ఈ భూతలమ్మీద జీవానికే జేజమ్మ నేలతల్లి. మనందరం ఈ నేలమ్మ ముద్దు బిడ్డలమే. భూమి మీద ఉన్న జీవవైవిధ్యం కన్నా భూమి లోపల జీవవైవిధ్యం ఎక్కువ. అడవిలోని అత్యంత సారవంతమైన మట్టి జీవన ద్రవ్యంతో జీవజీవాలతో ఉంటుంది. అందుకే అడవి ఎంత ఎండల్లోనూ ఎండిపోకుండా సతత హరితంగా అలరారుతూ ఉంటుంది. అడవిలో చెట్ల కింద మట్టి అత్యంత సారవంతంగా, సజీవంగా ఉంటుంది. దీన్ని చెంచాడు తీసుకొని పరీక్షించి చూస్తే.. భూగోళంపైన మనుషులెందరు ఉన్నారో అన్ని సూక్ష్మజీవులు ఉంటాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) శాస్త్రవేత్తలు ప్రకటించారు.
వ్యవసాయ నేలల్లోనూ సూక్ష్మజీవరాశిని పెంపొందించుకునే ప్రకృతి వ్యవసాయ పద్ధతులే భూసారాన్ని పెంపొందించగలవు, పరిరక్షించగలవు. నేలతల్లి చల్లగుంటేనే మనమూ చల్లగా ఉంటాం. నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం. మన నేలలు సకల పోషకాలతో సజీవంగా ఉంటేనే మనం పండించే ఆహారంలోనూ పోషకాల లోపం లేకుండా ఉంటుంది.
నేలతల్లి అమూల్యమైన ప్రకృతి సేవలతో మనుషులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు సహా సకల జీవరాశికి ప్రాణం పోస్తుంది. అటువంటి నేలతల్లి అనేక రకాల కాలుష్యాల వల్ల, పారిశ్రామిక/రసాయనిక వ్యవసాయ పద్ధతుల వల్ల క్రమంగా నిర్జీవమవుతోంది, నిస్సారమవుతోంది. ఇప్పటికే మూడింట ఒక వంతు సాగు భూమి నిర్జీవంగా, సాగు యోగ్యం కాకుండా మారిపోయింది.
రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులతో కూడిన నష్టదాయక వ్యవసాయ పద్ధతుల వల్ల ఉత్పాదకశక్తిని, తేమను నిలుపుకునే శక్తిని కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి 20 లక్షల హెక్టార్ల భూమి ఎడారిగా మారిపోతోంది.
సముద్రం తర్వాత అధికంగా కర్బనం నిల్వలు కలిగి ఉన్న భూమి జవజీవాలను సంరక్షించుకోవడం ద్వారా మాత్రమే భూతాపోన్నతిని అరికట్టగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. భూమిని కాలుష్యాల నుంచి రక్షించుకుందాం అని ఎఫ్.ఏ.ఓ. ఈ ఏడాది డిసెంబర్ 5న అంతర్జాతీయ భూముల దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చింది. ఇందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుంది. ఈ బృహత్ కృషిలో ప్రకృతి వ్యవసాయదారులే సైనికులు!
అయినా.. సమయం మించి పోలేదు భూముల విధ్వంసాన్ని నిలువరించగలం
భూమిని కాలుష్యం నుంచి పరిరక్షించడానికి భూసారాన్ని పెంపొందించే రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు చేపట్టడంతో పాటు.. అనేక ఇతర రంగాల్లోనూ ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతులు మార్చుకోవాలి.
పారిశ్రామిక రంగం, గనుల తవ్వకం, వ్యర్థాల పునర్వినియోగం, రవాణా రంగాలలో కాలుష్యాన్ని తగ్గించే పర్యావరణ అనుకూల పద్ధతులు కూడా పాటిస్తూ స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని చేపడితే... భూములను కాలుష్యం బారి నుంచి పూర్తిగా కాపాడుకోగలుగుతాం.
Comments
Please login to add a commentAdd a comment