‘నేల’మ్మ బాగుకోసం
సందర్భం : నేడు ప్రపంచ నేలల దినోత్సవం
ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల అతి ముఖ్యమైనది. సమస్త జీవరాశులు, మానవాళి మనుగడ ఈ నేలపైనే ఆధారపడివుంది. భూమి సారవంతంగా ఉన్నపుడే పంటలు బాగా పండుతాయి. తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారి అన్నదాతలు ఆర్థిక పురోగతి సాధిస్తారు. రైతు బాగున్నాడంటే మిగిలిన అన్ని వర్గాలు అన్ని రంగాలు ప్రగతి పథంలో పయనిస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. అయితే అవగాహన లోపంతో నేల, నీటి సంరక్షణ చర్యలు పాటించడం అంతంతా మాత్రంగానే ఉంది. నేల స్వభావాన్ని పరిరక్షించుకునే దిశగా 2013 నుంచి ఏటా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా నేలల దినోత్సవాన్ని నిర్వహించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో నేల, నీటి సంరక్షణ చర్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.
నేల, నీటి సంరక్షణతో సమాజాభివృద్ధి
అధిక దిగుబడుల ఆశతో పాటు వాణిజ్యపరమైన ఆలోచనలు ఎక్కువ కావడంతో పంటలకు అవసరం ఉన్నా లేకున్నా విచక్షణా రహితంగా రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడడం మొదలుపెట్టారు. దీని వల్ల నేల భౌతిక లక్షణాల్లో మార్పు రావడంతో భూములు క్రమంగా నిస్సారమై పంటలు పండటం గగనంగా మారింది. పండినా ఆహారోత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటంతో పాటు వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. అంతే కాకుండా భావితరాలకు సారవంతమైన నేలలు అందించలేని పరిస్థితి ఏర్పడుతోంది. రాబోవు కాలంలో వ్యవసాయం మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచివుంది. నేలతో పాటు నీటి సంరక్షణ చర్యలు తీసుకున్నపుడే వ్యవసాయం, సమాజాభివృద్ధి సాధ్యమవుతుంది.
భూసార పరీక్ష తప్పనిసరి
భూమిలో ఏ పంటలు వేయాలి, ఏ రకమైన మందులు, ఎంత మోతాదులో వేయాలనే విషయంలో రైతులకు పలు చిక్కులు ఎదురవుతుంటాయి. దీనికి పరిష్కారం భూసార పరీక్ష చేయించడం ఒక్కటే. అదే సమయంలో నీటి పరీక్షలు కూడా చేయించాలి. ఇంకా అవసరమనిపిసప్తే పత్ర విశ్లేషణ పరీక్షలు చేయించాలి. ఇలా చేయించుకోవడం వల్ల నేల, నీరు, ఆకులు, మొక్కల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, వేసిన పంటలకు ఏ రకమైన ఎరువులు ఎంత వేయాలనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. తద్వారా రైతులకు ఎరువులు, పురుగుల మందుపై పెట్టే ఖర్చు బాగా తగ్గుతుంది. నత్రజని–భాస్వరం–పొటాష్ (ఎన్–పీ–కే)తో పాటు జింక్, బోరాన్, మెగ్నీషియం, ఇనుము లాంటి సూక్ష్మపోషకాలు (మైక్రోన్యూట్రియంట్స్) నిష్పత్తి తెలుస్తుంది. ఎరువుల వాడకంలో సమత్యులత పాటిస్తే భూమి సారవంతం అవుతుంది. దీని వల్ల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలు అరికట్టడంతో పాటు భవిష్యత్ తరాలకు పంటలు పండించడానికి అనుకూలమైన భూములను ఇచ్చినవాళ్లమవుతాం.
సమతుల పోషకం పాటించాలి
రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూసారం, నేల ఆరోగ్యాన్ని సూచించే భూభౌతిక, రసాయన, జీవన పరిస్థితులన్నీ మారిపోతాయి. ఫలితంగా భూసారం క్షీణించి కాలుష్య సమస్యలు, ప్రజార్యోగ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్య తలెత్తకుండా సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంది. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, పంటల అవశేషాలు, జీవన ఎరువులు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల వ్యర్థాలు, రసాయన ఎరువులను క్రమ పద్ధతిలో తగిన నిష్పత్తిలో వాడాలి. పశువులు, గొర్రెలు, మేకలు, పందులు, కోళ్ల ఎరువు, వర్మీకంపోస్టు, వేరుశనగ చెక్క, వేప పిండి, కానుగ పిండి, ఎముకల పొడి తదితర సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడటం ద్వారానే నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
67,500 వేల మట్టి పరీక్షల లక్ష్యం
నేల సంరక్షణ, పోషక యాజమాన్య పద్ధతుల నియంత్రణకు వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గతేడాది జిల్లాలో 65 వేల మట్టి పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు రైతులకు అందజేశాం. ఈ ఏడాది అంటే వచ్చే 2017 జూన్ నెలాఖరులోగా 67,500 మట్టి నమూనాలు సేకరించి వాటి ఫలితాలు రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఖరీఫ్‌లో లక్షల హెక్టార్లలో పంటలు వేయడానికి ముందే భూసార పరీక్షలు నిర్వహించి ఎప్పటికపుడు ఫలితాలు ఆన్‌లైన్‌లో పెట్టడమే కాకుండా సాయిల్‌హెల్త్ కార్డులు రైతులకు ఇచ్చి సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.
ఇందు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలి. భవిష్యత్ తరాల మనుగడ కోసం భూమాతను చక్కగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రకృతి ప్రసాదించిన నేలను రక్షించుకునేందుకు ముఖ్యంగా రైతులు కార్యోన్ముఖులు కావాలి.
- వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, డీడీఏ ఎం.క్రిష్ణమూర్తి