Industrial waste
-
అంతరిక్ష చెత్త.. అమాంతం పైపైకి
మానవ, పారిశ్రామిక వ్యర్థాలతో అవనిపై అమాంతం పెరుగుతున్న చెత్తకొండలతో ఎంతో ముప్పు పరిణమిస్తోంది. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోనూ చెత్త పేరుకుపోతోంది. భూమిపై వ్యర్థాలను పునశ్శుద్ధి కర్మాగారాల ద్వారా అయినా కాస్తంత వదిలించుకోవచ్చుగానీ అంతరిక్ష చెత్తలోని నట్లు, బోల్ట్‌లు, ఇతర భాగాలు అలాగే పేరుకుపోయి కొత్త కృత్రిమ ఉపగ్రహాలకు ‘అంతరిక్ష బాంబుల్లా’ తయారయ్యాయి. పాడైపోయిన పాత ఉపగ్రహాల శిథిలాల స్పేస్‌జంక్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రయోగాలకు పెద్ద అవరోధంగా మారింది. పేలిపోయిన ఇంటెల్‌శాట్ 33ఇ యూరప్, మధ్య ఆఫ్రికా, పశి్చమాసియా, ఆ్రస్టేలియా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలందిస్తున్న ఇంటెల్‌శాట్ 33ఇ ఉపగ్రహం నాలుగు రోజుల క్రితం పనిచేయడం మానేసింది. 2016 ఆగస్ట్‌లో బోయింగ్ సంస్థ ఈ శాటిలైట్‌ను డిజైన్ చేసింది. పనిచేయడం మానేసిన కొద్దిసేపటికే అది పేలి 20 ముక్కలుగా కక్ష్యలో చెల్లాచెదురుగా పడిందని యూఎస్ స్పేస్ ఫోర్సెస్ స్పేస్(ఎస్4ఎస్) సంస్థ ధృవీకరించింది. ఇలా అనూహ్యంగా ఉపగ్రహాలు అంతరిక్ష చెత్తలా మారితే సమీప ఉపగ్రహాలకు మరణశాసనం రాసినట్లే. శాటిలైట్ ముక్కలు వేగంగా భ్రమిస్తూ కక్ష్యదాటి సమీప శాటిలైట్లను ఢీకొట్టి వాటికి భారీ నష్టం చేకూరుస్తాయి. దీంతో ఇతర శాటిలైట్లు కూడా పాడయ్యే ప్రమాదముంది. ఇలా గొలుసుచర్య జరిగితే పెద్ద ఉపద్రవమే సంభవిస్తుంది. అక్కడ సమీప శాటిలైట్లన్నీ ధ్వంసమై భూమిపై సమాచార, ప్రసార వ్యవస్థలు స్తంభించిపోతాయి. భవిష్యత్తులో ఆ ఎత్తుల్లోని ఆ కక్ష్యలను కొత్త ఉపగ్రహాల కోసం వాడుకోలేని పరిస్థితి దాపురిస్తుంది. భూమి నుంచి కొంత పరిధిలోని ఎత్తుల్లో మాత్రమే శాటిలైట్లను ప్రవేశపెట్టగలం. అవి మాత్రమే మానవాళి అవసరాలకు పనికొస్తాయి. సుదూరాల్లో శాటిలైట్లను ప్రవేశపెట్టలేం. అందుబాటులో ఉన్న కక్ష్యలను అన్ని దేశాలకు అత్యంత విలువైన అంతరిక్ష వనరులుగా చెప్పొచ్చు. ఇప్పుడీ అంతరిక్ష చెత్తతో ఆ వనరులను భవిష్యత్తులో మానవుడు ఉపయోగించుకోలేని దురవస్థ రావొచ్చు. ఎందుకిలా జరుగుతోంది? సౌర తుపాన్లు ఇందుకు కారణంగా భావిస్తున్నారు. శక్తివంతమైన సౌర తుపాన్ల ధాటికి శాటిలైట్ల పనితీరు దెబ్బతిని అవి నియంత్రణ కోల్పోతున్నాయి. గతంలోనూ ఇలా కొన్ని శాటిలైట్లు హఠాత్తుగా పనిచేయడం ఆగిపోవడం, కొన్ని ఢీకొనడం, ఇంకొన్ని నియంత్రణ పరిధి ఆవలికి వెళ్లిపోవడం