పాతిక జీవాలకో విత్తన పొట్టేలు | agriculture story | Sakshi
Sakshi News home page

పాతిక జీవాలకో విత్తన పొట్టేలు

Published Wed, Sep 13 2017 9:58 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పాతిక జీవాలకో విత్తన పొట్టేలు - Sakshi

పాతిక జీవాలకో విత్తన పొట్టేలు

గొర్రెల మంద అభివృద్ధికి తప్పనిసరి
పశుశాఖ గొర్రెల విభాగం ఏడీ డాక్టర్‌ కాంతమ్మ

అనంతపురం అగ్రికల్చర్‌: గొర్రెల మంద అభివృద్ధికి నాణ్యమైన పొట్టేళ్లు ఉండాలని పశుసంవర్ధకశాఖ గొర్రెల విభాగం ఏడీ డాక్టర్‌ ఎం.కాంతమ్మ తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 38 లక్షలకుపైగా జీవాల సంఖ్య ఉన్నా... వాటికి తగ్గట్టు పొట్టేళ్ల సంఖ్య, అందులో మేలుజాతివి తక్కువగానే ఉన్నాయన్నారు. ప్రతి 25 గొర్రెలకు కనీసం ఒక విత్తనం పొట్టేలు మందలో ఉండేలా పెంపకందారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మందలో ఉన్నవి వద్దు
మందలో పుట్టిన పొట్టేలు పిల్లలనే చాలా మంది విత్తన పొట్టేళ్లుగా ఎంపిక చేసుకుంటారు. దీని వల్ల పెద్దగా లాభం ఉండదు. వాటి రక్తసంబంధ సంతతిపై పొర్లే అవకాశం ఉంది. దీనిని ఇన్‌ బ్రీడింగ్‌ అంటారు. దగ్గరి సంబంధమున్న గొర్రెలు + పొట్టేళ్ల సంపర్కం వల్ల కలిగే జీవాలు బలహీనంగా ఉండటం, తక్కువ బరువుతో పుట్టడం, అవిటితనంతో పుట్టడం, సంతానోత్పత్తికి పనికిరానివిగాను, ఊబివిగాను ఉంటాయి. అంతేకాకుండా జన్యు సంబంధ లోపాలతో గానీ, జాతి లక్షణాలు కోల్పోవడం లాంటివి జరుగుతాయి. అందువల్ల విత్తన పొట్టేళ్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టేళ్లను రెండు మూడేళ్లకోసారి మార్పు చేయాలి. వేరొక మంద నుంచి గానీ, మంచి లక్షణాలున్న వాటిని మందలో వదలాలి.

పొట్టేలు ఎంపిక ఇలా..
విత్తన పొట్టేళ్ల కోసం నెల్లూరు జాతిని ఎంపిక చేసుకోవాలి. నెల్లూరు గోధుమ, నెల్లూరు జోడిపి లాంటి జాతి లక్షణాలు బాగుంటాయి. చక్కటి శరీర సౌష్టవం, పొడవు, ఎత్తు, బరువు ఉండే వాటిని ఎంచుకోవాలి. కాలి గిట్టలు బాగుండాలి, చురుకుదనం కలిగి ఉండటం. వృషణాలు రెండూ సమానంగా, వయస్సుకు సరిపడిన పరిమాణంలో ఉండాలి. పొట్టేళ్ల మందపై వాడేందుకు కనీసం ఒకటిన్నర సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇలాంటి వాటిని జత కలిపితే ఆరోగ్యవంతమైన, చురుకైన జీవాలు నిర్ణీత బరువుతో పుట్టడమే కాకుండా ఆశించిన రీతిలో పెరుగుదల, పునరుత్పత్తి జరిగి అధిక లాభాలనిస్తాయి. మందలో ప్రతి 25–30 గొర్రెలకు ఒక పొట్టేలు చొప్పున తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటే మంద ఉత్పత్తి జరుగుతుంది.  ఇలా చేయడం వల్ల ప్రతి గొర్రె నుంచి అదనపు ఆదాయం ఆశించవచ్చు.

మేలుజాతి విత్తన పొట్టేళ్ల కొరత
ప్రస్తుతం మేలు జాతి విత్తనపు పొట్టేళ్లు మార్కెట్‌లో దొరకడం లేదు. పెంపకదారులు చిన్న పిల్లలను వేరుచేసి అందులో పొట్టేలు పిల్లలను అమ్మినప్పుడు అని సంతలో కోతకు వెళుతున్నాయి. కొందరు మంచిజాతి పొట్టేళ్లను బయటి ప్రాంతాల నుంచి కోనుగోలు  చేస్తున్నారు. ఇంకొందరు రెండేళ్లకోసారి పొట్టేళ్లను మార్పిడి చేస్తున్నారు. మరికొందరు గవర్నమెంటు ఫారాల నుంచి కూడా పొట్టేళ్లను కొంటున్నారు. ఎక్కడివైనా సరే మేలుజాతి, నాణ్యమైన విత్తన పొట్టేళ్ల ద్వారా మంద ఆశించిన వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా పెంపకందారులకు ఆదాయాన్ని పెంచుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement