మట్టితో ఆడుకునే పిల్లలు ఇప్పుడు లేరు. మట్టిలో ఆడుకునే పిల్లలు ఇప్పుడు లేరు. కాళ్లకు మట్టి అంటితే బురద అంటితే ఇసుక అంటితే సిమెంటు తొట్టిలోని నీటిని వొంపుకుంటూ పాదాల మీదుగా పారే మట్టి రంగు నీళ్లను చూసే పిల్లలు ఇప్పుడు లేరు. కుండీల్లోని మట్టిని తాకరు. పంట పైరుల్లోని మట్టిని తాకరు. అడవిలోని మట్టిని తాకరు. మన తాతలు తిరుగాడిన మట్టినేలలను తాకరు. వారు చదువులను చదువుతూ క్లాస్‌రూమ్ స్క్రీన్ మీద మట్టిని చూస్తారు. ఇలాంటి పిల్లలకు మట్టి విలువ ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులే. నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం. మట్టికో నమస్కారం పెట్టుకోవాల్సిన రోజు.
పిల్లలు తల్లిని అడిగారట. ‘అమ్మా.. మనిషి దేవుడి కంటే గొప్పవాడా?’
అప్పుడు తల్లి ఈ జోక్ చెప్పింది. ఒక సైంటిస్ట్ దేవుడితో ‘దేవుడా... మనిషి నీతో సమానంగా సృష్టించగలడు. చెప్పు.. ఏది సృష్టించి చూపమంటావు?’ అన్నాడు. దానికి దేవుడు ‘సరే... మనిషిని సృష్టించు’ అన్నాడు. అప్పుడు సైంటిస్ట్ ‘అలాగే’ అని కొంచెం మట్టి తీసుకోతుంటే దేవుడు వారించి అన్నాడు– ‘ఒక్క నిమిషం. ఆ మట్టి కూడా నువ్వు సృష్టించిందే అయి ఉండాలి నాయనా’. మనిషిని సృష్టించగలనని విర్రవీగిన సైంటిస్ట్ చిటికెడు మట్టిని సృష్టించలేక తెల్లముఖం వేశాడు.
ఆ జోక్ చెప్పి తల్లి ‘ప్రకృతి నుంచి మనిషి దేనినైనా సృష్టించగలడు. కాని ప్రకృతిని సృష్టించలేడు. ప్రకృతిని విస్తరించాలి. ఉన్నది కాపాడుకోవాలి. మట్టితో సహా’ అని వివరించింది.
పిల్లలు తల్లిని అడిగారట ‘అమ్మా మనిషి అన్నింటికీ విరుగుడు కనిపెట్టగలడు కదా’.
దానికి తల్లి జవాబు– నిజమే. మనిషి టెస్ట్‌ట్యూబ్ బేబీలను, క్లోనింగ్ జీవులను సృష్టించేంతగా ఎదిగాడు. కాని మట్టిని సృష్టించగలడా? నేలను సృష్టించగలడా? భూపొరలను, ఆ పొరలలో దాగిన ఖనిజ లవణాలని, నీటిని, జీవజాలాన్ని సృష్టించగలడా? కోవిడ్ వంటి మహమ్మారి వ్యాపిస్తోందని వాక్సిన్ కోసం పరుగులు తీస్తున్న మనిషి నేల చనిపోతుంటే తన జీవాన్ని కోల్పోతూ ఉంటే ఆ ఉత్పాతానికి విరుగుడు కనిపెట్టడానికి ఎందుకు తొందరపడటం లేదు?
పిల్లలు తల్లిని అడిగారట– ’అమ్మా... మట్టి లేకపోతే ఏమవుతుంది?’