జరిగాయి. లక్షలాది ముక్కలు యూరోపియన్ స్పేస్‌ఏజెన్సీ గణాంకాల ప్రకారం 10 సెంటీమీటర్లకన్నా పెద్ద పరిమాణంలో ఉన్న ముక్కలు 40,000దాకా అంతరిక్షంలో పోగుబడ్డాయి. ఇక 1 సెంటీ మీటర్ కన్నా చిన్నసైజు ముక్కలు 13 కోట్లదాకా ఉంటాయని తెలుస్తోంది. మనిషి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాలు, రాకెట్ల కారణంగా అంతరిక్షంలో దాదాపు 13,000 టన్నుల మేర చెత్త పేరుకుపోయింది. ఇది 90 భారీ తిమింగలాల బరువుతో సమానం. ఇందులో 4,300 టన్నుల చెత్త కేవలం రాకెట్ నుంచి విడిపోయిన విడిభాగాల కారణంగా పోగుబడింది. తాజాగా ముక్కలైన ఇంటెల్‌శాట్ 33ఈ ఉపగ్రహం ఏకంగా 35,000 కి.మీ.ల ఎత్తులో పరిభ్రమించేది. ఇంత దూరంలో ఉన్న ముక్కలను లెక్కబెట్టడం కూడా చాలాకష్టం. ఈ ఏడాది జూన్‌లో రెసర్స్–పీ1 ఉపగ్రహం 480 కి.మీ.ల ఎత్తులో భూ దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ హఠాత్తుగా బద్దలై 100 ముక్కలైంది. తిరిగే క్రమంలో ఇవి మరింతగా ముక్కలై చిన్నవిగా సమస్యను మరింత జఠిలతరం చేస్తాయి. జూలైలో గడువు ముగిసిన రక్షణ, వాతావరణరంగ 5డీ–2ఎఫ్8 వ్యోమనౌక ముక్కలైంది. ఆగస్ట్‌లో లాంగ్‌మార్చ్6ఏ(సీజెడ్–6ఏ) రాకెట్ సైతం చిధ్రమైంది. అందుబాటులోకి డీకమిషన్ ఆధునిక సాంకేతికత చెత్త మరీ ఎక్కువగా పేరుకుపోకుండా ఏదైనా శాటిలైట్ జీవితకాలం ముగుస్తుందనిపించిన వెంటనే దానిని సురక్షితంగా భూకక్ష్యలోకి తీసుకొచ్చి మహాసముద్రాల్లో పడేసే ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచి్చంది. గతంలో స్కైల్యాబ్ వంటి ఘటనలతో జనం బెంబేలెత్తిపోయినా ఇప్పుడా పరిస్థితి లేదనే చెప్పాలి. గత నెలలో యురోపియన్ స్పేస్ ఏజెన్సీ క్లస్టర్–2 సల్సా శాటిలైట్‌ను ఇలాగే జాగ్రత్తగా డీకమిషన్ చేశారు. భారీ వస్తువును అంతరిక్షంలోకి పంపితే అంతమేర చెత్తను పంపినట్లు లెక్కించాలి. దశాబ్దాలపాటు సేవలందించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఒకవేళ కక్ష్యలో ముక్కలైతే 22 కోట్ల ముక్కలుగా మారుతుందని ఓ అంచనా. అందుకే దీనిని సురక్షితంగా లాగుడుబండి లాంటి వ్యోమనౌకతో లాక్కొచ్చి మహాసముద్రంలో పడేయాలని అమెరికా ఇప్పటికే ఒక భారీ ప్రణాళిక సిద్దంచేసింది. ఈ బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ ప్రైవేట్ అంతరిక్షసంస్థకు అప్పజెప్పింది. తొలగించాల్సిన బాధ్యత ఎవరది? ఏ దేశానికి చెందిన శాటిలైట్ ముక్కలైతే వాటిని తొలగించాల్సిన బాధ్యత కూడా ఆ దేశానిదే. అంతరిక్ష వస్తువుల కారణంగా చెత్తగా మారిన కక్ష్యలను మళ్లీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 1972లో అంతర్జాతీయ ఒప్పందం చేసుకున్నారు. అయితే అంతరిక్ష చెత్త పెరగడానికి కారకులయ్యారంటూ తొలిసారిగా గత ఏడాది మాత్రమే జరిమానా విధించారు. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఈ జరిమానా విధించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
క్లీన్ హార్బర్స్‌లో 1,000 కొలువులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక వ్యర్ధాల నిర్వహణ సంబంధ సేవలు అందించే క్లీన్ హార్బర్స్ రాబోయే రోజుల్లో 1,000 మందిని పైగా రిక్రూట్ చేసుకోనుంది. వచ్చే ఏడాదిన్నర కాలంలోనే కొత్తగా 300 మందిని నియమించుకోనుండగా.. ఇందులో ఎక్కువ భాగం హైరింగ్ హైదరాబాద్ కార్యాలయం కోసం ఉండనుంది. సోమవారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయ విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఈవో అలాన్ మెకిమ్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రెసిడెంట్ అవినాష్ సమ్రిత్ ఈ విషయాలు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పుణెల్లో కార్యాలయాలు ఉన్నట్లు అవినాష్ చెప్పారు. ప్రస్తుతం క్లీన్ హార్బర్స్‌కు దేశీయంగా 1,200 మంది సిబ్బంది ఉండగా.. హైదరాబాద్‌లో 850 మంది ఉన్నారు. కొత్త కార్యాలయంపై దాదాపు రూ. 10 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు అవినాష్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో తమ టర్నోవరు దాదాపు రూ. 150–రూ. 200 కోట్ల స్థాయిలో ఉన్నట్లు వివరించారు. 5 బిలియన్ డాలర్లుగా ఉన్న క్లీన్ హార్బర్స్ వచ్చే అయిదేళ్లలో 7 బిలియన్ పైగా డాలర్ల కంపెనీగా ఎదిగే క్రమంలో తమ వ్యాపారానికి అనువైన సంస్థల కొనుగోలు, విలీనాల యోచన కూడా ఉన్నట్లు మెకిన్ వివరించారు. -
పిల్లలూ... మట్టి విలువ తెలుసుకోండి
మట్టితో ఆడుకునే పిల్లలు ఇప్పుడు లేరు. మట్టిలో ఆడుకునే పిల్లలు ఇప్పుడు లేరు. కాళ్లకు మట్టి అంటితే బురద అంటితే ఇసుక అంటితే సిమెంటు తొట్టిలోని నీటిని వొంపుకుంటూ పాదాల మీదుగా పారే మట్టి రంగు నీళ్లను చూసే పిల్లలు ఇప్పుడు లేరు. కుండీల్లోని మట్టిని తాకరు. పంట పైరుల్లోని మట్టిని తాకరు. అడవిలోని మట్టిని తాకరు. మన తాతలు తిరుగాడిన మట్టినేలలను తాకరు. వారు చదువులను చదువుతూ క్లాస్రూమ్ స్క్రీన్ మీద మట్టిని చూస్తారు. ఇలాంటి పిల్లలకు మట్టి విలువ ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులే. నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం. మట్టికో నమస్కారం పెట్టుకోవాల్సిన రోజు. పిల్లలు తల్లిని అడిగారట. ‘అమ్మా.. మనిషి దేవుడి కంటే గొప్పవాడా?’ అప్పుడు తల్లి ఈ జోక్ చెప్పింది. ఒక సైంటిస్ట్ దేవుడితో ‘దేవుడా... మనిషి నీతో సమానంగా సృష్టించగలడు. చెప్పు.. ఏది సృష్టించి చూపమంటావు?’ అన్నాడు. దానికి దేవుడు ‘సరే... మనిషిని సృష్టించు’ అన్నాడు. అప్పుడు సైంటిస్ట్ ‘అలాగే’ అని కొంచెం మట్టి తీసుకోతుంటే దేవుడు వారించి అన్నాడు– ‘ఒక్క నిమిషం. ఆ మట్టి కూడా నువ్వు సృష్టించిందే అయి ఉండాలి నాయనా’. మనిషిని సృష్టించగలనని విర్రవీగిన సైంటిస్ట్ చిటికెడు మట్టిని సృష్టించలేక తెల్లముఖం వేశాడు. ఆ జోక్ చెప్పి తల్లి ‘ప్రకృతి నుంచి మనిషి దేనినైనా సృష్టించగలడు. కాని ప్రకృతిని సృష్టించలేడు. ప్రకృతిని విస్తరించాలి. ఉన్నది కాపాడుకోవాలి. మట్టితో సహా’ అని వివరించింది. పిల్లలు తల్లిని అడిగారట ‘అమ్మా మనిషి అన్నింటికీ విరుగుడు కనిపెట్టగలడు కదా’. దానికి తల్లి జవాబు– నిజమే. మనిషి టెస్ట్‌ట్యూబ్ బేబీలను, క్లోనింగ్ జీవులను సృష్టించేంతగా ఎదిగాడు. కాని మట్టిని సృష్టించగలడా? నేలను సృష్టించగలడా? భూపొరలను, ఆ పొరలలో దాగిన ఖనిజ లవణాలని, నీటిని, జీవజాలాన్ని సృష్టించగలడా? కోవిడ్ వంటి మహమ్మారి వ్యాపిస్తోందని వాక్సిన్ కోసం పరుగులు తీస్తున్న మనిషి నేల చనిపోతుంటే తన జీవాన్ని కోల్పోతూ ఉంటే ఆ ఉత్పాతానికి విరుగుడు కనిపెట్టడానికి ఎందుకు తొందరపడటం లేదు? పిల్లలు తల్లిని అడిగారట– ’అమ్మా... మట్టి లేకపోతే ఏమవుతుంది?’ దానికి తల్లి జవాబు – ఈ భూమి మీద కనీసం 40 శాతం అడవులు ఉండాలి. కాని ఒక అంచనా ప్రకారం 13 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే మరో 30 ఏళ్లు ఆగితే వాన భూమి మీద కాకుండా సముద్రం మీద మాత్రమే కురుçస్తుంటుంది. మట్టి నీటిని తీసుకోవాలి. తిరిగి నింగికి నీటిని ఇవ్వాలి. ఈ చక్రానికి ఒక మహా విఘాతం కలగబోతోంది. వానల్ని లాగి ఆకర్షించే అడవి నేల మీద లేకపోతే మేఘం ఎందుకు వస్తుంది? మట్టి ఉంటే చెట్టు ఉంటుంది. చెట్టు ఉంటే వాన దాంతో పాటు మనిషి మనుగడ ఉంటుంది. పిల్లలు తల్లిని అడిగారట ‘మట్టి ఎలా నాశనం అవుతుంది?’ దానికి తల్లి జవాబు– మట్టి నుంచి సహజంగా వచ్చేది ఏదైనా మట్టిలో కలిసిపోతుంది. కాని మట్టికి అమోదం లేని పద్ధతిలో మనిషి తయారు చేసే కఠినమైన పదార్థాలను మట్టి తీసుకోదు. నిరాకరిస్తుంది. ప్లాస్టిక్, కెమికల్స్, పారిశ్రామిక వ్యర్థాలు, ఔషధ పరిశ్రమల విసర్జనాలు... వీటిని మట్టికి మనిషి తినిపిస్తున్నాడు. ఈ విషాహారం తినే కొద్దీ మట్టి మెల్లమెల్లగా చచ్చిపోతోంది. గత 25 ఏళ్లలో భారతదేశం సజీవ మృత్తికను అంటే మొలకెత్తే మట్టిని దాదాపు 38 శాతం కోల్పోయిందని ఒక అధ్యయనం చెబుతోంది. అంటే అది పంటకు పనికి రాదు. అది మృతభూమి. పిల్లలు తల్లిని అడిగారట ‘మట్టి ఎవరికి ముఖ్యం? దానికి తల్లి జవాబు– మట్టి మనందరికీ ముఖ్యం. కాని రైతుకు ఇంకా ముఖ్యం. ఎందుకంటే మట్టిలో కష్టించి పంటను పండిస్తాడు. మన ఆకలిని తీరుస్తాడు. సిటీలో ఉన్నవాడు మట్టి మీద కట్టిన ఒక ఫ్లాట్, కార్ పార్కింగ్‌కు స్థలం దొరికితే చాలనుకుంటాడు. రైతు మాత్రం పంట పండే చేనుముక్కను కోరుకుంటాడు. ‘నేల తల్లి నీకు వందనం... మడిచేల తల్లి నీకు వందనం అని పాడుకునేది రైతు ఒక్కడే’. ఎంతటి మహాచక్రవర్తి అయినా మట్టి లేకపోతే మృతసమానుడు అవుతాడు. ఆ కిటుకు తెలుసు కనుకనే బలి చక్రవర్తిని వామనుడు మట్టిని వరంగా కోరి పరిహరిస్తాడు. మట్టి మనిషి బలం. జీవధాతువు. ∙∙ పిల్లలు తల్లిని అడిగారట– ‘అమ్మా... మేము ఏం చేయాలి?’ దానికి తల్లి జవాబు– ‘ఇవాళ మీరే ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకు వస్తున్నారు. బాల పర్యావరణ వేత్తలే ప్రపంచ వ్యాప్తంగా మట్టికి జరుగుతున్న ద్రోహాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. మీ క్లాస్‌లో స్కూల్లో ఈ చైతన్యం మరింత నింపాల్సిన అవసరం ఉంది. మట్టిని కలుషితం చేసే వ్యవసాయ విధానాలు, పారిశ్రామిక విధానాలు, వాణిజ్య పంటల విధానాలు, జల నిర్వహణ విధానాలు, అటవీ విధానాలు ప్రభుత్వాలు మానుకోవాలని మీరు డిమాండ్ చేయాలి. మట్టిని కాపాడుకుంటాం అని ప్రతిజ్ఞ చేయాలి. -
పొగచూరుతున్న బతుకులు
► దీనావస్థలో కొందుర్గు పరిసర గ్రామాలు ► రాత్రి వేళల్లో పరిశ్రమల వ్యర్థాలకు నిప్పు ► పరిశ్రమ వ్యర్థాలతో శరీరంపై దద్దుర్లు ► దట్టమైన పొగ, దుర్వాసనతో అల్లాడుతున్న జనం కొందుర్గు: కొందుర్గుతోపాటు పరిసర గ్రామాలైన గంగన్నగూడ, చెర్కుపల్లి, విశ్వనాథ్‌పూర్, చెక్కలోనిగూడ, తూంపల్లి తదితర గ్రామాలకు సంబంధించిన ప్రజలకు చర్మంపై విపరీతమైన దురద ఏర్పడి దద్దుర్లు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ దురద వల్ల వచ్చిన దద్దుర్లు ఎర్రగా ఏర్పడి మచ్చలుగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు వాడిన తగ్గడం లేదని.. ఇక చిన్నారులపై ఈ దురద ప్రభావం మరింత ఎక్కవగా చూపుతుందని పేర్కొంటున్నారు. పరిశ్రమల కాలుష్యం వల్లనే.. కొందుర్గు పరిసర ప్రాంతంలో ఉన్న దివ్యశక్తి పేపర్ పరిశ్రమ, స్కాన్ ఎనర్జీ పరిశ్రమ, బ్రిటానియా బిస్కెట్ పరిశ్రమ, దిలీప్ టెక్స్టైల్స్ తదితర పరిశ్రమల వల్ల వెలువడుతున్న కాలుష్యం వల్లనే తమకు ఈ దురదలు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మొదటగా చిన్న కురుపులుగా ఏర్పడి, పెద్దగా దద్దుర్లు వస్తున్నాయని అనంతరం మచ్చలుగా మారుతున్నాయని తెలిపారు. పరిశ్రమల నిర్వాహకులు పగలంతా వ్యర్థాలను నిల్వచేసి, రాత్రివేళల్లో విడుదల చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా దివ్యశక్తి పరిశ్రమ నిర్వాహకులు పరిశ్రమ నుంచి వెలువడిన రసాయనాలతో కూడిన వ్యర్థపదార్థాలను పరిశ్రమ ఆవరణలో నిప్పంటించడం వల్ల చుట్టుపక్కల దట్టమైన పొగవస్తుందని, రోడ్డుపై వాహనాలు వెళ్లడానికి కూడా వీలుకావడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ నుంచి రాత్రి సమయంలో విడుదలవుతున్న దట్టమైన పొగవల్ల గ్రామాల్లో ఒకరికికొకరు కనిపించడం లేదంటున్నారు. పొగతో ఇళ్లముందు ఉన్న వస్తువులు కూడా నల్లగా మారుతున్నాయంటున్నారు. ఇలాగే కొనసాగితే ప్రజల జీవన మనుగడ అసాధ్యమేనంటున్నారు. పొగవల్లనే దురదలు.. పరిశ్రమ నిర్వాహకులు రాత్రివేళల్లో వదిలే పొగవల్లనే ఇలా దురదలు వస్తున్నాయి. దురదల కారణంగా పిల్లలు రాత్రివేళల్లో నిద్ర కూడా పోవడం లేదు. ముఖ్యంగా కొందుర్గు శివారులోని దివ్యశక్తి పేపర్ పరిశ్రమ, కొందుర్గు స్కాన్ ఐరన్ పరిశ్రమ వారు వదులుతున్న పొగ ప్రభావం తీవ్రంగా ఉంది. కాలుష్యం నియంత్రించకుంటే ఇబ్బందులు తప్పవు. – సరిత, ఎంపీటీసీ, ఉత్తరాసిపల్లి వస్తువులన్నీ మసిబారుతున్నాయి.. దివ్యశక్తి పరిశ్రమ నిర్వాహకులు రాత్రివేళల్లో వదులుతున్న పొగవల్ల ఇళ్ల ముందు ఉన్న వస్తువులన్నీ మసిబారుతున్నాయి. ఆహార పదార్థాలతోపాటు, కనీసం తాగే నీళ్లు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ విషయమై పలుసార్లు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – చంద్రశేఖర్, ఛత్రపతి యూత్ అధ్యక్షుడు కొందుర్గు వీపును గోడకేసి రాస్తున్నాడు.. మా బాబుకు శరీరంపై మొత్తం దురద ఏర్పడి రాత్రివేళల్లో నిద్ర కూడా పోవడం లేదు. దురదకు భరించలేక వీపును గోడకేసి రాస్తున్నాడు. మా బాబుతోపాటు గ్రామంలో దాదాపు 20 మందికి పైనే ఇలాగే దురద పెట్టి శరీరమంతా దద్దుర్లు పోయాయి. రాత్రివేళల్లో గ్రామమంతా దట్టమైన పొగ కమ్ముకుంటుంది. ఈ పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. – సిద్దులూరి స్వర్ణలత, గంగన్నగూడ