నీలినాలికతో జాగ్రత్త | agriculture story | Sakshi
Sakshi News home page

నీలినాలికతో జాగ్రత్త

Published Thu, Sep 21 2017 10:02 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

నీలినాలికతో జాగ్రత్త - Sakshi

నీలినాలికతో జాగ్రత్త

అప్రమత్తంగా లేకపోతే గొర్రెలకు ప్రమాదం
పశుసంవర్ధకశాఖ డీడీ డాక్టర్‌ శ్రీనాథాచార్‌


అనంతపురం అగ్రికల్చర్‌: ఇటీవల జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో గొర్రెలకు నీలినాలుక (బ్లూటంగ్‌) వ్యాధి సోకే అవకాశం ఉన్నందున కాపర్లు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ డీడీ డాక్టర్‌ టి.శ్రీనాథాచార్‌ తెలిపారు. వర్షంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ వాతావరణంలో మార్పు చోటుచేసుకుంటున్నందున నీలునాలుక వ్యాధి ఎక్కువగా వ్యాప్తించే అవకాశం ఉందన్నారు.

బ్లూటంగ్‌
బ్లూటంగ్‌ అనేది ‘క్యూలెకాయిడ్‌’ రకం దోమల వల్ల వ్యాపిస్తుంది. వ్యాధి బారిన పడిన గొర్రెలు ఎక్కువగా ఈసుకుపోవడం (అబార్షన్‌), పాల ఉత్పత్తి పడిపోవడం, గొర్రెపిల్లలు బలహీనపడటం, మాంసం, ఉన్ని నాణ్యత దెబ్బతింటాయి. దీనివల్ల కాపరులకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఈ వ్యాధిని ‘ఏ’ విభాగంలో చేర్చినందున వీటి మాంసం విదేశీ ఎగుమతికి అవకాశం లేదు. నీలినాలుక వైరస్‌లలో 24 జన్యురకాలను గుర్తించినా... మన రాష్ట్రంలో బీటీవీ–18, బీటీవీ–23 ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఒక సంవత్సరంలోపు వయస్సు ఉన్న గొర్రెలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అలాగే త్వరగా వ్యాపించి నష్టం కలిగిస్తుంది.

లక్షణాలు
గొర్రెలకు 104 నుంచి 106 డిగ్రీల వరకు జ్వరం రావడం. మెత్తగా ఉండటం, ముఖం, ముక్కు, పెదవులు వాచి ఉండటం, నాలుక ఎర్రగా తయారై నీలి రంగుకు మారుతుంది. కళ్లు ఎర్రబడి కనురెప్పలు, చెవులు, కింది దవడ వాపు వస్తుంది. ముక్కు నుంచి తెల్లటి జిగట స్రవాలు రావడం, నోటిలోని మాంసం పొరలు (మ్యూకస్‌ మెంబ్రేన్‌) పుండ్ల మాదిరిగా ఏర్పడటం, తొడల మధ్య, చంకల్లో, మల ద్వారం కింద చర్మం ఎర్రగా కమిలినట్లు ఉండటం, వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెల్లో గిట్టల మొదటి భాగం వాచి, మధ్యలో ఎర్రగా ఉండటం, చర్మం దెబ్బనడం వల్ల ఉన్ని, వెంట్రుకలు ఊడిపోవడం, తీవ్రతను బట్టి ఐదారు రోజులు మేత మేయక, నీరు తాగక నీరసించి చనిపోయే ప్రమాదం ఉంటుంది. చనిపోయిన గొర్రెల ఊపిరితిత్తులు వాపు రావడం, గాలిగొట్టాలు నురగ వంటి ద్రవాలతో నిండివుండటం, ఎద భాగంలో నీరు చేరడం, గుండె పొరల్లో రక్తస్రావం లాంటివి కనిపిస్తాయి.

నిర్ధారణ, చికిత్స
పశువైద్యాధికారి సాయంతో ఏలీసా, పీసీఏ అనే రక్తపరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. వ్యాధి బహిర్గతమైన తర్వాత చికిత్స కష్టం. గాలికుంటు, పీపీఆర్‌ లాంటి వ్యా«ధి లక్షణాలు కూడా నీలినాలుక వ్యాధికి సారూప్యత ఉండటంతో పశువైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. నోటిలో పుండ్లను పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంతో కడిగి, బోరిక్‌ పౌడర్‌ను పూయాలి. వైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్‌ మందులు వాడాలి.

గిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంతో కడిగి, హిమాక్స్, నెమ్‌లెంట్‌ వంటి మందులను పూయాలి. వర్షాకాలంలో గొర్రెల కొట్టం, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం, రాత్రి సమయాల్లో మంద చుట్టూ వేపాకు పొగ వేసి దోమలను నివారించవచ్చు. ప్రతి 10–15 రోజులకోసారి గొర్రెల శరీరంపై, కొట్టంలో 2 శాతం బ్యూటాక్స్‌ మందును పిచికారీ చేయడం ద్వారా దోమకాటును అరికట్టవచ్చు. గొర్రెలను ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. గొర్రెల మందలో ఆవులు, దూడలను కట్టేయడం ద్వారా దోమలు వాటిపై వాలి గొర్రెలకు బెడదను తగ్గించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement