engines
-
ఇక రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు
సాక్షి, అమరావతి: భారతీయ రైల్వే మరింత ఆధునికతను సంతరించుకుంటోంది. విమానాల తరహాలో రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తద్వారా ప్రమాదాలు సంభవిస్తే సమగ్ర విశ్లేషణకు అవకాశం ఏర్పడనుంది. తొలిసారిగా వందే భారత్ రైళ్లలో బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు విధివిధానాలను నిర్దేశించింది. సెప్టెంబర్ నుంచి రూపొందించే రైళ్లలో బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతోపాటు రైలు ఇంజిన్లు, బ్రేకులు, ఇతర అంశాల్లో కూడా భద్రతా ప్రమాణాలను మెరుగుపరచనుంది. సీసీఆర్‌సీవీఆర్ పరిజ్ఞానంతో.. కేబిన్ క్రూ రెస్ట్ కంపార్ట్మెంట్ వీడియో రికార్డింగ్ (సీసీఆర్‌సీవీఆర్) సాంకేతిక పరిజ్ఞానంతో బ్లాక్ బాక్సులు తయారు చేస్తారు. విమానాల్లోని బ్లాక్ బాక్సులను కూడా అదే సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందిస్తున్నారు. చిత్తరంజన్‌లోని లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసే వందేభారత్ రైళ్లలో ఈ బ్లాక్ బాక్సులను ప్రవేశపెడతారు. అందుకోసం డిజైన్లు ఖరారు చేశారు. సెప్టెంబర్‌లో తయారు చేసే వందేభారత్ రైళ్లలో వాటిని ప్రవేశపెట్టిన అనంతరం చెన్నైలోని ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీలో పరీక్షించి తుది ఆమోదం తెలుపుతారు. రైలు డ్రైవర్ కేబిన్‌లో అన్ని కదలికలను ఈ బ్లాక్‌బాక్సులు రికార్డు చేసి ఆడియో, వీడియో రూపంలో భద్రపరుస్తాయి. రైలు ఎలాంటి ప్రమాదానికి గురైనా ఆ బ్లాక్ బాక్సులో రికార్డు అయిన సమాచారం భద్రంగా ఉంటుంది. దీంతో ప్రమాద కారణాలను సహేతుకంగా విశ్లేషించి ఇకముందు జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. -
ఉపగ్రహ ప్రయోగాలను చౌక చేసే కొత్త ఇంజిన్లు!
రాకెట్ ప్రయోగాలను మరింత చౌకగా పూర్తి చేసేందుకు గ్లాస్గౌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఇంజిన్‌ను అభివృద్ధి చేశారు. ఉపగ్రహాలను పైకి తీసుకెళ్లే క్రమంలో ఈ ఇంజిన్ తనను తాను తినేసుకుంటుంది. అదెలా? అని ఆశ్చర్యపోతున్నారా? కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు వాడే రాకెట్లలో ఇంధనం తక్కువగా ఉంటుందిగానీ.. వాటి బరువు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంధనాలు కలిసిపోకుండా, పేలిపోకుండా ఉండేందుకు ఇది అత్యవసరం. బరువు ఎక్కువ కావడం వల్ల ఇంధనంతోపాటు ప్రయోగించే ఉపగ్రహాల బరువుపై కూడా పరిమితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ఇంధనం ఖర్చయిపోయిన తరువాత భాగాలను కూడా కరిగించుకుని చోదకశక్తిని ఇచ్చే సరికొత్త ఇంజిన్‌ను తాము తయారు చేశామని డాక్టర్ ప్యాట్రిక్ హార్క్నెస్ తెలిపారు. బయటివైపున ఘన ఇంధనం.. లోపలివైపున ద్రవ ఇంధనమున్న ప్రొపెల్లంట్ కడ్డీలతో ఇది సాధ్యమవుతుందని, ఈ కడ్డీని బాగా వేడెక్కిన ఇంజిన్లోకి నెమ్మదిగా జొప్పించినప్పుడు అక్కడ ఏర్పడే వాయువులు మరింత చోదకశక్తిని అందిస్తాయని వివరించారు. నమూనా ఇంజిన్‌ను తాము దాదాపు నిమిషం పాటు మండించగలిగామని చెప్పారు. ఇంజిన్ బరువును తగ్గించడం ద్వారా మరింత ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలేర్పడుతుందని అన్నారు. -
ఆ రైలుకు రెండు వైపులా ఇంజన్లు!
