ఐదేళ్లుగా వరుస కరువు. అప్పుల ఊబిలో అన్నదాత ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో కాడి దించేసి వలస బాట పడుతున్న రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. సగటున 4లక్షల మంది పొట్ట చేతపట్టుకుని వెళ్తున్నారంటే ఎంతటి దయనీయ పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతోంది. గత మూడేళ్లలో 205 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం చూస్తే జిల్లాలో వ్యవసాయ సంక్షోభానికి అద్దం పడుతోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలలో ‘అనంత’ ఒకటి. ఏటికేడు ఇక్కడ పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోతుండటం చూస్తే.. వ్యవసాయం ఎంతటి సంక్షోభంలో కూరుకుపోతుందో అర్థమవుతోంది. సాగునీటి వనరులు లేకపోవడం.. అధిక శాతం వర్షాధారంపైనే ఆధారపడాల్సి వస్తుండటంతో రైతుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. జిల్లాలో ప్రధానమైన వేరుశనగ సాగు 2009లో 21.13 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది 10.54 లక్షల ఎకరాలకే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా పారిశ్రామిక అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించా ల్సిన ఆవశ్యకత ఉంది. అయితే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలపై కొన్నేళ్లుగా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ పారిశ్రామికాభివృద్ధి తిరోగమనంలో ఉంది. ‘అనంత’కు తుంగభద్ర డ్యాం నుంచి వచ్చే సాగునీరు మినహా మరే ప్రత్యామ్నాయం లేదు. 2004 తర్వాత హంద్రీనీవా, చాగ ల్లు, పెండేకల్లు రిజర్వాయర్లు నిర్మించారు. 2012 నుంచి హంద్రీనీవాకు కృష్ణాజలాలు వస్తున్నా డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడంతో సాగునీరు అందడం లేదు. కళ్లెదుట నీళ్లున్నా పొలాలకు పారించుకోలేని దుస్థితి రైతులది.
పరిశ్రమలే ప్రత్యామ్నాయం
జిల్లాలో ఉపాధి లేక కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. వ్యవసాయం చేసే రైతుల సంఖ్య తగ్గిపోవడంతో ఆర్థిక ప్రగతి ప్రమాదంలో పడుతోంది. పల్లెవాసుల జీవనశైలి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. జిల్లాలో వెయ్యి మంది పనిచేసే ఉద్యోగులు ఉన్న పరిశ్రమ ఒక్కటీ లేదంటే పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. పెన్నా, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలు మినహా మరో పెద్ద పరిశ్రమ లేదు. వ్యవసాయ యోగ్యంకాని భూములు అధికంగా ఉండటం, మానవ వనరులు పుష్కలంగా ఉండటం, బెంగళూరు ఎయిర్‌పోర్టు దగ్గరగా ఉండటం, పుట్టపర్తి విమానాశ్రయం ఉండటంతో ఇక్కడ పరిశ్రమల స్థాపనకు మంచి వాతావరణం ఉందని మూడున్నరేళ్లుగా పాలకులు ఊదరగొడుతున్నారు. అయితే పరిశ్రమల ఏర్పాటులో చిత్తశుద్ధి చూపకపోవడం గమనార్హం.
వెనుదిరిగిన పరిశ్రమలు
జిల్లాలో 2004 తర్వాత అప్పటి ప్రభుత్వం రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఒడిస్సీ సంస్థతో సైన్సుసైటీ స్థాపనకు ఒప్పందం చేసుకుంది. హిందూపురం పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ తీరుతో సైన్సుసిటీ ఏర్పాటు ఒప్పందాన్ని ఒడిస్సీ సంస్థ రద్దు చేసుకుంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లో బీడీఎల్(భారత్ డైనమిక్స్ లిమిటెడ్), హెచ్‌ఏఎల్(హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్), ఈసీఐఎల్(ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), బీహెచ్‌ఈఎల్(భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) వంటి ప్రభుత్వరంగ సంస్థలతో పాటు పలు బహుళజాతి సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు మందుకొచ్చాయి. లేపాక్షి నాలెడ్జ్‌హబ్ పరిశ్రమలకు నీరు అందించేందుకు సోమశిల బ్యాక్‌వాటర్ నుంచి పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టారు.
ఈ పనులు 25 శాతం పూర్తయ్యాయి. టీడీపీ అధికారంలోకి వస్తే టెక్స్‌టైల్ పార్కు, సబ్బుల ఫ్యాక్టరీ, పారిశ్రామిక కారిడార్, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్, పుట్టపర్తిలో విమానాల మరమ్మతు కేంద్రం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల ఒప్పందాలనే రద్దు చేశారు. వచ్చే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ బహుశా ఈ ప్రభుత్వానికి చివరిది కావొచ్చు. ఇప్పటి వరకూ వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదంటే ‘అనంత’ను ఏస్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారో ఇట్టే తెలుస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా వారి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు ఉండే అవకాశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడం గమనార్హం.
ఇవీ అవకాశాలు
= రామగిరి మండలంలో బంగారు గనులు ఉన్నాయి. ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు సర్వే చేశారు. కొద్దిమేర పనులు ప్రారంభించినా నిలిపేశారు. మూడున్నరేళ్లుగా పరిటాల సునీత మంత్రిగా కొనసాగుతున్నా సొంత మండలంలో పరిశ్రమ ఏర్పాటుపై దృష్టి సారించని పరిస్థితి.
= వజ్రకరూరు మండలంలో వర్షాలు కురిస్తే వజ్రాలు బయటపడుతున్నాయి. ఇక్కడ జీఎస్‌ఏ(జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వజ్రాలు లభించే ప్రాంతాల్లోని మట్టితో పరిశోధనలు చేసి నివేదికలను ప్రభుత్వానికి పంపుతోంది.
= తాడిపత్రి ప్రాంతంలో సున్నపురాయి గనులు అధికం. ఇక్కడ మరిన్ని సిమెంట్ పరిశ్రమలు స్థాపించే వీలుంది.
= మడకశిరలో గ్రానైట్ అధికంగా లభిస్తుంది. గ్రానైట్ లభ్యత లేని తాడిపత్రిలోనే గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధి చెందిందంటే, మడకశిరపై దృష్టి సారిస్తే పారిశ్రామిక అభివృద్ధి సాధ్యపడుతుంది.
= వేరుశనగకు ప్రత్యామ్నాయంగా గోరుచిక్కుడు సాగును పెంచి, ప్రాసెసింగ్ యూనిట్‌ను కనగానపల్లి మండలం దాదులూరు వద్ద ఏర్పాటు చేస్తామని తొలి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. ఇప్పటి వరకు అతీగతీ లేదు.
= ఉద్యానపంటలు జిల్లాలో ఆశాజనకంగా సాగవుతున్నాయి. ముఖ్యంగా చీనీ, ద్రాక్ష, దానిమ్మ, అంజూర, కర్జూర సాగు చేస్తున్నారు. జ్యూస్ ఆధారిత పరిశ్రమలతో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment