సాక్షి, అమరావతి: వాతావరణ సమతుల్యతను కాపాడటం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో తూర్పు కనుమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నైరుతి, ఈశాన్య రుతు పవనాల గమనంలోనూ వీటి పాత్ర ఎంతో కీలకం. మన రాష్ట్రానికి జీవనాడులుగా ఉన్న కృష్ణా, గోదావరి సహా అనేక నదుల్లో నీరు చేరడానికి ఈ పర్వత శ్రేణులు ఎంతగానో దోహడపడుతున్నాయి. ఆ నదులు పుట్టింది పశ్చిమ కనుమల్లో అయినా.. వాటిలో ప్రవహించే నీరు చాలావరకూ తూర్పు కనుమల్లో పుట్టిన ఉప నదుల నుంచే వస్తోంది. మన రాష్ట్రంలో వంశధార, నాగావళి, చంపావతి, గోస్తనీ, శబరి, సీలేరు, తమ్మిలేరు, గుండ్లకమ్మ, స్వర్ణముఖి, కుందు వంటి అనేక ఉప నదులు ఈ కనుమల్లోనే పుట్టి ప్రధాన నదుల్లో కలుస్తున్నాయి. ఆ నదుల్లోని నీటినే మనం తాగడానికి, ఆహార ధాన్యాలు పండించడానికి వినియోగించుకుంటున్నాం.
వేగంగా తరిగిపోతున్న అడవులు
తూర్పు కనుమల్లోని అడవులు వేగంగా తరిగిపోతున్నట్టు అశోక్ ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకోలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ (ఏటీఆర్‌ఈఈ) ఇటీవల జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఏటా సగటున 28 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఇతర అవసరాలకు మళ్లుతున్నట్టు తేలింది. పోడు వ్యవసాయం, వాణిజ్య తోటల పెంపకం, చెట్లను నరకడం, మైనింగ్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పాపికొండలు, నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ వంటి రక్షిత ప్రాంతాలు మంచి అడవులతో వివిధ జంతు జాలాలకు నిలయంగా ఉన్నా పాడేరు, అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాలు ఇప్పటికే అడవులను కోల్పోయినట్టు తేలింది. వీటి స్థానంలో ఎక్కువ భాగం కాఫీ తోటలు వెలిశాయి. తూర్పు కనుమలు దెబ్బతింటే ఆ ప్రభావం ఈ నదులపై పడుతుంది. అప్పుడు ఈ నదుల నీటిపై ఆధారపడిన మనపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటి తూర్పు కనుమల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అత్యావశ్యకమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
అరుదైన జంతుజాలం..
తూర్పు కనుమలు హిమాలయాల కంటే పురాతన పర్వత శ్రేణులు. ఇవి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని భాగాలను తాకుతాయి. 40 శాతం భాగం మన రాష్ట్రంలో ఉంటే ఒడిశా, తమిళనాడులో 25 శాతం చొప్పున, కర్ణాటక, తెలంగాణలో 5 శాతం చొప్పున వీటి విస్తీర్ణం ఉంది. మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి. ఈ పర్వతాల మధ్య కృష్ణా, గోదావరి, పెన్నా వంటి నదులు ప్రవహిస్తుండటం వల్ల అవి విడిపోయి ఉంటాయి. మన రాష్ట్రంలో భాగంగా ఉన్న తూర్పు కనుమల్లోని అడవులు ప్రత్యేకమైన జీవ వైవిధ్యానికి నిలయంగా భాసిల్లుతున్నాయి. గోల్డెన్ గెకో (బంగారు బల్లి), జెర్డాన్ కోర్సర్ (కలివి కోడి), జైపూర్ గ్రౌండ్ గెకో (జైపూర్ నేలబల్లి) వంటి అరుదైన జంతుజాలం ఇక్కడ ఉంది. పశ్చిమ కనుమలపై జరిగినన్ని పరిశోధనలు, అధ్యయనాలు తూర్పు కనుమలపై జరగకపోవడం వల్ల వీటి ప్రాముఖ్యత పెద్దగా వెలుగులోకి రాలేదు. గత 20 ఏళ్లుగా సహజ శాస్త్రాలు నిరాదరణకు గురైనట్టు పర్యావరణ
వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తూర్పు కనుమలతోనే మన భవిష్యత్
తూర్పు కనుమల భవిష్యత్తుతోనే మన భవిష్యత్ ముడిపడి ఉంది. రాజీ లేకుండా అడవులను పరిరక్షించాలి. 18 నెలలుగా ఐఐఎస్‌ఈఆర్ సిటిజెన్ సైన్స్ నిర్వహించిన కార్యక్రమంలో అనేక పక్షులు, సీతాకోక చిలుకలు, ఇతర జంతు జాలాన్ని కొత్తగా రికార్డు చేశాం. పశ్చిమ కనుమలు, హిమాలయాల మాదిరిగానే తూర్పు కనుముల ప్రాంతం జీవ వైవిధ్యానికి హాట్‌స్పాట్‌గా ఉంది.
– రాజశేఖర్ బండి, ఐఐఎస్‌ఈఆర్ సిటిజన్ సైంటిస్ట్
Comments
Please login to add a commentAdd a comment