
రాకెట్ ప్రయోగాలను మరింత చౌకగా పూర్తి చేసేందుకు గ్లాస్‌గౌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఇంజిన్‌ను అభివృద్ధి చేశారు. ఉపగ్రహాలను పైకి తీసుకెళ్లే క్రమంలో ఈ ఇంజిన్ తనను తాను తినేసుకుంటుంది. అదెలా? అని ఆశ్చర్యపోతున్నారా? కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు వాడే రాకెట్లలో ఇంధనం తక్కువగా ఉంటుందిగానీ.. వాటి బరువు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంధనాలు కలిసిపోకుండా, పేలిపోకుండా ఉండేందుకు ఇది అత్యవసరం. బరువు ఎక్కువ కావడం వల్ల ఇంధనంతోపాటు ప్రయోగించే ఉపగ్రహాల బరువుపై కూడా పరిమితులు ఏర్పడతాయి.
ఈ నేపథ్యంలో ఇంధనం ఖర్చయిపోయిన తరువాత భాగాలను కూడా కరిగించుకుని చోదకశక్తిని ఇచ్చే సరికొత్త ఇంజిన్‌ను తాము తయారు చేశామని డాక్టర్ ప్యాట్రిక్ హార్క్‌నెస్ తెలిపారు. బయటివైపున ఘన ఇంధనం.. లోపలివైపున ద్రవ ఇంధనమున్న ప్రొపెల్లంట్ కడ్డీలతో ఇది సాధ్యమవుతుందని, ఈ కడ్డీని బాగా వేడెక్కిన ఇంజిన్‌లోకి నెమ్మదిగా జొప్పించినప్పుడు అక్కడ ఏర్పడే వాయువులు మరింత చోదకశక్తిని అందిస్తాయని వివరించారు. నమూనా ఇంజిన్‌ను తాము దాదాపు నిమిషం పాటు మండించగలిగామని చెప్పారు. ఇంజిన్ బరువును తగ్గించడం ద్వారా మరింత ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలేర్పడుతుందని అన్నారు.