జీవాల పెంపకంలో అప్రమత్తం
- ఇప్పటికే తీవ్రస్థాయికి చేరిన ఎండలు
- జాగ్రత్తలు తీసుకోకుంటే నష్టమే..
అనంతపురం అగ్రికల్చర్ : ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్న నేపథ్యంలో వేసవితాపం నుంచి జీవాలను కాపాడుకునేందుకు కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ అనంతపురం డివిజన్ సహాయ సంచాలకుడు డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. జీవాలు వడదెబ్బకు, ఇతర వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. మేత కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, వెళుతున్న గొర్రెలు, మేకల పెంపకందారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
మండుతున్న ఎండలు
ఇప్పటికే చాలా మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే పరిస్థితి కనిపిస్తుండటంతో గొర్రెలు, మేకల పెంపకానికి ఇబ్బంది కలిగే కలిగే అవకాశం ఉంది. మేత, నీటి కోసం రోజూ కనీసం పదుల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉన్నందున వేసవితాపం ప్రభావం తప్పకుండా ఉంటుంది. వర్షాలు లేక నీరు, మేత లభ్యత అంతంత మాత్రంగా ఉన్నందున ఎండుగడ్డి, చిన్నపాటి పుల్లలు తింటూ సరైన సమయంలో తగినంత నీరు కూడా దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జీవాలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది.
వడదెబ్బ సోకే అవకాశం
తగినంత మేత, నీరు లభించక జీవాలు నీరసించిపోతాయి. నడవడానికి కూడా ఇబ్బంది పడుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ జీవాల శర్మం పొడారిపోతుంది. నోటీ నుంచి చొంగకారుస్తూ తీవ్ర ఆయాసానికి గురయ్యే లక్షణాలు కనిపిస్తాయి. నాడీ వ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవచ్చు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో జీవాలు మరణించే ప్రమాదం ఉంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అనేక రోగాలు ప్రబలే అవకాశం ఉంది. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్త పడాలి. పశువైద్యుని సంప్రదించి తగిన ప్రథమ చికిత్స చేయాలి. నార్మల్ సలైన్, డైక్ట్సోజ్, అవిల్, డెకడ్రాన్ లాంటి మంందులు పశువైద్యుడి సలహా మేరకు జీవాలకు తాపించాలి.
వేసవి యాజమాన్యం
వేసవిలో పచ్చిగడ్డి, ఎండుమేత తగినంత దొరకనపుడు ఖనిజ లవణ లోపం ఏర్పడుతుంది. దీంతో జీవాల పెరుగుదల ఉండదు. షెడ్లలో గొర్రెలు, మేకలు నాకడానికి వీలుగా ఖనిజ లవణ మిశ్రమ ఇటుకలను వేలాడదీస్తే ఈ లోపాన్ని సవరించవచ్చు. అందుబాటులో ఉండే సామగ్రితో గాలి, వెలుతురు ప్రసరించేలా చిన్నగా, ప్రత్యేకంగా షెడ్లు కట్టుకోవాలి. పాకలను బోదగడ్డి లేదా తాటాకులు లేదా కొబ్బరిపట్టలు లాంటి వాటితో కప్పుకోవాలి. వేసవి గాలులను నిరోధించడానికి షెడ్లకు ఇరువైపులా గోనె సంచులు కట్టి నీళ్లు పోస్తుంటే చల్లదనం వచ్చే అవకాశం ఉంది. ఎండాకాలంలో సంభవించే పీపీఆర్, బొబ్బ, గాలికుంటు, చిటుకవ్యాధి నివారణకు ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. సాధ్యమైనంత మేరకు జీవాలను ఉదయం, సాయంత్రం వేళల్లో మేతకు తీసుకెళ్లాలి. మధ్యాహ్నం సమయంలో నీడ ప్రదేశంలో విశ్రాంతి కల్పించాలి. కృత్రిమంగానైనా నీడ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.