వేల టన్నులు పెరిగిన స్పేస్ జంక్
తాజాగా మరో కృత్రిమ ఉపగ్రహం ముక్కలై మరింత పెరిగిన చెత్త
మానవ, పారిశ్రామిక వ్యర్థాలతో అవనిపై అమాంతం పెరుగుతున్న చెత్తకొండలతో ఎంతో ముప్పు పరిణమిస్తోంది. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోనూ చెత్త పేరుకుపోతోంది. భూమిపై వ్యర్థాలను పునశ్శుద్ధి కర్మాగారాల ద్వారా అయినా కాస్తంత వదిలించుకోవచ్చుగానీ అంతరిక్ష చెత్తలోని నట్లు, బోల్ట్‌లు, ఇతర భాగాలు అలాగే పేరుకుపోయి కొత్త కృత్రిమ ఉపగ్రహాలకు ‘అంతరిక్ష బాంబుల్లా’ తయారయ్యాయి. పాడైపోయిన పాత ఉపగ్రహాల శిథిలాల స్పేస్‌జంక్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రయోగాలకు పెద్ద అవరోధంగా మారింది.
పేలిపోయిన ఇంటెల్‌శాట్ 33ఇ
యూరప్, మధ్య ఆఫ్రికా, పశి్చమాసియా, ఆ్రస్టేలియా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలందిస్తున్న ఇంటెల్‌శాట్ 33ఇ ఉపగ్రహం నాలుగు రోజుల క్రితం పనిచేయడం మానేసింది. 2016 ఆగస్ట్‌లో బోయింగ్ సంస్థ ఈ శాటిలైట్‌ను డిజైన్ చేసింది. పనిచేయడం మానేసిన కొద్దిసేపటికే అది పేలి 20 ముక్కలుగా కక్ష్యలో చెల్లాచెదురుగా పడిందని యూఎస్ స్పేస్ ఫోర్సెస్ స్పేస్(ఎస్4ఎస్) సంస్థ ధృవీకరించింది.
ఇలా అనూహ్యంగా ఉపగ్రహాలు అంతరిక్ష చెత్తలా మారితే సమీప ఉపగ్రహాలకు మరణశాసనం రాసినట్లే. శాటిలైట్ ముక్కలు వేగంగా భ్రమిస్తూ కక్ష్యదాటి సమీప శాటిలైట్లను ఢీకొట్టి వాటికి భారీ నష్టం చేకూరుస్తాయి. దీంతో ఇతర శాటిలైట్లు కూడా పాడయ్యే ప్రమాదముంది. ఇలా గొలుసుచర్య జరిగితే పెద్ద ఉపద్రవమే సంభవిస్తుంది. అక్కడ సమీప శాటిలైట్లన్నీ ధ్వంసమై భూమిపై సమాచార, ప్రసార వ్యవస్థలు స్తంభించిపోతాయి.
భవిష్యత్తులో ఆ ఎత్తుల్లోని ఆ కక్ష్యలను కొత్త ఉపగ్రహాల కోసం వాడుకోలేని పరిస్థితి దాపురిస్తుంది. భూమి నుంచి కొంత పరిధిలోని ఎత్తుల్లో మాత్రమే శాటిలైట్లను ప్రవేశపెట్టగలం. అవి మాత్రమే మానవాళి అవసరాలకు పనికొస్తాయి. సుదూరాల్లో శాటిలైట్లను ప్రవేశపెట్టలేం. అందుబాటులో ఉన్న కక్ష్యలను అన్ని దేశాలకు అత్యంత విలువైన అంతరిక్ష వనరులుగా చెప్పొచ్చు. ఇప్పుడీ అంతరిక్ష చెత్తతో ఆ వనరులను భవిష్యత్తులో మానవుడు ఉపయోగించుకోలేని దురవస్థ రావొచ్చు.
ఎందుకిలా జరుగుతోంది?
సౌర తుపాన్లు ఇందుకు కారణంగా భావిస్తున్నారు. శక్తివంతమైన సౌర తుపాన్ల ధాటికి శాటిలైట్ల పనితీరు దెబ్బతిని అవి నియంత్రణ కోల్పోతున్నాయి. గతంలోనూ ఇలా కొన్ని శాటిలైట్లు హఠాత్తుగా పనిచేయడం ఆగిపోవడం, కొన్ని ఢీకొనడం, ఇంకొన్ని నియంత్రణ పరిధి ఆవలికి వెళ్లిపోవడం జరిగాయి.
