చౌకగా ఉపగ్రహ ప్రయోగాలు | Cheapest satellite experiments | Sakshi
Sakshi News home page

చౌకగా ఉపగ్రహ ప్రయోగాలు

Published Sat, May 13 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

చౌకగా ఉపగ్రహ ప్రయోగాలు

చౌకగా ఉపగ్రహ ప్రయోగాలు

- సరికొత్తగా ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం: ఇస్రో చైర్మన్‌ కిరణ్‌
- జీశాట్‌–9లో ఒకట్రెండు రోజుల్లో ఈ పరీక్ష
- తక్కువ ఖర్చుతో బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధి


సాక్షి, హైదరాబాద్‌: మరింత చౌకగా ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించే దిశగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలకమైన ముందడుగు వేసిందని ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ చెప్పారు. సార్క్‌ దేశాల కోసం ఇటీవల ప్రయోగించిన జీశాట్‌–9 ఉపగ్రహంలో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, వాటిని ఒకట్రెండు రోజుల్లో పరీక్షించనున్నట్లు వెల్లడించారు. పోఖ్రాన్‌ అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన మే 11వ తేదీని జాతీయ టెక్నాలజీ దినంగా ఆచరిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)లో ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త, పద్మభూషణ్‌ ఏవీ రామారావు పేరిట ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్‌కుమార్‌ పాల్గొని మాట్లాడారు. ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థల వల్ల ఉపగ్రహాల్లో నింపే రసాయన ఇంధనం మూడొంతుల వరకూ తగ్గుతుందని.. ఫలితంగా ఇంధన ఖర్చు తగ్గడంతో పాటు అధిక బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించడం సులువవుతుందని చెప్పారు.

విద్యుత్‌ వాహనాలకు కొత్త టెక్నాలజీ
2030 నాటికి దేశంలో అత్యధిక సంఖ్యలో విద్యుత్‌ వాహనాలను వినియోగించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు ఇస్రో సరికొత్త లిథియం–అయాన్‌ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసిందని కిరణ్‌కుమార్‌ తెలిపారు. విదేశాలతో పోలిస్తే ఐదోవంతు ఖర్చుతోనే ఈ బ్యాటరీలను రూపొందించామని, భారీ ఎత్తున తయారు చేస్తే వాహనాల వినియోగానికి కూడా చవకగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తాము అభివృద్ధి చేసిన టెక్నాలజీని పారిశ్రామిక వర్గాలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సామాజిక అవసరాల కోసం అంతరిక్ష ప్రయోగాలు చేయడంలో మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. చేపలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మత్స్యకారులకు సూచించడం ద్వారా దేశంలో ఏటా దాదాపు రూ.15 వేల కోట్ల మేర ఇంధనం ఆదా అవుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్, ఆవ్రా ల్యాబ్స్‌ అధినేత, ఐఐసీటీ మాజీ డైరెక్టర్‌ ఏవీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 ప్రయోగానికి వేగంగా ఏర్పాట్లు
నాలుగు టన్నుల బరువున్న ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లగల జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 ప్రయోగానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని కిరణ్‌కుమార్‌ తెలిపారు. జూన్‌ తొలివారంలో దీనిని ప్రయోగించనున్నామని, వ్యవస్థలన్నింటినీ ఏకీకరించే పని జరుగుతోందని చెప్పారు. ఇస్రో వేర్వేరు ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్ని, ఛాయాచిత్రాలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు త్వరలోనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతంలో ఏర్పాటయ్యే ఈ కేంద్రం స్టార్టప్‌లనూ ప్రోత్సహిస్తుందని.. వ్యవసాయంతోపాటు నగరాలకు సంబంధించిన సమస్యలకు జియోస్పేషియల్, రిమోట్‌ సెన్సింగ్‌ సమాచారం ఆధారంగా పరిష్కారాలను కనుక్కునే ప్రయత్నాలకు ఊతమిస్తుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement