చిటికెలో ప్రాణాపాయం
- తొలకరి సమయంలో గొర్రెల్లో చిటికె వ్యాధి
– పశుశాఖ ‘అనంత’ డివిజన్ డీడీ శ్రీనాథాచార్
అనంతపురం అగ్రికల్చర్ : తొలకరి వర్షాలకు మొలచిన గడ్డి తినడం వల్ల, ఎలాంటి రోగ లక్షణాలు కనిపించకుండానే చిటికె వ్యాధితో గొర్రెలు చనిపోయే ప్రమాదం ఉందని పశుసంవర్ధకశాఖ అనంతపురం డివిజన్ ఇన్‌చార్జి డీడీ డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. కాపర్లకు నష్టాన్ని కలిగించే వాటిలో చిటికె వ్యాధి (ఎంటరోటోక్సిమియా) కూడా ఒకటన్నారు. ఈ వ్యాధిని ‘నెత్తిపిడుగు’ గడ్డిరోగం, పాటురోగం లాంటి రకరకాల పేర్లతో పిలుస్తారని తెలిపారు.
వ్యాధి వ్యాప్తి: క్లాస్ట్రీడియం అనే సూక్ష్మజీవులు ప్రేవుల్లో గాలిలేని (ఎనిరోబిక్) వాతావరణంలో అభివృద్ధి చెందిన సందర్భంల్లో వదలబడిన విష పదార్థాలు (టాక్సీన్లు) ఈ వ్యాధికి కారణం. తొలకరి వర్షాలకు పెరిగిన లేత గడ్డిని గొర్రెలు ఆశగా, అధికంగా తింటాయి. అందువల్ల ప్రేవుల్లో గాలి లేని వాతావరణం ఏర్పడటం వల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వ్యాధిని కలిగిస్తాయి. ఈ వ్యాధి మే నెలాఖరు నుంచి జూలై మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో కూడా వ్యాపిస్తుంది.
లక్షణాలు: ఎలాంటి రోగ లక్షణాలు కనపడకుండానే జీవాలు ఉన్నట్లుండి చనిపోతాయి. చనిపోయే ముందు గొర్రెలు నీరసంగా ఉండటం గమనించవచ్చు. జీవాలు గాలిలోకి ఎగిరి కిందపడి కాళ్లు గిలగిల కొట్టుకుంటూ పళ్లు కొరుకుతూ వణుకుతూ బిగుసుకుని నిమిషాల్లో చనిపోతాయి. కొన్ని జీవాలు నోటి నుంచి చొంగ కారుస్తాయి. శ్వాస పీల్చే శాతం ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మలబద్ధకం, కడుపుబ్బరం ఉంటుంది. మేత మేయకుండా, నెమరు వేయకుండా తలలు వాల్చి, ముడుచుకుని ఒకే చోట నిలబడతాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపిస్తాయి.
చికిత్స–నివారణ: జీవాల జీర్ణకోశంలో సూక్ష్మజీవుల వ్యాప్తిని అరికట్టుటకు టెట్రాసైక్లిన్, ఆంఫీసిలిన్, జెంటామైసిన్ వంటి మందులు, క్లోరిల్, ఎపిల్ వంటి ఇంజక్షన్లు పశు వైద్యుని పర్యవేక్షణలో వాడాలి. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో వ్యాధినిరోధక టీకా (మల్టికాంపోనెంట్ యి.టి.వ్యాక్సీను) వేయించాలి. రెండో విడత అక్టోబరు, నవంబరు మాసాల్లో వేయించాలి. తొలకరి వర్షాలకు మొలిచి వాడిపోయిన గడ్డిని సాధ్యమైనంతవరకు మేపరాదు. మేత కోసం వలస వెళ్లు జీవాలకు వలస ప్రాంతాల్లో గల వ్యాధిని బట్టి .. ముందే టీకాలు వేయించి పంపడం వల్ల వ్యాధిని నివారించవచ్చు. జీవాలను ఉదయం కొంత ఆలస్యగా మేపుటకు తీసుకెళ్లడం, మధాహ్న సమయంలో కొంత సేపు విశ్రాంతిని ఇవ్వడం, సాయంత్రం త్వరగా తీసుకు రావడం వల్ల జీర్ణాశయం కొంత ఖాళీగా ఉంచుట ద్వారా సూక్ష్మ జీవుల అభివృద్ధిని తగ్గించవచ్చు.