world soil day
-
నేలలపై శ్రద్ధ పెట్టాలి!
2024 అంతర్జాతీయ భూముల దినోత్సవం (డిసెంబర్ 5) సందర్భంగా ‘మట్టి గణాంకాల సేకరణ, పర్యవేక్షణ, నిర్వహణ’పై దృష్టిని కేంద్రీకరించాలని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది.‘మన కాళ్ల కింద ఉన్న నేల ఒక జీవవ్యవస్థ. అనేక జాతుల మనోహరమైన మొక్కలు, జంతుజాలానికి నిలయం. మనకు పోషకాహారంతో పాటు స్వచ్ఛమైన నీరు, జీవవైవిధ్యాన్ని అందిస్తున్న నేలలపై శ్రద్ధ పెట్టి పరిరక్షించుకోవటానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాల’ని ప్రముఖ నేలల నిపుణుడు డాక్టర్ వి. రామ్మూర్తి సూచించారు. బెంగళూరులోని నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్ (ఐసిఎఆర్ అనుబంధం)ప్రాంతీయ కార్యాలయం అధిపతిగా ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయం)గా ఆయన వ్యవహరిస్తున్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో నేలల బాగోగులపై అధ్యయనం చేసి, విధాన నిర్ణేతలకు తగు సూచనలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని అనేక మండలాల్లో నేలల స్థితిగతులపై తమ సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైన విషయాలను ఆయన ‘సాక్షి సాగుబడి’కి వెల్లడించారు. 2 రాష్ట్రాల్లో నేలలపై అధ్యయనంతెలంగాణలోని గజ్వేల్, ఇంద్రవెల్లి, మహబూబ్‌నగర్ రూరల్ మండలాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా రాయచోటి, తొండూరు మండలాల్లో, అనంతపురం జిల్లా కదిరి, ఓబుల దేవర చెరువు(ఓడిసి) మండలాల్లోని నేలల స్థితిగతులపై నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్ తరఫున అధ్యయనం చేశామని డా. రామ్మూర్తి తెలిపారు. భూమి స్థితిగతులను తెలుసుకోవడానికి అది ఏ రకం భూమి? మట్టి ఎంత లోతుంది? వంటి వివరాలతో పాటు భూసారాన్ని అంచనా వేయటానికి సేంద్రియ కర్బనం ఆయా నేలల్లో ఎంత శాతం ఉందో మట్టి పరీక్షల ద్వారా నిర్థారణ చేస్తారు. సేంద్రియ కర్బనాన్ని మూడు స్థాయిల్లో (తక్కువ – 0.50% లోపు, మధ్యస్థం – 0.50–0.75% మధ్య, అధికం – 0.75% కన్నా ఎక్కువ) లెక్కిస్తారు. సేంద్రియ కర్బనం తెలంగాణ నేలలతో పోల్చితే రాయలసీమ నేలల్లో తక్కువగా ఉందని డా. రామ్మూర్తి అన్నారు. ఈ తేడాలకు కారణం ప్రకృతి వైపరీత్యాలు, వర్షపాతం, సాగు పద్ధతి కారణాలని తెలిపారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని పరీక్షలు నిర్వహించిన సాగు భూముల్లో 100% నేలల్లో సేంద్రియ కర్బన శాతం అధికంగా (అంటే.. 0.75% కన్నా ఎక్కువగా) ఉండటం విశేషం. అనంతపురం జిల్లా ఇనగలూరు పంచాయతీలోని 46.29% సాగు భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువగా, 35.26% భూముల్లో మధ్యస్థంగా, 18.45% భూముల్లో అధికంగా ఉందని వెల్లడైందన్నారు (పూర్తి వివరాలు పట్టికలో). వరి, పత్తి, మిర్చికి రసాయనాల వాడకం ఎక్కువవరి, పత్తి, మిర్చి పంటలకు రసాయనిక ఎరువులు మరీ ఎక్కువగా వేస్తున్నారు. ఎంత అవసరమో గమనించకుండా పక్క రైతును చూసి వేస్తున్నారు. పురుగుమందుల