మనకు ఊహ తెలిసినప్పటి నుంచి రైలు అంటే ముందు ఒక ఇంజన్ ఉండి, తర్వాత బోగీలు ఉంటాయి. తాజాగా ఒక ట్రైన్‌కు మాత్రం రెండు వైపులా ఇంజన్లు అమర్చారు. పశ్చిమ రైల్వే ఈ ప్రయోగం చేసింది. బాంద్రా నుంచి ఢిల్లీలోని హజ్రత్‌నిజాముద్దీన్ వరకు వెళ్లే ప్రత్యేక రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు రెండు ఇంజిన్లు అమర్చారు. భారతీయ రైల్వే చరిత్రలో ప్రయాణికుల రైలుకు రెండు ఇంజిన్లు జతచేయడం ఇదే మొదటిసారి. దీని వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాక, ప్లాట్‌ఫామ్‌పై రైలు వేగంగా కదిలేందుకు ఆ రెండో ఇంజన్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోల్చుకుంటే రెండు ఇంజిన్లు అమర్చిన ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్ రెండు గంటల సమయం ఆదా అవుతుందన్నారు. అయితే ఈ ప్రయోగాన్ని ఇంతకుముందు గూడ్స్ రైళ్లలో విజయవంతంగా ప్రయోగించారు. ప్రయాణికుల రైలులోనూ పుష్ అండ్ పుల్ టెక్నిక్(ముందు, వెనక ఇంజన్లు అమర్చడం)ను ప్రవేశపెట్టాలని మధ్య రైల్వే (సెంట్రల్ రైల్వే) జనరల్ మేనేజర్ డి.కె. శర్మ ఆధ్వర్యంలో జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దీంతో ప్రత్యేక రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రయోగాన్ని అమలు చేశారు. ‘వెనక వైపు ఇంజన్‌ను అమర్చినా... ముందువైపు ఇంజన్లో ఉన్న లోకో పైలటే రెండో దాన్ని కూడా ఆపరేట్ చేస్తాడు. వేగం, బ్రేకింగ్ విషయంలో లోకోమోటివ్స్‌ల మధ్య ఇంకా సాంకేతికతను అభివృద్ది పరచాల్సి ఉంద’ ని సెంట్రల్రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) రావినర్ భాకర్ తెలిపారు. -
పట్టాలు తప్పిన గూడ్స్
కడప రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. రెండు ఇంజిన్లు, వ్యాగన్లు ట్రాక్ పక్కకు ఒరిగిపోయాయి. 40 మీటర్ల మేర ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైళ్లన్నింటినీ ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరులో గంటలకొద్దీ నిలిపివేశారు. కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్ఫారం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు సంబంధించి రెండు ఇంజన్లు, రెండు వ్యాగన్లు ట్రాక్ పక్కకు ఒరిగిపోయాయి. 40 మీటర్ల మేర ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. వివరాల్లోకి వెళితే....గూడ్స్ రైలు కృష్ణపట్నం నుంచి 59 వ్యాగన్ల బొగ్గు లోడును మంగళవారం తెల్లవారుజామున తీసుకొచ్చింది. కృష్ణపట్నం, గూడూరు, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల మీదుగా ముద్దనూరు సమీపంలోని ఆర్టీపీపీకి తీసుకెళ్లేందుకు కడప రైల్వేస్టేషన్‌కు చేరుకునేలోపు ప్రమాదం జరిగింది. కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్ఫారం ట్రాక్ నుంచి నాల్గవ ట్రాక్‌లోకి గూడ్స్ రైలు ఇంజన్లతోసహా వెళ్లేలోపు ట్రాక్‌పై అదుపుతప్పి పడిపోయింది. రెండు రైలింజన్లు, రెండు వ్యాగన్లు పూర్తిగా తప్పిపోయి కుడివైపుకు ఒరిగాయి. ట్రాక్‌కు నిర్మితమైన పట్టాలు విడిపోయి దెబ్బతిన్నాయి. దీంతో ఇతర రైళ్లు రాకుండా పూర్తిగా అంతరాయాన్ని కలిగించాయి. రైళ్లనన్నింటిని ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరులలో గంటలకొద్ది నిలిపి వేశారు. సంఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. రైలింజన్లను, రెండు వ్యాగన్లను తప్పించి మిగతా వ్యాగన్లను వెనక్కి మరలించి తిరిగి ఆర్టీపీపీకి చేర్పించేందుకు తమవంతు కృషి చేశారు. రేణిగుంట నుంచి లూకాస్ అనే క్రేన్ ట్రైన్‌ను రైల్వే అధికారులు తీసుకొచ్చి రైలింజన్లను మరలా ట్రాక్‌పై చేర్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తృటిలో తప్పిన ప్రమాదం గూడ్స్ రైలు వేగంగా మూడవ ట్రాక్ నుంచి నాల్గవ ట్రాక్‌కు వెళ్లే సమయంలో అదుపుతప్పి రైల్ ట్రాక్ కుడివైపుగా ఒరిగిపోయింది. అదే సమయంలో ఐదవ లైన్లో ఐఓసీ ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ ట్యాంకర్లను అన్లోడ్ ప్రక్రియ చేస్తున్నారు. రైలింజన్లు కుడివైపుకు కాకుండా ఎడమవైపుకు ఒరిగినా, లేక వ్యాగన్లు ఎక్కువ సంఖ్యలో ఒరిగినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. ప్రమాదానికి కారణం ట్రాకా? వేగమా? ఈ ప్రమాదం జరగడానికి ట్రాక్ నాణ్యత లోపించడం వల్ల జరిగిందా? లేక రైలింజన్ లోకోపెలైట్, అసిస్టెంట్ లోకో పెలైట్ స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి పరిమితమైన వేగం 15 నుంచి 20 కిలోమీటర్ల మేరకు ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా దూసుకు రావడంతో ప్రమాదం జరిగిందా? అనేది నిర్దారణ కావాల్సి ఉంది. ఇప్పటికే రేణిగుంట నుంచి రైల్వే అధికారులు వచ్చారు. సాయంత్రం ఐదు గంటలలోపు కడపకు చేరుకోవాల్సిన దాదార్ ఎక్స్‌ప్రెస్‌ను నందలూరులో కొన్ని గంటల వరకు అలాగే ఉంచారు. హరిప్రియ, రాయలసీమ, వెంకటాద్రి రైళ్లను కూడా కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్‌ఫాం మీదుగా ప్రతిరోజు ప్రయాణించాల్సి ఉంది. కానీ ఈ సంఘటనతో ఒకటవ ప్లాట్ఫారం మీదుగానే పంపించే ప్రయత్నం చేస్తున్నారు.