దానికి తల్లి జవాబు – ఈ భూమి మీద కనీసం 40 శాతం అడవులు ఉండాలి. కాని ఒక అంచనా ప్రకారం 13 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే మరో 30 ఏళ్లు ఆగితే వాన భూమి మీద కాకుండా సముద్రం మీద మాత్రమే కురుçస్తుంటుంది. మట్టి నీటిని తీసుకోవాలి. తిరిగి నింగికి నీటిని ఇవ్వాలి. ఈ చక్రానికి ఒక మహా విఘాతం కలగబోతోంది. వానల్ని లాగి ఆకర్షించే అడవి నేల మీద లేకపోతే మేఘం ఎందుకు వస్తుంది? మట్టి ఉంటే చెట్టు ఉంటుంది. చెట్టు ఉంటే వాన దాంతో పాటు మనిషి మనుగడ ఉంటుంది.
పిల్లలు తల్లిని అడిగారట ‘మట్టి ఎలా నాశనం అవుతుంది?’
దానికి తల్లి జవాబు– మట్టి నుంచి సహజంగా వచ్చేది ఏదైనా మట్టిలో కలిసిపోతుంది. కాని మట్టికి అమోదం లేని పద్ధతిలో మనిషి తయారు చేసే కఠినమైన పదార్థాలను మట్టి తీసుకోదు. నిరాకరిస్తుంది. ప్లాస్టిక్, కెమికల్స్, పారిశ్రామిక వ్యర్థాలు, ఔషధ పరిశ్రమల విసర్జనాలు... వీటిని మట్టికి మనిషి తినిపిస్తున్నాడు. ఈ విషాహారం తినే కొద్దీ మట్టి మెల్లమెల్లగా చచ్చిపోతోంది. గత 25 ఏళ్లలో భారతదేశం సజీవ మృత్తికను అంటే మొలకెత్తే మట్టిని దాదాపు 38 శాతం కోల్పోయిందని ఒక అధ్యయనం చెబుతోంది. అంటే అది పంటకు పనికి రాదు. అది మృతభూమి.
పిల్లలు తల్లిని అడిగారట ‘మట్టి ఎవరికి ముఖ్యం?
దానికి తల్లి జవాబు– మట్టి మనందరికీ ముఖ్యం. కాని రైతుకు ఇంకా ముఖ్యం. ఎందుకంటే మట్టిలో కష్టించి పంటను పండిస్తాడు. మన ఆకలిని తీరుస్తాడు. సిటీలో ఉన్నవాడు మట్టి మీద కట్టిన ఒక ఫ్లాట్, కార్ పార్కింగ్‌కు స్థలం దొరికితే చాలనుకుంటాడు. రైతు మాత్రం పంట పండే చేనుముక్కను కోరుకుంటాడు.
‘నేల తల్లి నీకు వందనం... మడిచేల తల్లి నీకు వందనం అని పాడుకునేది రైతు ఒక్కడే’. ఎంతటి మహాచక్రవర్తి అయినా మట్టి లేకపోతే మృతసమానుడు అవుతాడు. ఆ కిటుకు తెలుసు కనుకనే బలి చక్రవర్తిని వామనుడు మట్టిని వరంగా కోరి పరిహరిస్తాడు. మట్టి మనిషి బలం. జీవధాతువు.
∙∙
పిల్లలు తల్లిని అడిగారట– ‘అమ్మా... మేము ఏం చేయాలి?’
దానికి తల్లి జవాబు– ‘ఇవాళ మీరే ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకు వస్తున్నారు. బాల పర్యావరణ వేత్తలే ప్రపంచ వ్యాప్తంగా మట్టికి జరుగుతున్న ద్రోహాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు.
మీ క్లాస్‌లో స్కూల్‌లో ఈ చైతన్యం మరింత నింపాల్సిన అవసరం ఉంది. మట్టిని కలుషితం చేసే వ్యవసాయ విధానాలు, పారిశ్రామిక విధానాలు, వాణిజ్య పంటల విధానాలు, జల నిర్వహణ విధానాలు, అటవీ విధానాలు ప్రభుత్వాలు మానుకోవాలని మీరు డిమాండ్ చేయాలి. మట్టిని కాపాడుకుంటాం అని ప్రతిజ్ఞ చేయాలి.
పిల్లలూ... మట్టి విలువ తెలుసుకోండి
Published Sun, Dec 5 2021 4:14 AM | Last Updated on Sun, Dec 5 2021 4:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment