జీవాల వలసలపై అప్రమత్తత
అనంతపురం అగ్రికల్చర్ : వేసవిలో ఎదురయ్యే గడ్డి కొరత వల్ల సాధారణంగా జిల్లా నుంచి జీవాలను మేతకోసం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఇలాంటి సమయంలో కాపర్లు జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధకశాఖ గొర్రెల విభాగం సహాయ సంచాలకురాలు డాక్టర్ ఎం.కాంతమ్మ తెలిపారు. జిల్లాలో 38 లక్షల సంఖ్యలో గొర్రెలు ఉండగా 48 వేల కుటుంబాలు వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వేసవిలో గడ్డి కొరత కారణంగా కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, హొస్పేట్, గంగావతి, తుమకూరు, కోలార్, బాగేపల్లి, గౌరీబిదనూరు, మధుగిరి, శిరా, చిక్కబళ్లాపూర్ లాంటి ప్రాంతాలకు మేపు కోసం జీవాలతో వలసలు వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రమాదాలు, జబ్బులు, ఇతరత్రా అంటువ్యాధుల వల్ల జీవాలు చనిపోయి ఆర్థికంగా నష్టం జరగవచ్చు. పంటల కోతల సమయం వ్యవసాయ పంటల సీజన్లు ఒక్కో ప్రాంంతం మధ్య కొంత తేడా ఉంటుంది. పంట ఉన్న సమయంలో పొలాల్లో మేపడం వీలుకాదు. పంట నూర్పిడి తర్వాత మేతకు అనువుగా ఉంటుంది. వలసలు వెళ్లడం కాపరుల జీవితంలో ఒక భాగంగా తయారైంది.
జాగ్రత్తలు పాటించాలి :
గొర్రెల మందలను మేతకోసం తీసుకెళ్లాలనుకునే ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసుకుని అక్కడ మేపు, నీటి సదుపాయం చూసుకోవాలి. అంటువ్యాధులు, జబ్బులు ఉన్నాయా..లేదో తెలుసుకోవాలి. జీవాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సొంత గ్రామాల్లో కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఉండాలి. వెళ్లే సమయంలో గొర్రెల మందను ఎక్కువ దూరం నడిపించకుండా, కాస్త విశ్రాంతి ఇస్తుండాలి. చూడి కట్టిన (గర్భం) జీవాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎండ తీవ్రత లేని సమయంలో మందలు తోలుకెళ్లాలి. రాత్రిపూట గొర్రెల మందలు విశ్రాంతి తీసుకునే సమయంలో చుట్టూ కంపను గాని, కంచెను వేయడం వలన జీవాలను తోడేళ్లు, నక్కలు, దొంగల బారి నుంచి కాపాడుకోవచ్చు. వలస సమయంలో జీవాలన్నీ సక్రమంగా ఒక జట్టులా వెళ్లేందుకు వీలుగా మందల్లో కొన్ని మేకలు ఉంటే బాగుంటుంది.
దీని వలన గొర్రెలు విడివిడిగా తప్పించుకునే అవకాశం ఉండడు.ఒక్కో సందర్భంలో గొర్రె పిల్లలకు మేకల పాలు తాపించి సంరక్షించుకోవచ్చు. వేసవిలో వలస వెళ్లేముందు గొర్రెల శరీరంపైన ఉండే ఉన్ని కత్తిరించాలి. అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా టీకాలు వేయించాలి. ప్రధానంగా నట్టల (డీవార్మింగ్) మందును తాపించాలి. దీని వల్ల కొత్త ప్రదేశాలకు పోయినప్పుడు అక్కడి నీరు మేతల నుంచి వచ్చే పరాన్న జీవుల బెడద నుంచి కాపాడుకోవచ్చు. వలసెళ్లినప్పుడు అంటువ్యాధులు సోకితే వెంటనే వైద్యం చేయించిన తర్వాత అమ్మేయడం వల్ల కాపర్లకు నష్టం జరగదు. కొన్ని నెలల పాటు అక్కడే ఉండే అవకాశం ఉన్నందున ముందస్తుగా కొన్ని వైద్య జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు సిఫారసు మేరకు కొన్ని అత్యవసర ముందులు అందుబాటులో ఉంచుకోవాలి.