పిచికారీ కూడా అంతే. పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులను చాలా మంది రైతులు వాడటం లేదు. అదే పంటను ప్రతి ఏటా సాగు చేస్తున్నారు. అందుకే సేంద్రియ కర్బనం అడుగంటుతోందని డా. రామ్మూర్తి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రైతులు ఇప్పటికైనా జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని అన్ని సాగు భూముల్లోనూ 0.7 శాతానికి పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారాయన.΄పొటెన్షియల్ క్రాప్ జోన్లు ఆయా భూముల స్వభావం, భూసార పరిస్థితులు, ఆప్రాంత వాతావరణం, వర్షపాతం, అక్కడి ప్రజల ఆసక్తి, మార్కెట్ స్థితిగతులపై 20 ఏళ్ల క్రితం నాటి నుంచి సమాచారం సేకరించి విశ్లేషించామని డా. రామ్మూర్తి చెప్పారు. ఈ సమాచారంతో శాస్త్రీయంగా ΄పొటెన్షియల్ క్రాప్ జోన్స్ నివేదికలు ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పత్తి, వరి, జొన్న, వేరుశనగ పంటలకు ఏయే జిల్లాలో ఎన్ని హెక్టార్ల భూమిలో ‘చాలా బాగా, ఒక మాదిరిగా, కొంతమేరకు’ ఆయా పంటల సాగుకు అనువుగా ఉన్నాయో చెప్పామన్నారు.అన్ని మండలాల్లో మట్టిని అధ్యయనం చేయాలిభూమిపై మన జీవితం ఆరోగ్యకరమైన నేలలపై ఆధారపడి ఉంటుంది. మన పాదాల కింద ఉన్న నేల ఒక జీవవ్యవస్థ. అనేక మనోహరమైన మొక్కలు, చెట్లు, జంతువులకు నిలయం. మట్టి మనకు పోషకాహారాన్ని, స్వచ్ఛమైన నీటిని, జీవవైవిధ్యాన్ని అందిస్తుంది. ప్రతి జిల్లాలో అన్ని మండలాల్లోని ΄పొలాల్లో మట్టి పరీక్షలు చేసి, అధ్యయనం చేయాలి. మన మట్టిలో వుండే పోషకాలు ఏమిటి? మట్టిలోని జీవరాశి ఏమేమి ఉన్నాయి? ఏమేమి లేవు? కాలక్రమంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? సాగు భూములు బాగుండాలంటే వాటిని ఎలా నిర్వహించుకోవాలి? అనే విషయాలపై పాలకులు శ్రద్ధ చూపాలి.ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ్రపోత్సాహమిస్తే మట్టి ఎలా ఉందో పరీక్షించి ఎక్కువగా ఎరువులు వేయకుండా నివారించటంతో పాటు పంటల మార్పిడి,‡మట్టిని పంటలతో కప్పి ఉంచటం వంటి భూసంరక్షణ పద్ధతులపై రైతులకు చైతన్యం కలిగిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సుసంపన్న సాంస్కృతిక జీవనానికి, ఆరోగ్యకరమైన జీవనానికి కూడా మట్టి మూలాధారం. మట్టి ద్వారానే 95% ఆహారం మనకు వస్తోంది. ఇందులో 18 సూక్ష్మ,స్థూల పోషకాంశాలు ఉంటాయి. వీటిలో 15 పోషకాంశాలను నేల నుంచి మిగతా మూడిటిని వాతావరణం నుంచి మనం ΄పొందుతున్నాం. ఈ స్పృహతో సాగు నేలల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. – డాక్టర్ వి. రామ్మూర్తి (94803 15146), అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయం),్ర పాంతీయ కార్యాలయం, ఐసిఎఆర్– నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్, బెంగళూరుఅవును..! మీరు చదివింది, ఈ ఫొటోలో చూస్తోంది.. నిజమే! మన పుచ్చ తోటల్లో పాదులు నేలపై పరచుకొని ఉంటాయి. పుచ్చ కాయలు నేలపైనే పెరుగుతాయి కదా. సౌతాఫ్రికాలో ఒక కంపెనీ పాలీహౌస్‌లలో పుచ్చ పాదులు నిలువుగా ఎగబాగుకుతున్నాయి. పుచ్చ కాయలు వాటికి వేలాడుతున్నాయి. ట్రెల్లిస్ పద్ధతిలో పెరిగే టొమాటోల మాదిరిగా ఈ పుచ్చకాయలు వేలాడుతున్నాయి కదూ.. కాండీ బాల్ సీడ్లెస్ పుచ్చకాయలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరుగుతాయి. అదేమాదిరిగా కిలో బరువు పెరిగే స్మైల్ మెలన్స్ (ఇదో రకం కర్బూజ) పండ్లను కూడా నిలువు తోటల్లో పెంచుతున్నారు. టొమాటోలు వంటి కాయలు బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి తీగజాతి మొక్కలు మొయ్యగలుగుతాయి.అయితే, ఇలాంటి నిలువు తోటలో పుచ్చకాయలు, కర్బూజ కాయల బరువు మొక్కలకు భారం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ నెట్ కవర్లతో కాయలను ప్లాస్టిక్ వైర్లకు కట్టేస్తున్నారు. ‘నిలువు తోటలో పెరిగిన పుచ్చకాయలను మేం త్వరలోనే అమ్మకానికి పెట్టబోతున్నాం. సౌతాఫ్రికా మార్కెట్లో మేమే ఫస్ట్’ అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధి ఫ్రాంకోయిస్ ఫౌరీ. పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లలో, మేడపై ఇంటిపంటల్లో ట్రెల్లిస్ పుచ్చ, కర్బూజ సాగు సాధ్యమే అని గ్రహించాలి!12 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళాగో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకుప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహారప్రాసెసింగ్పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522. -
పిల్లలూ... మట్టి విలువ తెలుసుకోండి
మట్టితో ఆడుకునే పిల్లలు ఇప్పుడు లేరు. మట్టిలో ఆడుకునే పిల్లలు ఇప్పుడు లేరు. కాళ్లకు మట్టి అంటితే బురద అంటితే ఇసుక అంటితే సిమెంటు తొట్టిలోని నీటిని వొంపుకుంటూ పాదాల మీదుగా పారే మట్టి రంగు నీళ్లను చూసే పిల్లలు ఇప్పుడు లేరు. కుండీల్లోని మట్టిని తాకరు. పంట పైరుల్లోని మట్టిని తాకరు. అడవిలోని మట్టిని తాకరు. మన తాతలు తిరుగాడిన మట్టినేలలను తాకరు. వారు చదువులను చదువుతూ క్లాస్రూమ్ స్క్రీన్ మీద మట్టిని చూస్తారు. ఇలాంటి పిల్లలకు మట్టి విలువ ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులే. నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం. మట్టికో నమస్కారం పెట్టుకోవాల్సిన రోజు. పిల్లలు తల్లిని అడిగారట. ‘అమ్మా.. మనిషి దేవుడి కంటే గొప్పవాడా?’ అప్పుడు తల్లి ఈ జోక్ చెప్పింది. ఒక సైంటిస్ట్ దేవుడితో ‘దేవుడా... మనిషి నీతో సమానంగా సృష్టించగలడు. చెప్పు.. ఏది సృష్టించి చూపమంటావు?’ అన్నాడు. దానికి దేవుడు ‘సరే... మనిషిని సృష్టించు’ అన్నాడు. అప్పుడు సైంటిస్ట్ ‘అలాగే’ అని కొంచెం మట్టి తీసుకోతుంటే దేవుడు వారించి అన్నాడు– ‘ఒక్క నిమిషం. ఆ మట్టి కూడా నువ్వు సృష్టించిందే అయి ఉండాలి నాయనా’. మనిషిని సృష్టించగలనని విర్రవీగిన సైంటిస్ట్ చిటికెడు మట్టిని సృష్టించలేక తెల్లముఖం వేశాడు. ఆ జోక్ చెప్పి తల్లి ‘ప్రకృతి నుంచి మనిషి దేనినైనా సృష్టించగలడు. కాని ప్రకృతిని సృష్టించలేడు. ప్రకృతిని విస్తరించాలి. ఉన్నది కాపాడుకోవాలి. మట్టితో సహా’ అని వివరించింది. పిల్లలు తల్లిని అడిగారట ‘అమ్మా మనిషి అన్నింటికీ విరుగుడు కనిపెట్టగలడు కదా’. దానికి తల్లి జవాబు– నిజమే. మనిషి టెస్ట్‌ట్యూబ్ బేబీలను, క్లోనింగ్ జీవులను సృష్టించేంతగా ఎదిగాడు. కాని మట్టిని సృష్టించగలడా? నేలను సృష్టించగలడా? భూపొరలను, ఆ పొరలలో దాగిన ఖనిజ లవణాలని, నీటిని, జీవజాలాన్ని సృష్టించగలడా? కోవిడ్ వంటి మహమ్మారి వ్యాపిస్తోందని వాక్సిన్ కోసం పరుగులు తీస్తున్న మనిషి నేల చనిపోతుంటే తన జీవాన్ని కోల్పోతూ ఉంటే ఆ ఉత్పాతానికి విరుగుడు కనిపెట్టడానికి ఎందుకు తొందరపడటం లేదు? పిల్లలు తల్లిని అడిగారట– ’అమ్మా... మట్టి లేకపోతే ఏమవుతుంది?’ దానికి తల్లి జవాబు – ఈ భూమి మీద కనీసం 40 శాతం అడవులు ఉండాలి. కాని ఒక అంచనా ప్రకారం 13 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే మరో 30 ఏళ్లు ఆగితే వాన భూమి మీద కాకుండా సముద్రం మీద మాత్రమే కురుçస్తుంటుంది. మట్టి నీటిని తీసుకోవాలి. తిరిగి నింగికి నీటిని ఇవ్వాలి. ఈ చక్రానికి ఒక మహా విఘాతం కలగబోతోంది. వానల్ని లాగి ఆకర్షించే అడవి నేల మీద లేకపోతే మేఘం ఎందుకు వస్తుంది? మట్టి ఉంటే చెట్టు ఉంటుంది. చెట్టు ఉంటే వాన దాంతో పాటు మనిషి మనుగడ ఉంటుంది. పిల్లలు తల్లిని అడిగారట ‘మట్టి ఎలా నాశనం అవుతుంది?’ దానికి తల్లి జవాబు– మట్టి నుంచి సహజంగా వచ్చేది ఏదైనా మట్టిలో కలిసిపోతుంది. కాని మట్టికి అమోదం లేని పద్ధతిలో మనిషి తయారు చేసే కఠినమైన పదార్థాలను మట్టి తీసుకోదు. నిరాకరిస్తుంది. ప్లాస్టిక్, కెమికల్స్, పారిశ్రామిక వ్యర్థాలు, ఔషధ పరిశ్రమల విసర్జనాలు... వీటిని మట్టికి మనిషి తినిపిస్తున్నాడు. ఈ విషాహారం తినే కొద్దీ మట్టి మెల్లమెల్లగా చచ్చిపోతోంది. గత 25 ఏళ్లలో భారతదేశం సజీవ మృత్తికను అంటే మొలకెత్తే మట్టిని దాదాపు 38 శాతం కోల్పోయిందని ఒక అధ్యయనం చెబుతోంది. అంటే అది పంటకు పనికి రాదు. అది మృతభూమి. పిల్లలు తల్లిని అడిగారట ‘మట్టి ఎవరికి ముఖ్యం? దానికి తల్లి జవాబు– మట్టి మనందరికీ ముఖ్యం. కాని రైతుకు ఇంకా ముఖ్యం. ఎందుకంటే మట్టిలో కష్టించి పంటను పండిస్తాడు. మన ఆకలిని తీరుస్తాడు. సిటీలో ఉన్నవాడు మట్టి మీద కట్టిన ఒక ఫ్లాట్, కార్ పార్కింగ్‌కు స్థలం దొరికితే చాలనుకుంటాడు. రైతు మాత్రం పంట పండే చేనుముక్కను కోరుకుంటాడు. ‘నేల తల్లి నీకు వందనం... మడిచేల తల్లి నీకు వందనం అని పాడుకునేది రైతు ఒక్కడే’. ఎంతటి మహాచక్రవర్తి అయినా మట్టి లేకపోతే మృతసమానుడు అవుతాడు. ఆ కిటుకు తెలుసు కనుకనే బలి చక్రవర్తిని వామనుడు మట్టిని వరంగా కోరి పరిహరిస్తాడు. మట్టి మనిషి బలం. జీవధాతువు. ∙∙ పిల్లలు తల్లిని అడిగారట– ‘అమ్మా... మేము ఏం చేయాలి?’ దానికి తల్లి జవాబు– ‘ఇవాళ మీరే ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకు వస్తున్నారు. బాల పర్యావరణ వేత్తలే ప్రపంచ వ్యాప్తంగా మట్టికి జరుగుతున్న ద్రోహాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. మీ క్లాస్‌లో స్కూల్లో ఈ చైతన్యం మరింత నింపాల్సిన అవసరం ఉంది. మట్టిని కలుషితం చేసే వ్యవసాయ విధానాలు, పారిశ్రామిక విధానాలు, వాణిజ్య పంటల విధానాలు, జల నిర్వహణ విధానాలు, అటవీ విధానాలు ప్రభుత్వాలు మానుకోవాలని మీరు డిమాండ్ చేయాలి. మట్టిని కాపాడుకుంటాం అని ప్రతిజ్ఞ చేయాలి. -
అపార్ట్‌మెంట్‌పైనే ‘అమృత్’ పంటలు!
ఈ నెల 5న ప్రపంచ భూముల దినోత్సవం సందర్భంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు పండించుకుంటూనే భూసారాన్ని పెంపొందించుకుంటున్న అన్నదాతలతోపాటు.. మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న డాక్టర్ మేధా శ్రీంగార్‌పురే అనే సిటీ ఫార్మర్కు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం.. ఎందుకంటే.. పంట భూములకు దూరంగా కాంక్రీటు అరణ్యంలో నివాసం ఉంటున్న ఆమె తమ వంటింటి వ్యర్థాలను, చెరకు పిప్పిని ఉపయోగించి తమ అపార్ట్మెంటు మేడ పైనే ఆమె ‘అమృత్ మిట్టి’ని తయారు చేస్తున్నారు. అత్యంత సారవంతమైన అమృత్ మిట్టితో అద్భుత పోషక విలువలున్న సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను అనేక ఏళ్లుగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా, మహానగర జీవులకు ఆదర్శప్రాయంగా జీవిస్తున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌పై చెత్త భారాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతున్నారు. అంతేకాదు, ఆవు పేడ – మూత్రంలతో ద్రవ రూప ఎరువు ‘అమృత్ జల్’ను తయారు చేసుకొని వాడుతూ అమృతాహారాన్ని పండించుకుంటున్నారు. కూరగాయలు.. పండ్లు.. ముంబై నగరంలోని మాజ్గవ్ టెర్రస్ అనే సొసైటీలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో దంత వైద్యురాలు మేధా శ్రీంగార్‌పురే రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆమె తమ అపార్ట్మెంట్ భవనం టెర్రస్‌పైనే సిటీ ఫార్మింగ్ చేస్తున్నారు. తన ఇంట్లోని కిటికీలతోపాటు ముఖ్యంగా టెర్రస్‌ను 150 నుంచి 200 రకాల మొక్కలతో నందనవనంగా మార్చారు. ప్రస్తుతం పండ్లలో జామపండ్లు, సీతఫలం, చెర్రీ పండ్లు, బత్తాయి పండ్లు ఇలా అనేక రకాల పండ్ల చెట్లతోపాటు ఆకు కూరలు, సీజనల్ కూరగాయలు, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, మునగకాయలు, పలు రకాల మిరపకాయలు, పుష్పాలు ఇలా అనేక రకాలు ఆమె ఇంటిపంటల్లో కనిపిస్తున్నాయి. ఇతర భవనాల టెర్రస్లపైనా... మాజ్‌గావ్ టెర్రస్ సొసైటీలో అన్ని భవనాలూ నాలుగు అంతస్తులవే ఉన్నాయి. డా. మేధా ఉండే భవనం టెర్రస్‌పై ఇంటిపంటల సాగులో మంచి ఫలితాలు కన్పించడంతో ఇతర భవనాల వారు కూడా వారి వారి టెర్రస్లపైనా మొక్కలు నాటేందుకు ఆసక్తిచూపారు. రసాయనాలు లేకుండా పండే కూరగాయలను తింటే ఎంతో రుచితోపాటు మాటల్లో చెప్పలేని ఆరోగ్యం, ఆనందం కలుగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం రెండు గంటలు.. శని, ఆదివారాలలో 4 గంటల సమయం కేటాయిస్తున్నా. ఇదంతా చేయడానికి శ్రద్ధ చాలా అవసరం అంటారు డా. మేధా. అపార్ట్మెంట్లో అందరి అనుమతితోనే.. వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన సహజ సేంద్రియ ఎరువు ‘అమృత మిట్టి’ మా ఇంట్లో చాలా పోగైంది. దీన్ని ఏమి చేయాలని ఆలోచించగా టెర్రస్‌పై కూరగాయ మొక్కలు పెంచవచ్చన్న ఆలోచన వచ్చింది. అంతే భవనంలోని అన్ని అంతస్తులలో నివసించే వారిని సంప్రదించి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకున్నా. సొసైటీ బాధ్యులతో చర్చలు జరిపి అన్ని అనుమతులు పొంది టెర్రస్‌పై అయిదేళ్ల కిందట సేంద్రియ పంటలు పెంచడం ప్రారంభించా. ఆ కొత్తలోనే అర్బన్ లీవ్స్ ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో పాల్గొని అనేక మెళకువలు తెలుసుకున్నా. అర్బన్ లీవ్స్‌కు వాలంటీర్‌గా సేవలందించడంతో అనుభవపూర్వకంగా చాలా విషయాలు తెలిసివచ్చాయి. దీంతో రెండేళ్లలోనే టెర్రస్‌పై పెంచిన మొక్కలు చక్కని దిగుబడినివ్వటం ప్రారంభమైంది. . – డా. మేధా శ్రీంగార్‌పురే (98695 48090), మాజ్‌గావ్ టెర్రస్ సొసైటీ, ముంబై ముంబైలో అర్బన్ లీవ్స్ సంస్థ టెర్రస్‌పై నెలకొల్పిన ఒక కమ్యూనిటీ గార్డెన్ – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
నేలమ్మా క్షమించు..
ఈ భూతలమ్మీద జీవానికే జేజమ్మ నేలతల్లి. మనందరం ఈ నేలమ్మ ముద్దు బిడ్డలమే. భూమి మీద ఉన్న జీవవైవిధ్యం కన్నా భూమి లోపల జీవవైవిధ్యం ఎక్కువ. అడవిలోని అత్యంత సారవంతమైన మట్టి జీవన ద్రవ్యంతో జీవజీవాలతో ఉంటుంది. అందుకే అడవి ఎంత ఎండల్లోనూ ఎండిపోకుండా సతత హరితంగా అలరారుతూ ఉంటుంది. అడవిలో చెట్ల కింద మట్టి అత్యంత సారవంతంగా, సజీవంగా ఉంటుంది. దీన్ని చెంచాడు తీసుకొని పరీక్షించి చూస్తే.. భూగోళంపైన మనుషులెందరు ఉన్నారో అన్ని సూక్ష్మజీవులు ఉంటాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) శాస్త్రవేత్తలు ప్రకటించారు. వ్యవసాయ నేలల్లోనూ సూక్ష్మజీవరాశిని పెంపొందించుకునే ప్రకృతి వ్యవసాయ పద్ధతులే భూసారాన్ని పెంపొందించగలవు, పరిరక్షించగలవు. నేలతల్లి చల్లగుంటేనే మనమూ చల్లగా ఉంటాం. నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం. మన నేలలు సకల పోషకాలతో సజీవంగా ఉంటేనే మనం పండించే ఆహారంలోనూ పోషకాల లోపం లేకుండా ఉంటుంది. నేలతల్లి అమూల్యమైన ప్రకృతి సేవలతో మనుషులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు సహా సకల జీవరాశికి ప్రాణం పోస్తుంది. అటువంటి నేలతల్లి అనేక రకాల కాలుష్యాల వల్ల, పారిశ్రామిక/రసాయనిక వ్యవసాయ పద్ధతుల వల్ల క్రమంగా నిర్జీవమవుతోంది, నిస్సారమవుతోంది. ఇప్పటికే మూడింట ఒక వంతు సాగు భూమి నిర్జీవంగా, సాగు యోగ్యం కాకుండా మారిపోయింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులతో కూడిన నష్టదాయక వ్యవసాయ పద్ధతుల వల్ల ఉత్పాదకశక్తిని, తేమను నిలుపుకునే శక్తిని కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి 20 లక్షల హెక్టార్ల భూమి ఎడారిగా మారిపోతోంది. సముద్రం తర్వాత అధికంగా కర్బనం నిల్వలు కలిగి ఉన్న భూమి జవజీవాలను సంరక్షించుకోవడం ద్వారా మాత్రమే భూతాపోన్నతిని అరికట్టగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. భూమిని కాలుష్యాల నుంచి రక్షించుకుందాం అని ఎఫ్.ఏ.ఓ. ఈ ఏడాది డిసెంబర్ 5న అంతర్జాతీయ భూముల దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చింది. ఇందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుంది. ఈ బృహత్ కృషిలో ప్రకృతి వ్యవసాయదారులే సైనికులు! అయినా.. సమయం మించి పోలేదు భూముల విధ్వంసాన్ని నిలువరించగలం భూమిని కాలుష్యం నుంచి పరిరక్షించడానికి భూసారాన్ని పెంపొందించే రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు చేపట్టడంతో పాటు.. అనేక ఇతర రంగాల్లోనూ ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతులు మార్చుకోవాలి. పారిశ్రామిక రంగం, గనుల తవ్వకం, వ్యర్థాల పునర్వినియోగం, రవాణా రంగాలలో కాలుష్యాన్ని తగ్గించే పర్యావరణ అనుకూల పద్ధతులు కూడా పాటిస్తూ స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని చేపడితే... భూములను కాలుష్యం బారి నుంచి పూర్తిగా కాపాడుకోగలుగుతాం. -
‘నేల’మ్మ బాగుకోసం
సందర్భం : నేడు ప్రపంచ నేలల దినోత్సవం ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల అతి ముఖ్యమైనది. సమస్త జీవరాశులు, మానవాళి మనుగడ ఈ నేలపైనే ఆధారపడివుంది. భూమి సారవంతంగా ఉన్నపుడే పంటలు బాగా పండుతాయి. తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారి అన్నదాతలు ఆర్థిక పురోగతి సాధిస్తారు. రైతు బాగున్నాడంటే మిగిలిన అన్ని వర్గాలు అన్ని రంగాలు ప్రగతి పథంలో పయనిస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. అయితే అవగాహన లోపంతో నేల, నీటి సంరక్షణ చర్యలు పాటించడం అంతంతా మాత్రంగానే ఉంది. నేల స్వభావాన్ని పరిరక్షించుకునే దిశగా 2013 నుంచి ఏటా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా నేలల దినోత్సవాన్ని నిర్వహించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో నేల, నీటి సంరక్షణ చర్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. నేల, నీటి సంరక్షణతో సమాజాభివృద్ధి అధిక దిగుబడుల ఆశతో పాటు వాణిజ్యపరమైన ఆలోచనలు ఎక్కువ కావడంతో పంటలకు అవసరం ఉన్నా లేకున్నా విచక్షణా రహితంగా రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడడం మొదలుపెట్టారు. దీని వల్ల నేల భౌతిక లక్షణాల్లో మార్పు రావడంతో భూములు క్రమంగా నిస్సారమై పంటలు పండటం గగనంగా మారింది. పండినా ఆహారోత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటంతో పాటు వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. అంతే కాకుండా భావితరాలకు సారవంతమైన నేలలు అందించలేని పరిస్థితి ఏర్పడుతోంది. రాబోవు కాలంలో వ్యవసాయం మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచివుంది. నేలతో పాటు నీటి సంరక్షణ చర్యలు తీసుకున్నపుడే వ్యవసాయం, సమాజాభివృద్ధి సాధ్యమవుతుంది. భూసార పరీక్ష తప్పనిసరి భూమిలో ఏ పంటలు వేయాలి, ఏ రకమైన మందులు, ఎంత మోతాదులో వేయాలనే విషయంలో రైతులకు పలు చిక్కులు ఎదురవుతుంటాయి. దీనికి పరిష్కారం భూసార పరీక్ష చేయించడం ఒక్కటే. అదే సమయంలో నీటి పరీక్షలు కూడా చేయించాలి. ఇంకా అవసరమనిపిసప్తే పత్ర విశ్లేషణ పరీక్షలు చేయించాలి. ఇలా చేయించుకోవడం వల్ల నేల, నీరు, ఆకులు, మొక్కల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, వేసిన పంటలకు ఏ రకమైన ఎరువులు ఎంత వేయాలనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. తద్వారా రైతులకు ఎరువులు, పురుగుల మందుపై పెట్టే ఖర్చు బాగా తగ్గుతుంది. నత్రజని–భాస్వరం–పొటాష్ (ఎన్–పీ–కే)తో పాటు జింక్, బోరాన్, మెగ్నీషియం, ఇనుము లాంటి సూక్ష్మపోషకాలు (మైక్రోన్యూట్రియంట్స్) నిష్పత్తి తెలుస్తుంది. ఎరువుల వాడకంలో సమత్యులత పాటిస్తే భూమి సారవంతం అవుతుంది. దీని వల్ల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలు అరికట్టడంతో పాటు భవిష్యత్ తరాలకు పంటలు పండించడానికి అనుకూలమైన భూములను ఇచ్చినవాళ్లమవుతాం. సమతుల పోషకం పాటించాలి రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూసారం, నేల ఆరోగ్యాన్ని సూచించే భూభౌతిక, రసాయన, జీవన పరిస్థితులన్నీ మారిపోతాయి. ఫలితంగా భూసారం క్షీణించి కాలుష్య సమస్యలు, ప్రజార్యోగ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్య తలెత్తకుండా సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంది. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, పంటల అవశేషాలు, జీవన ఎరువులు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల వ్యర్థాలు, రసాయన ఎరువులను క్రమ పద్ధతిలో తగిన నిష్పత్తిలో వాడాలి. పశువులు, గొర్రెలు, మేకలు, పందులు, కోళ్ల ఎరువు, వర్మీకంపోస్టు, వేరుశనగ చెక్క, వేప పిండి, కానుగ పిండి, ఎముకల పొడి తదితర సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడటం ద్వారానే నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 67,500 వేల మట్టి పరీక్షల లక్ష్యం నేల సంరక్షణ, పోషక యాజమాన్య పద్ధతుల నియంత్రణకు వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గతేడాది జిల్లాలో 65 వేల మట్టి పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు రైతులకు అందజేశాం. ఈ ఏడాది అంటే వచ్చే 2017 జూన్ నెలాఖరులోగా 67,500 మట్టి నమూనాలు సేకరించి వాటి ఫలితాలు రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఖరీఫ్‌లో లక్షల హెక్టార్లలో పంటలు వేయడానికి ముందే భూసార పరీక్షలు నిర్వహించి ఎప్పటికపుడు ఫలితాలు ఆన్లైన్లో పెట్టడమే కాకుండా సాయిల్హెల్త్ కార్డులు రైతులకు ఇచ్చి సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ఇందు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలి. భవిష్యత్ తరాల మనుగడ కోసం భూమాతను చక్కగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రకృతి ప్రసాదించిన నేలను రక్షించుకునేందుకు ముఖ్యంగా రైతులు కార్యోన్ముఖులు కావాలి. - వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, డీడీఏ ఎం.క్రిష్ణమూర్తి