లక్షలాది ముక్కలు
యూరోపియన్ స్పేస్‌ఏజెన్సీ గణాంకాల ప్రకారం 10 సెంటీమీటర్లకన్నా పెద్ద పరిమాణంలో ఉన్న ముక్కలు 40,000దాకా అంతరిక్షంలో పోగుబడ్డాయి. ఇక 1 సెంటీ మీటర్ కన్నా చిన్నసైజు ముక్కలు 13 కోట్లదాకా ఉంటాయని తెలుస్తోంది. మనిషి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాలు, రాకెట్ల కారణంగా అంతరిక్షంలో దాదాపు 13,000 టన్నుల మేర చెత్త పేరుకుపోయింది. ఇది 90 భారీ తిమింగలాల బరువుతో సమానం.
ఇందులో 4,300 టన్నుల చెత్త కేవలం రాకెట్ నుంచి విడిపోయిన విడిభాగాల కారణంగా పోగుబడింది. తాజాగా ముక్కలైన ఇంటెల్‌శాట్ 33ఈ ఉపగ్రహం ఏకంగా 35,000 కి.మీ.ల ఎత్తులో పరిభ్రమించేది. ఇంత దూరంలో ఉన్న ముక్కలను లెక్కబెట్టడం కూడా చాలాకష్టం. ఈ ఏడాది జూన్‌లో రెసర్స్–పీ1 ఉపగ్రహం 480 కి.మీ.ల ఎత్తులో భూ దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ హఠాత్తుగా బద్దలై 100 ముక్కలైంది. తిరిగే క్రమంలో ఇవి మరింతగా ముక్కలై చిన్నవిగా సమస్యను మరింత జఠిలతరం చేస్తాయి. జూలైలో గడువు ముగిసిన రక్షణ, వాతావరణరంగ 5డీ–2ఎఫ్8 వ్యోమనౌక ముక్కలైంది. ఆగస్ట్‌లో లాంగ్‌మార్చ్6ఏ(సీజెడ్–6ఏ) రాకెట్ సైతం చిధ్రమైంది.
అందుబాటులోకి డీకమిషన్ ఆధునిక సాంకేతికత
చెత్త మరీ ఎక్కువగా పేరుకుపోకుండా ఏదైనా శాటిలైట్ జీవితకాలం ముగుస్తుందనిపించిన వెంటనే దానిని సురక్షితంగా భూకక్ష్యలోకి తీసుకొచ్చి మహాసముద్రాల్లో పడేసే ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచి్చంది. గతంలో స్కైల్యాబ్ వంటి ఘటనలతో జనం బెంబేలెత్తిపోయినా ఇప్పుడా పరిస్థితి లేదనే చెప్పాలి. గత నెలలో యురోపియన్ స్పేస్ ఏజెన్సీ క్లస్టర్–2 సల్సా శాటిలైట్‌ను ఇలాగే జాగ్రత్తగా డీకమిషన్ చేశారు. భారీ వస్తువును అంతరిక్షంలోకి పంపితే అంతమేర చెత్తను పంపినట్లు లెక్కించాలి. దశాబ్దాలపాటు సేవలందించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఒకవేళ కక్ష్యలో ముక్కలైతే 22 కోట్ల ముక్కలుగా మారుతుందని ఓ అంచనా. అందుకే దీనిని సురక్షితంగా లాగుడుబండి లాంటి వ్యోమనౌకతో లాక్కొచ్చి మహాసముద్రంలో పడేయాలని అమెరికా ఇప్పటికే ఒక భారీ ప్రణాళిక సిద్దంచేసింది. ఈ బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ప్రైవేట్ అంతరిక్షసంస్థకు అప్పజెప్పింది.
తొలగించాల్సిన బాధ్యత ఎవరది?
ఏ దేశానికి చెందిన శాటిలైట్ ముక్కలైతే వాటిని తొలగించాల్సిన బాధ్యత కూడా ఆ దేశానిదే. అంతరిక్ష వస్తువుల కారణంగా చెత్తగా మారిన కక్ష్యలను మళ్లీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 1972లో అంతర్జాతీయ ఒప్పందం చేసుకున్నారు. అయితే అంతరిక్ష చెత్త పెరగడానికి కారకులయ్యారంటూ తొలిసారిగా గత ఏడాది మాత్రమే జరిమానా విధించారు. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఈ జరిమానా విధించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment