Ecologists
-
నగరాన్ని రక్షిస్తున్నవి అవే!
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలు హైదరాబాద్ మహానగర సహజసిద్ధ పర్యావరణ వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్నాయని.. అన్నికాలాల్లో నగరాన్ని కాపాడుతున్న వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సార్వత్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడటం, తాగునీటి సరఫరా, పరిసర ప్రాంతాల సాగు అవసరాల కోసం ఈ రెండు రిజర్వాయర్లను నిర్మించిన విషయాన్ని ప్రభుత్వాలు మరవొద్దని సూచించారు. జీవో 111 ఎక్కడికీ పోదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్త కొత్త రిజర్వాయర్లు కడుతూ.. ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. జంట జలాశయాలు, జీవో 111 తొలగింపుతో ముడిపడిన అం శాలపై ఆమె ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చా రు. ముఖ్యాంశాలు లుబ్నా సార్వత్ మాటల్లోనే.. ‘జంట’ వరప్రదాయిని! ‘‘దశాబ్దాలుగా హైదరాబాద్‌కు గుర్తింపుగా ఉన్న జలాశయాలతో.. పర్యావరణం, జీవవైవిధ్యం, పచ్చదనంతో ముడిపడిన జీవో 111 ఎక్కడికి పోదు. దానిని ఎవరూ ఏమీ చేయలేరు. సీఎంగా ప్రజలకు ఉన్నతమైన సదుపాయాలు కల్పించాలనే భావన ఉండాలి. కానీ దాదాపు 80ఏళ్లకుపైగా కొం డలపై నుంచి, ఔషధ గుణాలున్న అటవీ సంపద మీదుగా, చిన్న చిన్న వాగులు వంకలుగా ఈ రెండు రిజర్వాయర్లలోకి వర్షపు నీరు చేరుతోంది. మళ్లీ గ్రావిటీ ద్వారానే ఆసిఫ్‌నగర్, మీరాలం ఫిల్టర్‌బెడ్ లోకి నీటిసరఫరా జరుగుతోంది. వేసవిలో వచ్చే వడగాడ్పుల నుంచి నగరాన్ని కాపాడుతూ చల్లగా ఉంచుతోంది అలా వరప్రదాయినిగా ఉన్న ఈ రెండు చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. అవిలేకుంటే.. నిండా ముంచే వరదలొస్తే పూర్తిగా నష్టపోయేది హైదరాబాదేనని అందరూ గుర్తించాలి. ‘మినరల్ రిచ్’ నీళ్లు అవి ఒక్కో నది, ఒక్కో చెరువు నీటి రుచి వేరుగా ఉంటుంది. ప్రకృతిపరంగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి ‘మినరల్ రిచ్’ తాగునీరు సహజసిద్ధంగా గ్రావిటీ ద్వారా సరఫరా అవుతుంటే.. కాదనడంలో అర్థం లేదు. కృష్ణా నది క్రమంగా కుంచించుకుపోయి కాలుష్యం బారిన పడుతోంది. కృష్ణా, గోదావరి నీటిని పైపుల ద్వారా వచ్చే వందేళ్లకు సరఫరా చేస్తామనడం నమ్మశక్యంగా లేదు. భవిష్యత్‌లో నీటి కరువు ఏర్పడితే, పైపుల నీటి సరఫరా ఆగిపోతే.. ఏం చేయగలరు? జంట జలాశయాలను కాపాడుకోవాలి. కబ్జాలు తొలగించకుండా.. జీవోనే వద్దంటారా ? గత కొన్నేళ్లుగా జంట రిజర్వాయర్ల క్యాచ్మెంట్లలో భారీగా అక్రమ కట్టడాలు పెరిగాయి. వాటిని తొలగించి జలాశయాలను పరిరక్షించకుండా.. జీవో 111ను ఎత్తేస్తామనడంలో ఆంతర్యమేంటి? చిల్కూరు రిజర్వ్ ఫారెస్ట్, వికారాబాద్ అటవీ ప్రాంతం తదితరాలతో ముడిపడి, జతకలిసిన ఈ జలాశయాలను కాపాడుకోవాలి. సీఎం వ్యాఖ్యలను తొలగించాలి అసెంబ్లీలో జీవో 111పై సీఎం కేసీఆర్ మాట్లాడినపుడు జంట జలాశయాలు మృతి చెందాయంటూ చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను. 2016–17లో, తర్వాత గత రెండేళ్లలో వచ్చిన భారీ వరదల నుంచి.. సజీవంగా ఉన్న ఈ రెండు రిజర్వాయర్లే హైదరాబాద్‌ను కాపాడాయి. వేగంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రోజుల్లో తక్కువ సమయంలో కుండపోత వానలు పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాంటి సమయంలో హైదరాబాద్‌ను కాపాడగలిగేది ఈ రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లే అన్న విషయం మరవొద్దు. ఇప్పుడు ఎండాకాలంలో (మార్చి 16న) కూడా ఉస్మాన్‌సాగర్ నుంచి 91 మిలియన్ గ్యాలన్ల నీటిని, హిమాయత్‌సాగర్ నుంచి 16 మిలియన్ గ్యాలన్ల నీటిని.. హైదరాబాద్ ప్రజలకు సరఫరా చేసినట్టు వాటర్‌బోర్డు వెబ్సైట్ తాజా గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. -
సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111?
సాక్షి, హైదరాబాద్: జీవో 111 ఎత్తివేస్తామంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై పర్యావరణ వేత్తలు, నీటి వనరుల రంగ నిపుణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మహానగరానికి అత్యంత సమీపాన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు ఉన్నాయని, నగరంతో ముడిపడిన జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్య ప్రాంతం మొత్తం కూడా ఈ జలాశయాల పరిధిలోనే ఉందని వారు చెబుతున్నారు. ఈ ప్రకృతి సహజసిద్ధమైన లక్షణం, నగరానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న పరిస్థితులు దెబ్బతింటే.. ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నగర వాతావరణంలో పెను మార్పులు సంభవించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. జలాశయాల ప్రాధాన్యత తగ్గించకూడదు ‘దేశంలో, బహుశా ప్రపంచంలో కరెంట్ లేకుండా నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ మాత్రమే. అంటే సున్నా శాతం కర్బన ఉద్ఘారాలతో నీటిని సరఫరా చేసే ఇంతగొప్ప జలాశయాలను గొప్పగా చూపుకోవాలి. అంతేకానీ వాటి ప్రాధాన్యతను, విలువను తగ్గించకూడదు. 1908లో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తినప్పుడు వాటి నివారణకు నీటిపారుదల రంగ నిపుణుడు, రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వశ్వేరయ్య విభిన్న ఆలోచనలతో ముందుచూపుతో వీటికి డిజైన్ చేశారు..’అని సమీకృత నీటివనరుల నిర్వహణ నిపుణుడు, భారత ప్రమాణాల సంస్థ సాంకేతిక సభ్యుడు బీవీ సుబ్బారావు తెలిపారు. చదవండి: CM KCR: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వరాల వర్షం బీవీ సుబ్బారావు, పురుషోత్తంరెడ్డి ప్రస్తుతం పరిమితులు లేని పట్టణీకరణ పెనుసమస్యగా మారిందని, పట్టణీకరణలో కూడా సుస్థిరమైన నీటిసరఫరా అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ముఖ్యమని చెప్పారు. అభివృద్ధి అంటే కాంక్రీట్ బిల్డింగ్లు కట్టి అమ్మేయడం కాదన్నారు. హుస్సేన్‌సాగర్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ జంట జలాశయాల విషయంలో జరగకుండా చూసుకోవాలని సూచించారు. వాటి అవసరం తీరిపోయిందన్నట్టుగా మాట్లాడటం సరికాదన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో అన్ని అంశాలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచించారు. కోర్టుల ముందు నిలబడలేదు ‘భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూసీనదిపై ఈ రెండింటినీ నిర్మించారు. జీవో 111ను సుప్రీంకోర్టు గతంలో పూర్తిగా సమర్థించింది. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని వాతావరణ సమతుల్యాన్ని పాటిస్తూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అందువల్ల జీవో 111ను ఏమీ చేయలేరు. తమకు అధికారం ఉందని ఏదైనా చేసినా కోర్టుల ఎదుట ఎంతమాత్రం నిలబడదు. రియల్ ఎస్టేట్ లాబీకి, కార్పొరేట్ ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగితే ప్రజలు ఈ ప్రతిష్టాత్మక అంశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు..’అని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి హెచ్చరించారు. పర్యావరణాన్ని, భవిష్యత్ తరాల ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని అన్నారు. అసలేంటి జీవో 111 హైదరాబాద్ నగరానికి వరద ముప్పు తప్పించడంతోపాటు తాగునీటిని అందించేందుకు నిజాం కాలంలో ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. హైదరాబాద్ మహా నగరానికి ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి. గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నగరానికి నీళ్లు తీసుకునేవారు. ఇప్పుడది తగ్గిపోయింది. ఎండా కాలంలో సంక్షోభం వచ్చినప్పుడు నీళ్లు తీసుకునే సందర్భం ఉంది. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ రెండు జలాశయాల నీళ్లు వాడుకోవాల్సిన అవసరం లేదు. సుమారు 1,32,600 ఎకరాల భూమి జీవో పరిధిలో ఉంది. 83 గ్రామాలు, ఏడు మండలాలు కలిసి ఉన్నాయి. ఈ రిజర్వాయర్ల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. అయితే రిజర్వాయర్ల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ.. 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం పలు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇవీ నిబంధనలు జీఓ పరిధిలో మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, రాజేంద్రనగర్, కొత్తూరు మండలాల్లోని 83 గ్రామాలను చేర్చింది. ఈ జీవో పరిధిలో కాలుష్యకారకమైన ఫ్యాక్టరీలు, నిర్మాణాలు, లేఅవుట్లు, వెంచర్లు చేపట్టవద్దని నిబంధనలు పెట్టింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లే అవుట్లలో 60శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. అక్కడ వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. జలాశయాల్లో రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదు. -
పిల్లలూ... మట్టి విలువ తెలుసుకోండి
మట్టితో ఆడుకునే పిల్లలు ఇప్పుడు లేరు. మట్టిలో ఆడుకునే పిల్లలు ఇప్పుడు లేరు. కాళ్లకు మట్టి అంటితే బురద అంటితే ఇసుక అంటితే సిమెంటు తొట్టిలోని నీటిని వొంపుకుంటూ పాదాల మీదుగా పారే మట్టి రంగు నీళ్లను చూసే పిల్లలు ఇప్పుడు లేరు. కుండీల్లోని మట్టిని తాకరు. పంట పైరుల్లోని మట్టిని తాకరు. అడవిలోని మట్టిని తాకరు. మన తాతలు తిరుగాడిన మట్టినేలలను తాకరు. వారు చదువులను చదువుతూ క్లాస్రూమ్ స్క్రీన్ మీద మట్టిని చూస్తారు. ఇలాంటి పిల్లలకు మట్టి విలువ ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులే. నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం. మట్టికో నమస్కారం పెట్టుకోవాల్సిన రోజు. పిల్లలు తల్లిని అడిగారట. ‘అమ్మా.. మనిషి దేవుడి కంటే గొప్పవాడా?’ అప్పుడు తల్లి ఈ జోక్ చెప్పింది. ఒక సైంటిస్ట్ దేవుడితో ‘దేవుడా... మనిషి నీతో సమానంగా సృష్టించగలడు. చెప్పు.. ఏది సృష్టించి చూపమంటావు?’ అన్నాడు. దానికి దేవుడు ‘సరే... మనిషిని సృష్టించు’ అన్నాడు. అప్పుడు సైంటిస్ట్ ‘అలాగే’ అని కొంచెం మట్టి తీసుకోతుంటే దేవుడు వారించి అన్నాడు– ‘ఒక్క నిమిషం. ఆ మట్టి కూడా నువ్వు సృష్టించిందే అయి ఉండాలి నాయనా’. మనిషిని సృష్టించగలనని విర్రవీగిన సైంటిస్ట్ చిటికెడు మట్టిని సృష్టించలేక తెల్లముఖం వేశాడు. ఆ జోక్ చెప్పి తల్లి ‘ప్రకృతి నుంచి మనిషి దేనినైనా సృష్టించగలడు. కాని ప్రకృతిని సృష్టించలేడు. ప్రకృతిని విస్తరించాలి. ఉన్నది కాపాడుకోవాలి. మట్టితో సహా’ అని వివరించింది. పిల్లలు తల్లిని అడిగారట ‘అమ్మా మనిషి అన్నింటికీ విరుగుడు కనిపెట్టగలడు కదా’. దానికి తల్లి జవాబు– నిజమే. మనిషి టెస్ట్‌ట్యూబ్ బేబీలను, క్లోనింగ్ జీవులను సృష్టించేంతగా ఎదిగాడు. కాని మట్టిని సృష్టించగలడా? నేలను సృష్టించగలడా? భూపొరలను, ఆ పొరలలో దాగిన ఖనిజ లవణాలని, నీటిని, జీవజాలాన్ని సృష్టించగలడా? కోవిడ్ వంటి మహమ్మారి వ్యాపిస్తోందని వాక్సిన్ కోసం పరుగులు తీస్తున్న మనిషి నేల చనిపోతుంటే తన జీవాన్ని కోల్పోతూ ఉంటే ఆ ఉత్పాతానికి విరుగుడు కనిపెట్టడానికి ఎందుకు తొందరపడటం లేదు? పిల్లలు తల్లిని అడిగారట– ’అమ్మా... మట్టి లేకపోతే ఏమవుతుంది?’ దానికి తల్లి జవాబు – ఈ భూమి మీద కనీసం 40 శాతం అడవులు ఉండాలి. కాని ఒక అంచనా ప్రకారం 13 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే మరో 30 ఏళ్లు ఆగితే వాన భూమి మీద కాకుండా సముద్రం మీద మాత్రమే కురుçస్తుంటుంది. మట్టి నీటిని తీసుకోవాలి. తిరిగి నింగికి నీటిని ఇవ్వాలి. ఈ చక్రానికి ఒక మహా విఘాతం కలగబోతోంది. వానల్ని లాగి ఆకర్షించే అడవి నేల మీద లేకపోతే మేఘం ఎందుకు వస్తుంది? మట్టి ఉంటే చెట్టు ఉంటుంది. చెట్టు ఉంటే వాన దాంతో పాటు మనిషి మనుగడ ఉంటుంది. పిల్లలు తల్లిని అడిగారట ‘మట్టి ఎలా నాశనం అవుతుంది?’ దానికి తల్లి జవాబు– మట్టి నుంచి సహజంగా వచ్చేది ఏదైనా మట్టిలో కలిసిపోతుంది. కాని మట్టికి అమోదం లేని పద్ధతిలో మనిషి తయారు చేసే కఠినమైన పదార్థాలను మట్టి తీసుకోదు. నిరాకరిస్తుంది. ప్లాస్టిక్, కెమికల్స్, పారిశ్రామిక వ్యర్థాలు, ఔషధ పరిశ్రమల విసర్జనాలు... వీటిని మట్టికి మనిషి తినిపిస్తున్నాడు. ఈ విషాహారం తినే కొద్దీ మట్టి మెల్లమెల్లగా చచ్చిపోతోంది. గత 25 ఏళ్లలో భారతదేశం సజీవ మృత్తికను అంటే మొలకెత్తే మట్టిని దాదాపు 38 శాతం కోల్పోయిందని ఒక అధ్యయనం చెబుతోంది. అంటే అది పంటకు పనికి రాదు. అది మృతభూమి. పిల్లలు తల్లిని అడిగారట ‘మట్టి ఎవరికి ముఖ్యం? దానికి తల్లి జవాబు– మట్టి మనందరికీ ముఖ్యం. కాని రైతుకు ఇంకా ముఖ్యం. ఎందుకంటే మట్టిలో కష్టించి పంటను పండిస్తాడు. మన ఆకలిని తీరుస్తాడు. సిటీలో ఉన్నవాడు మట్టి మీద కట్టిన ఒక ఫ్లాట్, కార్ పార్కింగ్‌కు స్థలం దొరికితే చాలనుకుంటాడు. రైతు మాత్రం పంట పండే చేనుముక్కను కోరుకుంటాడు. ‘నేల తల్లి నీకు వందనం... మడిచేల తల్లి నీకు వందనం అని పాడుకునేది రైతు ఒక్కడే’. ఎంతటి మహాచక్రవర్తి అయినా మట్టి లేకపోతే మృతసమానుడు అవుతాడు. ఆ కిటుకు తెలుసు కనుకనే బలి చక్రవర్తిని వామనుడు మట్టిని వరంగా కోరి పరిహరిస్తాడు. మట్టి మనిషి బలం. జీవధాతువు. ∙∙ పిల్లలు తల్లిని అడిగారట– ‘అమ్మా... మేము ఏం చేయాలి?’ దానికి తల్లి జవాబు– ‘ఇవాళ మీరే ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకు వస్తున్నారు. బాల పర్యావరణ వేత్తలే ప్రపంచ వ్యాప్తంగా మట్టికి జరుగుతున్న ద్రోహాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. మీ క్లాస్‌లో స్కూల్లో ఈ చైతన్యం మరింత నింపాల్సిన అవసరం ఉంది. మట్టిని కలుషితం చేసే వ్యవసాయ విధానాలు, పారిశ్రామిక విధానాలు, వాణిజ్య పంటల విధానాలు, జల నిర్వహణ విధానాలు, అటవీ విధానాలు ప్రభుత్వాలు మానుకోవాలని మీరు డిమాండ్ చేయాలి. మట్టిని కాపాడుకుంటాం అని ప్రతిజ్ఞ చేయాలి. -
తూర్పు కనుమల్లో తగ్గుతున్న అడవులు
సాక్షి, అమరావతి: వాతావరణ సమతుల్యతను కాపాడటం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో తూర్పు కనుమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నైరుతి, ఈశాన్య రుతు పవనాల గమనంలోనూ వీటి పాత్ర ఎంతో కీలకం. మన రాష్ట్రానికి జీవనాడులుగా ఉన్న కృష్ణా, గోదావరి సహా అనేక నదుల్లో నీరు చేరడానికి ఈ పర్వత శ్రేణులు ఎంతగానో దోహడపడుతున్నాయి. ఆ నదులు పుట్టింది పశ్చిమ కనుమల్లో అయినా.. వాటిలో ప్రవహించే నీరు చాలావరకూ తూర్పు కనుమల్లో పుట్టిన ఉప నదుల నుంచే వస్తోంది. మన రాష్ట్రంలో వంశధార, నాగావళి, చంపావతి, గోస్తనీ, శబరి, సీలేరు, తమ్మిలేరు, గుండ్లకమ్మ, స్వర్ణముఖి, కుందు వంటి అనేక ఉప నదులు ఈ కనుమల్లోనే పుట్టి ప్రధాన నదుల్లో కలుస్తున్నాయి. ఆ నదుల్లోని నీటినే మనం తాగడానికి, ఆహార ధాన్యాలు పండించడానికి వినియోగించుకుంటున్నాం. వేగంగా తరిగిపోతున్న అడవులు తూర్పు కనుమల్లోని అడవులు వేగంగా తరిగిపోతున్నట్టు అశోక్ ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకోలజీ అండ్ ఎన్విరాన్మెంట్ (ఏటీఆర్ఈఈ) ఇటీవల జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఏటా సగటున 28 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఇతర అవసరాలకు మళ్లుతున్నట్టు తేలింది. పోడు వ్యవసాయం, వాణిజ్య తోటల పెంపకం, చెట్లను నరకడం, మైనింగ్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పాపికొండలు, నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ వంటి రక్షిత ప్రాంతాలు మంచి అడవులతో వివిధ జంతు జాలాలకు నిలయంగా ఉన్నా పాడేరు, అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాలు ఇప్పటికే అడవులను కోల్పోయినట్టు తేలింది. వీటి స్థానంలో ఎక్కువ భాగం కాఫీ తోటలు వెలిశాయి. తూర్పు కనుమలు దెబ్బతింటే ఆ ప్రభావం ఈ నదులపై పడుతుంది. అప్పుడు ఈ నదుల నీటిపై ఆధారపడిన మనపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటి తూర్పు కనుమల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అత్యావశ్యకమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అరుదైన జంతుజాలం.. తూర్పు కనుమలు హిమాలయాల కంటే పురాతన పర్వత శ్రేణులు. ఇవి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని భాగాలను తాకుతాయి. 40 శాతం భాగం మన రాష్ట్రంలో ఉంటే ఒడిశా, తమిళనాడులో 25 శాతం చొప్పున, కర్ణాటక, తెలంగాణలో 5 శాతం చొప్పున వీటి విస్తీర్ణం ఉంది. మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి. ఈ పర్వతాల మధ్య కృష్ణా, గోదావరి, పెన్నా వంటి నదులు ప్రవహిస్తుండటం వల్ల అవి విడిపోయి ఉంటాయి. మన రాష్ట్రంలో భాగంగా ఉన్న తూర్పు కనుమల్లోని అడవులు ప్రత్యేకమైన జీవ వైవిధ్యానికి నిలయంగా భాసిల్లుతున్నాయి. గోల్డెన్ గెకో (బంగారు బల్లి), జెర్డాన్ కోర్సర్ (కలివి కోడి), జైపూర్ గ్రౌండ్ గెకో (జైపూర్ నేలబల్లి) వంటి అరుదైన జంతుజాలం ఇక్కడ ఉంది. పశ్చిమ కనుమలపై జరిగినన్ని పరిశోధనలు, అధ్యయనాలు తూర్పు కనుమలపై జరగకపోవడం వల్ల వీటి ప్రాముఖ్యత పెద్దగా వెలుగులోకి రాలేదు. గత 20 ఏళ్లుగా సహజ శాస్త్రాలు నిరాదరణకు గురైనట్టు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు కనుమలతోనే మన భవిష్యత్ తూర్పు కనుమల భవిష్యత్తుతోనే మన భవిష్యత్ ముడిపడి ఉంది. రాజీ లేకుండా అడవులను పరిరక్షించాలి. 18 నెలలుగా ఐఐఎస్ఈఆర్ సిటిజెన్ సైన్స్ నిర్వహించిన కార్యక్రమంలో అనేక పక్షులు, సీతాకోక చిలుకలు, ఇతర జంతు జాలాన్ని కొత్తగా రికార్డు చేశాం. పశ్చిమ కనుమలు, హిమాలయాల మాదిరిగానే తూర్పు కనుముల ప్రాంతం జీవ వైవిధ్యానికి హాట్‌స్పాట్‌గా ఉంది. – రాజశేఖర్ బండి, ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైంటిస్ట్ -
ప్రాణాలకు తెగించి చేసే దొంగతనానికి గుర్తింపు!
ఈ ప్రకృతిలో జీవుల మధ్య మనుగడ పోరాటం చాలా వైవిధ్యంగా సాగుతుంటుంది. సాధారణంగా పక్షుల్లో చాలా రకాలు గూడు కట్టుకోవడం కోసం చాలా కష్టపడుతుంటాయి. గడ్డి పోచలు, ఆకులతో పాటు చిన్న కట్టెపుల్లలను ఉపయోగించుకుంటాయి. అలాగే ఇంకొన్ని పక్షులు జంతువుల నుంచి జుట్టును తస్కరిస్తుంటాయి. ఈ క్రమంలో వాటి చేతిలో గాయపడడమో లేదంటే చనిపోవడమో జరుగుతుంది కూడా. సైంటిఫిక్‌గా ఈ చర్యకు ఇన్నాళ్లూ ఓ పేరంటూ లేదు. తాజాగా పక్షులు చేసే ఈ సాహసోపేతమైన చర్యకు ఓ పదం, అర్థం ఇచ్చారు సైంటిస్టులు. అసాధారణమైన ఈ ప్రవర్తనకు ‘క్లెప్టోట్రిచి’ అని పేరు పెట్టారు. ఇది ఒక గ్రీకు పదం.. దానికి దొంగిలించడం లేదా జుట్టు అనే రెండు అర్థాలూ వస్తాయి. అందుకే పక్షుల చర్యకు సరిపోతుందనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు. జులై 27న ఎకాలజీ(జీవావరణ శాస్త్రం)లో ఈ పదం చేర్చినట్లు ఇల్లినాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆగష్టు 11న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భయపెడతాయి.. నిజానికి చలి ప్రాంతాల్లో పక్షులు ఎక్కువగా ఇలా జంతువుల వెంట్రుకలతో గూడులను నిర్మించుకుంటాయి. అంతేకాదు తెలివిని ప్రదర్శించి.. తమ శత్రువులను ఈ గూడుల ద్వారా భయపెడతాయి కూడా. ఎలాగంటే.. వేటాడే వాటికి ఈ గూడును ఏదో భయంకరమైన ప్రాణిగా కనిపించే రీతిలో తీర్చిదిద్దుతాయి ఆ పక్షులు. కుక్కలు, పిల్లులు, నక్కలు, రకూన్లు, ఆఖరికి మనుషుల నుంచి కూడా కొన్ని పక్షులు వెంట్రుకల్ని సేకరిస్తుంటాయి. పడుకున్నప్పుడో లేదంటే తింటున్నప్పుడో.. అదనుచూసి వెంట్రుకల్ని లాగేస్తాయి పక్షులు. ఇది చదవండి: కిడ్నీ మార్పిడిలో పాతవి ఎందుకు తీసేయరంటే.. క్లెప్టోట్రిచిలో భాగంగా.. దక్షిణ అమెరికాలో పామ్ స్విఫ్ట్ పక్షులైతే పావురాలు, చిలుకల నుంచి రెక్కలు దొంగిలించడం విశేషం. ఆస్రే్టలియాలో హనీఈటర్ బర్డ్.. కోవాలాల నుంచి వెంట్రుకలు దొంగతనం చేస్తాయి. ఇలాంటి ప్రవర్తనకు కారణం.. పక్షులు ఈ సేకరణను సులువైన మార్గంగా భావించడమేనని, కానీ, ప్రమాదాలను అంచనా వేయకుండా ఒక్కోసారి అవి ప్రాణాలను పొగొట్టుకుంటాయని యానిమల్ బిహేవియరిస్ట్ మార్క్ హౌబర్ చెప్తున్నారు. -
‘సీతాకోక’ నెలవు.. జీవ వైవిధ్య కొలువు
సాక్షి, అమరావతి: ఒక ప్రాంతంలో జీవ వైవిధ్యం ఎలా ఉందనేది అక్కడున్న సీతాకోకచిలుకల గమనం ప్రతిబింబిస్తుంది. వీటి ఉనికి ఆ ప్రాంతంలోని పర్యావరణ సమతుల్యతను తేటతెల్లం చేస్తుంది. తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల వాటి సంఖ్య అనూహ్యంగా తగ్గిపోతున్న తరుణంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంత పరిధిలో జీవ వైవిధ్యం మెరుగ్గా ఉన్నట్టు పర్యావరణ వేత్తలు గుర్తించారు. ఈ అటవీ ప్రాంత పరిధిలోని మూలపాడులో సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన దేశంలోనూ సర్వే.. విదేశాల్లో మాదిరిగా జీవ వైవిధ్యాన్ని తెలుసుకునేందుకు గత సంవత్సరం నుంచి భారత్‌లోనూ పర్యావరణ వేత్తలు సీతాకోకచిలుకలపై సర్వే ప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకూ బిగ్ బటర్‌ఫ్లై మంత్–2020గా ప్రకటించి సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొండపల్లి అటవీ ప్రాంతంలో 15 కి.మీ. పరిధిలో స్థానిక అటవీ శాఖ అధికారుల సహకారంతో నేషనల్ బట్టర్ఫ్లై కన్సర్వేషన్ సొసైటీ సభ్యులు దాసి రాజేష్ వర్మ, బండి రాజశేఖర్ బృందం సర్వే నిర్వహించి 20 రోజుల్లోనే ఆరు రకాల కొత్త జాతులు ఇక్కడ ఉన్నట్టు గుర్తించింది. వీరు మూలపాడు వద్ద కొత్తగా 6 సీతాకోక చిలుక జాతులను కనుగొన్నారు. అవి 1.ట్రై కలర్ పైడ్ ఫ్లాట్, 2.కంప్లీట్ పెయింట్ బ్రష్ స్విఫ్ట్, 3.బాంబూ ట్రీ బ్రౌన్, 4.డింగీ లైన్ బ్లూ, 5.పాయింటెడ్ సిలియేట్ బ్లూ, 6.గోల్డెన్ ఏంజిల్. ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించే చెట్లు, వన్యప్రాణులు ఎక్కువగా ఉండటం వల్లే కొత్త జాతులు ఇక్కడకు వస్తున్నట్టు సర్వే బృందం గుర్తించింది. కొత్తగా కనుగొన్న జాతులతో కలిపి ఈ ప్రాంతంలో ఉన్న సీతాకోకచిలుక జాతుల సంఖ్య 62కి చేరింది. ఈ ప్రాంత గొప్పతనం.. విజయవాడకు సమీపంలో ఇంతటి జీవ వైవిధ్యం ఉన్న అటవీ ప్రాంతం ఉండటం విశేషం. కాలుష్యం, పట్టణీకరణ, వాతావరణ మార్పుల వల్ల ఇక్కడా సీతాకోకచిలుకల సంఖ్య గతం కంటె తగ్గుతున్నా కొత్త కొత్త జాతులు మనుగడ సాగిస్తున్నాయి. ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – దాసి రాజేష్ వర్మ, బట్టర్ఫ్లై కన్సర్వేషన్ సొసైటీ సభ్యుడు మారుతున్న పరిస్థితుల వల్లనే.. ఇంతకుముందు ఈ జాతులు ఇక్కడ కనపడేవి కాదు. మారిన వాతావరణ పరిస్థితులను బట్టి అవి ఈ ప్రాంతానికి వస్తున్నట్టు గుర్తించాం. గత సంవత్సర కాలంగా ఈ ప్రాంతంలో పలు కొత్త జాతులను కనుగొన్నారు. ఇక్కడున్న చెట్లు, వన్యప్రాణుల వైవిధ్యం వల్లే ఇవి ఇక్కడ ఎక్కువగా ఉంటున్నాయి. – బి.లెనిన్ కుమార్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కొండపల్లి రిజర్వుడ్ ఫారెస్ట్ -
బాబోయ్.. భూతాపం
సాక్షి, అమరావతి: ప్రకృతితో మనుషులు ఆడుతున్న చెలగాటం భవిష్యత్తు తరాలకు ప్రాణసంకటంగా మారుతోంది. భూమండలాన్ని అమాంతం కమ్మేస్తున్న కర్బన ఉద్గారాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. యథేచ్ఛగా అడవుల నరికివేత.. మితిమీరిన వాహనాల వినియోగం.. విచ్చలవిడిగా పారిశ్రామికీకరణ వంటివి పర్యావరణాన్ని కబళిస్తున్నాయి. భూతాపం వల్ల 2100 సంవత్సరం నుంచి భారతదేశంలో ఏటా 15 లక్షల మంది మృత్యువాత పడే అవకాశాలున్నాయని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని టాటా సెంటర్ ఫర్ డెవలప్మెంట్తో(టీసీడీ) కలిసి క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఆరు రాష్ట్రాలు తీవ్ర విపత్తును ఎదుర్కోక తప్పదని ఈ అధ్యయనంలో వెల్లడికావడం గమనార్హం. భూతాపం వల్ల దేశంలో ఏటా సంభవించే 15 లక్షల మరణాల్లో 64 శాతం మరణాలు ఆరు రాష్ట్రాల్లోనే సంభవిస్తాయని తేలింది. ఉత్తరప్రదేశ్‌లో 4,02,280, బిహార్‌లో 1,36,372, రాజస్థాన్‌లో 1,21,809, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(ఏపీ, తెలంగాణ) 1,16,920, మధ్యప్రదేశ్‌లో 1,08,370, మహారాష్ట్రలో 1,06,749 మరణాలు సంభవిస్తాయని బహిర్గతమైంది. ఆందోళనకరంగా ఏపీ పరిస్థితి 2100 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 4 శాతం పెరుగుతాయని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ వెల్లడించింది. దీని ప్రకారం.. ప్రకాశం, చిత్తూరు జిల్లాలు మినహా వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. శేషాచలం, నల్లమల వల్ల చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత అదుపులో ఉంటాయి. తూర్పు కనుమలు ఉన్నందున ఉత్తరాంధ్రలో కొంత సానుకూలంగా ఉంటుంది. కోస్తాలో అధిక ఉష్ణోగ్రతలుంటాయి. కోనసీమలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. సముద్ర తీరం వెంట మట్టి క్షయం తప్పదు. భారీగా తీరం కోతకు గురవుతుంది. కోనసీమ తీవ్రమైన తుఫాన్ల బారినపడే అవకాశాలున్నాయి. సముద్ర నీటి మట్టం పెరగడంతో కృష్ణా, గోదావరి డెల్టాలు తీవ్రంగా నష్టపోతాయి. అడవి తల్లే ఆపద్బాంధవి భూతాపం తగ్గించేందుకు రాష్ట్రమంతా సతతహరిత వనంగా ఉండేలా చూడాలి. పంటల మార్పిడి చేయాలి. ఉద్యానవన వ్యవసాయ విధానాలు అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. తీరప్రాంతం నుంచి 300 మీటర్లు వరకు మడ అడవులను అభివృద్ధిపరచాలి. కార్బన్ డయాక్సైడ్ కుంపటి ప్రస్తుతం భారత్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్. 2100 నాటికి అది 28 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుందని అంచనా. కొన్ని ప్రాంతాల్లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు పెరిగి 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశంలో ఏటా 67 రోజులు 35 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భవిష్యత్తులో ఇది 42.50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుందని అంచనా. 2019 సెప్టెంబర్‌లో గ్లోబల్ కార్బన్ డయాక్సైడ్ స్థాయి 408.55 పార్ట్స్ పర్ మిలియన్గా(పీపీఎం) నమోదైంది. ఇది 2040 నాటికి 540 పీపీఎంకు, 2100 నాటికి 940 పీపీఎంకు చేరుకోనుంది. అడవుల పెంపకంతోనే... ‘‘భూతాపం పెరగడం మానవాళికి తీవ్రనష్టం కలిగిస్తుంది. భూతాపం తగ్గించేందుకు అటవీ విస్తీర్ణాన్ని పెంచడమే ఏకైక పరిష్కార మార్గం. ప్రస్తుతం రాష్ట్రంలో 24 శాతం అటవీ ప్రాంతం ఉంది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా 33 శాతం అటవీ ప్రాంతం ఉండేలా చూడాలి. అందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అడవుల నరికివేతను అడ్డుకోడానికి కఠిన చర్యలు చేపట్టాలి. బయోడైవర్సిటీ రిజిస్టర్‌ను కచ్చితంగా అమలు చేసి, పర్యావరణాన్ని పరిరక్షించాలి’’ – టి.బైరాగిరెడ్డి, ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ తీరప్రాంతాన్ని అటవీశాఖ పరిధిలోకి తేవాలి ‘‘మన రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి. అందుకోసం తీర ప్రాంతాన్ని అటవీశాఖ పరిధిలోకి తీసుకురావాలి. తద్వారా తుఫాన్లు, తీరం కోత, మట్టి క్షయం వంటి ఉత్పాతాలను సమర్థంగా ఎదుర్కోవచ్చు’’ – మనోజ్ నగనాగుల, పర్యావరణవేత్త -
గోవాకూ కేరళ గతే!
పణజీ: వీలైనంత త్వరగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే గోవాలో కూడా కేరళ పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చరిస్తున్నారు. గోవా కూడా పర్యావరణానికి హాని కలిగించే కార్యకలాపాలు చేపడుతోందన్నారు. ‘పశ్చిమ కనుమల్లో పర్యావరణానికి హాని కలిగించేలా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అందుకు గోవా మినహాయింపు కాదు. కచ్చితంగా కేరళ తరహా ముప్పు గోవాకు కూడా వస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ç గోవాలో రూ.35 వేల కోట్ల అక్రమ మైనింగ్ జరిగినట్లు జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలోని కమిటీ వెల్లడించిందని గుర్తు చేశారు. కొద్దిపాటి పెట్టుబడితో లాభాలు చేకూరడంతో కొండలను తొలచివేస్తున్నారని పేర్కొన్నారు. -
‘ఇలాగైతే గోవాకూ వరద ముప్పు’
పనాజీ : పర్యావరణ పరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కేరళ తరహాలో గోవా సైతం ప్రకృతి ప్రకోపానికి గురవుతుందని ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చరించారు. కొన్నేళ్ల కిందట పశ్చిమ కనుమలపై గాడ్గిల్ నేతృత్వంలో చేపట్టిన సర్వే సారాంశంపై విస్తృతంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ‘పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న ప్రాంతాలపై సమస్యలు ఉత్పన్నమవుతాయి..కేరళలో ఉన్న మాదిరి అత్యంత ఎగువన పశ్చిమ కనుమలు గోవాలో లేకున్నా గోవాలోనూ ఈ తరహా సమస్యలు ఎదురవుతాయ’ని కేరళను అతలాకుతలం చేసిన వరదలను ఉటంకిస్తూ గాడ్గిల్ పేర్కొన్నారు. లాభాలపై ఉన్న తాపత్రయంతోనే స్వార్థం కారణంగా పర్యావరణాన్ని కాపాడే చర్యలు చేపట్టకపోవడమే ఈ అనర్ధాలకు కారణమని వ్యాఖ్యానించారు. గోవాలో అక్రమ మైనింగ్‌తో రూ 35,000 కోట్లు అక్రమంగా ఆర్జించారని కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎంబీ షా కమిషన్ వెల్లడించిందని గాడ్గిల్ గుర్తుచేశారు. పర్యావరణ నిబంధనల అమలును ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సక్రమంగా పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వం దాని వెన్నువిరుస్తోందన్నారు. మైనింగ్ కంపెనీలు పర్యావరణ ప్రభావ అంచనాపై నివేదికల్లో తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాయని తప్పుపట్టారు. -
హెచ్చరికలను పట్టించుకోలేదు!
* వరదల విషయంలో జమ్మూ కాశ్మీర్ తీరుపై నిపుణుల విమర్శ * పట్టణీకరణ, అడవుల నరికివేత వల్లే ఎక్కువ నష్టాలు శ్రీనగర్: గతేడాది ఉత్తరాఖండ్‌ను ముంచెత్తి 5 వేల మందిని బలితీసుకున్న మెరుపు వరదలైనా.. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌ను కల్లోలం చేస్తున్న వరదలైనా... రెండింటికీ ప్రధాన కారణం ఒకటేనంటున్నారు పర్యావరణ వేత్తలు. పట్టణీకరణ పెరిగిపోవడం, రక్షణ కవచలంలా ఉండే అడవులు తగ్గిపోవడంతోపాటు అనూహ్యమైన రుతుపవనాలు.. ఈ విలయానికి కారణమయ్యాయంటున్నారు. పొంచి ఉన్న ముప్పుపై వాతావరణ నిపుణుల హెచ్చరికలను అధికారులు పెడచెవిన పెట్టడంతో.. నష్ట తీవ్రత పెరిగిందని అంటున్నారు. ముందే హెచ్చరించాం: జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తాము సెప్టెంబర్ 2 నుంచి ప్రతిరోజూ అధికారులకు హెచ్చరికలు జారీచేశామని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని కుటుంబాలే సురక్షిత ప్రాంతాలకు పోయి తలదాచుకున్నాయని, లోతట్టు ప్రాంతాల్లో ఉండిపోయిన వారిని తరలించ టంలో రాష్ట్రం నిర్లక్ష్యం వహించిందని విమర్శించింది. నదీ తీరాల్లో భారీ నిర్మాణాలు.. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, గతేడాది ఉత్తరాఖండ్‌లలో పరిస్థితులను పోల్చి చూస్తే.. రెండింటికీ చాలా సామీప్యతలు ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రెండుచోట్లా.. ప్రధాన కారణం పశ్చిమ గాలులు, రుతుపవనాలు కలిసి కురిసిన ఎడతెగని వానలేనన్నారు. భారీ స్థాయిలో అడవులను నరికేయడం, నదీ తీరాల్లో నిర్మాణాలు చేపట్టడం వల్ల ఉత్తరాఖండ్‌లో నష్టాల తీవ్రత ఎక్కువయింది. జమ్మూ కాశ్మీర్‌లోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోందని ఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మ్మెంట్’ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ చంద్ర భూషణ్ అన్నారు. 122 రెట్లు ఎక్కువ వర్షపాతం భారత్‌లో రుతుపవనాలను అంచనావేయడం ఎప్పుడూ సవాలే. అయితే ఇటీవల వర్షాలు తరచూ కురుస్తూ తీవ్ర నష్టానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. శ్రీనగర్‌లో.. పెప్టెంబర్ 5న సాధారణ వర్షపాతం 0.4 మిల్లీమీటర్లు కురవగా ఈ ఏడాది 49 మిల్లీ మీటర్లు కురిసింది. అంటే 122 రెట్లు ఎక్కువ. ‘‘అనూహ్యంగా వర్షాలు కురిసే పరిస్థితికి ముందే సిద్ధమై ఉండాలి.’’ అని భూషణ్ అన్నారు. ఒడిశా స్థాయిలో జాగ్రత్తపడాలి: వాతావరణ హెచ్చరికలను పెడచెవిన పెట్టకుండా సమయానికి స్పందించడం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చు. గతేడాది ఫైలిన్ తుపాను సమయంలో ఒడిశా ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేయడం వల్లే ప్రాణ, ఆస్తి నష్టం స్వల్పంగా ఉందని భూషణ్ గుర్తుచేశారు. -
ప్ర‘జల’పై నిర్లక్ష్యం
నీటిబొట్టు ఇంకేదెట్టా? 16 వేల ఇంకుడు గుంతల లక్ష్యం కాగితాల్లోనే.. 3 వేలు కూడా పూర్తి కాని వైనం వృథా కానున్న వర్షపు నీరు పట్టనట్టు వ్యవహరిస్తున్న జలమండలి, జీహెచ్ఎంసీ సాక్షి, సిటీబ్యూరో : నీటి బొట్టును ఒడిసిపట్టాలన్న ‘గ్రేటర్’ లక్ష్యం నిర్లక్ష్యం మాటున నీరుగారిపోతోంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే 1500 అడుగుల లోతుకు తవ్వినా నీటిచుక్క కానరావడం లేదు. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటుతున్నా వర్షపు నీటిని కాపాడాలన్న శ్రద్ధ ఇటు జలమండలి, అటు జీహెచ్ఎంసీలో కానరావడం లేదు. రుతుపవనాలు మరో పక్షం రోజుల్లో గ్రేటర్‌ను పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షపు నీటిని కాపాడుకొని, భూగర్భ జలసిరిని పెంచేందుకు చర్యలు తీసుకోవడంలో జలమండలి, జీహెచ్ఎంసీలు దారుణంగా విఫలమౌతున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ నిలువెల్లా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఇంకుడు గుంతలు (రీచార్జింగ్ పిట్స్)ను మహోద్యమంగా చేపట్టకపోతే గ్రేటర్‌కు జలగండం తప్పదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఈ రెండు విభాగాలకు పట్టడం లేదు. గతేడాది రూ.6 కోట్ల అంచనా వ్యయంతో గ్రేటర్ పరిధిలో సుమారు 10 వేలు ఇంకుడు గుంతలు తవ్వాలన్న బల్దియా లక్ష్యం కాగితాలకే పరిమితమవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీరు ఇంకే దారులేవీ..? జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాల సంఖ్య 12 లక్షలు. కానీ వర్షపునీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అందుబాటులో ఉన్న రీచార్జింగ్ పిట్స్ (ఇంకుడు గుంతలు) ఎనిమిది వేలు మాత్రమే. ఇది భూగర్భ జలశాఖ ప్రకటించిన చేదు వాస్తవం. కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్ సిటీలో విలువైన వర్షపు నీటిని ఒడిసిపట్టే దారి లేకపోవడంతో పాతాళగంగ కనుమరుగవుతోంది. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ, జలమండలిలు వినియోగదారుల నుంచి ఇప్పటివరకు సుమారు రూ.64 కోట్లు వసూలు చేశాయి. ఆ నిధులతోఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకపోవడంతో భూగర్భ జలాలు అథఃపాతాళానికి మళ్లుతున్నాయి. మహానగరంలో ప్రతి ఇల్లు, కార్యాలయానికీ రీచార్జింగ్ పిట్స్ అత్యవసరం. ఈ పరిస్థితి లేకనే మారేడ్‌పల్లి, బోయిన్పల్లి, బోడుప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో 1500 అడుగుల లోతు వరకు బోరుబావులు తవ్వినా నీటిచుక్క జాడ కనిపించడం లేదు. విచక్షణా రహితంగా బోరుబావులు తవ్వడాన్ని నిషేధిస్తూ తొమ్మిదేళ్ల క్రితం చేసిన వాల్టా చట్టానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఇంటి అవసరాల కోసం వ్యయప్రయాసల కోర్చి బోరుబావులు తవ్వుతున్న వినియోగదారులు నీటిబొట్టు కానరాక బావురుమంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రీచార్జింగ్ పిట్స్ తవ్వే ప్రక్రియను మహోద్యమంగా చేపట్టాల్సిన సంబంధిత విభాగాలు నిద్రమత్తు వీడకపోవడంతో ప్రస్తుతం వర్షపునీరు వృథా అయ్యే పరిస్థితి తలెత్తింది. జనానికి అవగాహన కల్పించడంలో విఫలం భూగర్భ జల మట్టాలను పెంపొందించేందుకు రీచార్జింగ్ పిట్స్ తవ్వాల్సిన అంశంపై వినియోగదారులకు అవగాహన కల్పించడంలో జలమండలి, జీహెచ్ఎంసీలు దారుణంగా విఫలమౌతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల సమయం లో రీచార్జింగ్ పిట్స్ తవ్వేందుకు జీహెచ్ఎంసీ నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి రూ.8 నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తుంది. ఈ విషయంలో జలమండలి కూడా తక్కువేం తినలేదు. నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసినపుడు వినియోగదారుల నుంచి విస్తీర్ణాన్ని బట్టి రూ.8 నుంచి రూ.25 వేల వరకు ముక్కుపిండి రాబడుతున్నారు. ఒక వేళ వినియోగదారుడు సొంతంగా పిట్ ఏర్పాటు చేసుకున్నారని క్షేత్రపరిశీలన సమయంలో తేలితే ఈ మొత్తాన్ని మినహాయిస్తున్నారు. అందుబాటులో ఎనిమిది వేలే... గ్రేటర్ పరిధిలో వర్షపు నీటి నిల్వకు కేవలం ఎనిమిది వేల ఇంకుడు గుంతలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు భూగర్భజలశాఖ గతంలో ప్రకటించింది. వీటిలోనూ పలు పిట్స్‌పై మట్టి, పెద్ద బండరాళ్లు, సిమెంట్, చెత్తాచెదారం పడడంతో వర్షపునీటిని భూగర్భంలోకి చేర్చే పరిస్థితి లేదని తేలింది. వీటిని పునరుద్ధరించే విషయంలో వినియోగదారులను చైతన్యం చేసే విషయంలోనూ జీహెచ్ఎంసీ, జలమండలిలు విఫలమౌతున్నాయని స్పష్టమైంది. గతేడాది రూ.6 కోట్ల వ్యయంతో పదివేల ఇంకుడు గుంతలు తవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కానీ వీటిలో పూర్తయినవి వెయ్యి దాటకపోవడం గమనార్హం. ఇక జలమండలి మరో ఆరువేల రీచార్జింగ్ పిట్స్ ఏర్పాటుచేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటివరకు రెండు వేలకు మించి ఇంకుడు గుంతలు తవ్వకపోవడం ఆయా విభాగాల నిర్లక్ష్యానికి పరాకాష్ట. రీచార్జింగ్ పిట్ ఇలా ఉండాలి మధ్యతరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీస్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో పిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడెల్పులు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున (డెప్త్) గుంత తీసి ఇందులో 50 శాతం మేర 40 ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం మేర 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం దొడ్డు ఇసుకను నింపాలి. మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ పిట్‌పై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీచార్జింగ్ సులువవుతుంది. దీనివల్ల బోరుబావి పది కాలాలపాటు ఎండిపోకుండా ఉంటుంది. ప్రతి ఇల్లు, కార్యాలయంలో విస్తీర్ణాన్ని బట్టి పిట్ సైజు పెరుగుతుంది.