్యాలు మెరుగ్గా ఉన్న విద్యార్థులు, ఉన్నత విద్య ఔత్సాహికులు వీటిని అందిపుచ్చుకోవాలి. పీజీ స్థాయిలో ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు, వాటిలో ప్రవేశానికి అవసరమైన విధివిధానాలపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా ఉన్నత విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసుకోవచ్చు. ప్రొడక్ట్ డెవలప్మెంట్ నైపుణ్యాలు కోర్ విభాగంలో భవిష్యత్తును కొనసాగించాలనుకునే విద్యార్థులు కేవలం ప్రొడక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్కే పరిమితం కాకూడదు. ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేసే విధంగా నైపుణ్యాలు సాధించాలి. ఇందుకోసం నిరంతరం క్షేత్రస్థాయి అధ్యయనం చేయాలి. ఆధునిక అవసరాలు, లక్షిత వినియోగదారుల సౌలభ్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రొడక్ట్‌ను డెవలప్ చేసేలా రాణించాలి. ఉదాహరణకు రక్షణ రంగంలో వినియోగించే మిస్సైల్స్ ఒకప్పుడు భారీ పరిమాణంలో ఉండేవి. కానీ క్రమేణా వాటి పరిమాణం తగ్గుతూ వస్తోంది. అదేవిధంగా వాటర్ స్ట్రీమ్ ఇంజన్స్ కూడా. నిరంతరం పరిశోధనలు, ఎందరో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఇవి సాధ్యమవుతున్నాయి. అంటే.. ఒక రంగంలో పరిశోధన ఔత్సాహికులు నిరంతరం నూతన ఆవిష్కరణల దిశగా ఆలోచించగలిగితేనే రాణించగలరు. రీసెర్చ్ ప్రాధాన్యం పెరగాలి అంతర్జాతీయ స్థాయిలో దీటైన పోటీ ఇచ్చే దిశగా డిఫెన్స్, స్పేస్ వంటి విభాగాల్లో పరిశోధనలు విస్తృతమవుతున్నాయి. ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. కాబట్టి యువతను రీసెర్చ్ దిశగా ప్రోత్సహించేందుకు అకడమిక్ ఇన్స్టిట్యూట్ల స్థాయి నుంచే తగిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇండస్ట్రీ వర్గాలను మెప్పించి స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించి, విద్యార్థులను భాగస్వాములను చేయాలి. ఈ విషయంలోనే మనం అకడమిక్‌గా కొంత వెనుకంజలో ఉన్నాం. ఐఐటీలు, ఐఐఎస్సీ వంటి పేరున్న ఇన్‌స్టిట్యూట్‌ల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కానీ ఇతర అనేక ఇన్‌స్టిట్యూట్‌ల్లో కనీసం ఆర్ అండ్ డీ గురించి ప్రాథమిక అవగాహన కల్పించే సౌకర్యాలు కూడా ఉండట్లేదు. విద్యార్థులు సీఎస్ఐఆర్ ల్యాబ్‌లు, బార్క్, ఐఐఎస్సీ వంటి పలు సంస్థల్లో అందిస్తున్న జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ వంటి ప్రోత్సాహకాలు అందిపుచ్చుకోవాలి. సరైన సమయం ఇదే ఆర్ అండ్ డీ విభాగంలో భవిష్యత్తును కోరుకునే వారికి ఇదే సరైన సమయం. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిశోధనల తీరు, వాటి ప్రగతిని పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఐదేళ్లలో అంటే 2020 నాటికి పరిశోధనలకు కేరాఫ్‌గా నిలుస్తున్న జపాన్, జర్మనీ వంటి ఎన్నో దేశాలను భారత్ అధిగమించడం ఖాయం. ఇటీవల కాలంలో పలు రంగాల్లో భారత్ సాధించిన విజయాల కారణంగా (ఉదా: ఉపగ్రహ ప్రయోగాలు) ఎన్నో దేశాలు మనవైపు చూస్తున్నాయి. మన దేశంతో భాగస్వామ్యం దిశగా చర్చలు సాగిస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుంటే సమీప భవిష్యత్తులో మరెన్నో ప్రయోగాలకు భారత్ వేదికగా నిలవనుంది. యంగ్ టాలెంట్ సెర్చ్ అవకాశాల కోణంలో విశ్లేషిస్తే ఇప్పుడు అన్ని రంగాల్లో కంపెనీలు యంగ్ టాలెంట్‌కు పెద్దపీట వేస్తున్నాయి. ఇందుకోసం విస్తృత అన్వేషణ సాగిస్తున్నాయి. కంపెనీల మనుగడకు మెరుగైన మానవ వనరులను సొంతం చేసుకోవడం సవాలుగా మారింది. దీంతో యువ ప్రతిభావంతులను నియమించుకొని తమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు యువతకు వేల సంఖ్యలో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో వచ్చే రెండు దశాబ్దాల్లో యువతదే పైచేయి కానుంది. కావల్సిందల్లా అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యాలను సొంతం చేసుకోవడమే. వినూత్న ఆలోచనే విభిన్న అవకాశాలకు మార్గం ప్రస్తుతం దేశంలో ఫలానా రంగం అని కాకుండా అన్ని రంగాల్లోనూ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని సొంతం చేసుకోవడానికి వినూత్న ఆలోచనలతో, విస్తృత దృక్పథంతో ముందడుగు వేయాలి. కోర్ సామర్థ్యాలను పెంచుకుంటూనే సమకాలీన మార్పులపై అవగాహన పెంచుకోవాలి. కోర్ నైపుణ్యాల సాధనకే పరిమితం కాకుండా.. అనుబంధ రంగాల్లోనూ పరిజ్ఞానం సొంతం చేసుకుంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు అద్భుత భవిష్యత్తు ఖాయం!! ఎడ్యూన్యూస్ సీబీఎస్ఈ స్కూళ్లలో నాణ్యత సమీక్షలు సీబీఎస్ఈ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచే దిశగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అనుబంధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిరంతరం నాణ్యత సమీక్షలు నిర్వహించేందుకు స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ పేరుతో కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనికి సంబంధించి ప్రిన్సిపల్స్, రిటైర్డ్ ప్రిన్సిపల్స్‌తో కూడిన పలు బృందాలను పీర్ అసెస్మెంట్ టీమ్ పేరిట నియమించనున్నట్లు ప్రకటించింది. సీబీఎస్ఈ పేర్కొన్న నిర్దిష్ట అంశాలు-వాటి అమలు తీరు ప్రాతిపదికన ఈ బృందాలు ఆయా పాఠశాలల నాణ్యత ప్రమాణాలను సమీక్షిస్తాయి. దేశవ్యాప్తంగా కేజీ టు పీజీ ఇన్స్టిట్యూట్స్! దేశంలో వెనుకబడిన జిల్లాలన్నింటిలో కేజీ టు పీజీ ఇన్స్టిట్యూట్స్ నెలకొల్పేందుకు కేంద్రం యోచిస్తోంది. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని కారణంగా లక్షల సంఖ్యలో విద్యార్థులు చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2015-16 బడ్జెట్లో ఈ అంశం చేర్చనున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే కిండర్ గార్టెన్ నుంచి పీజీ వరకు ఒకే ప్రాంగణంలో చదువుకునే అవకాశం లభిస్తుంది.