నేలలపై శ్రద్ధ పెట్టాలి! | World Soil Day with CGIAR on December 5 2024 | Sakshi
Sakshi News home page

నేలలపై శ్రద్ధ పెట్టాలి!

Published Tue, Dec 3 2024 3:45 AM | Last Updated on Tue, Dec 3 2024 3:45 AM

World Soil Day with CGIAR on December 5 2024

నేలల స్వభావానికి తగిన పంటలు వేసుకోవాలి

సేంద్రియ కర్బనాన్ని అన్ని సాగు భూముల్లోనూ 0.7 శాతానికి పెంచుకోవడం అవసరం

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రముఖ నేలల నిపుణుడు డాక్టర్‌ వి. రామ్మూర్తి సూచన

2024 అంతర్జాతీయ భూముల దినోత్సవం (డిసెంబర్‌ 5) సందర్భంగా ‘మట్టి గణాంకాల సేకరణ, పర్యవేక్షణ, నిర్వహణ’పై దృష్టిని కేంద్రీకరించాలని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది.

‘మన కాళ్ల కింద ఉన్న నేల ఒక జీవవ్యవస్థ. అనేక జాతుల మనోహరమైన మొక్కలు, జంతుజాలానికి నిలయం. మనకు పోషకాహారంతో పాటు స్వచ్ఛమైన నీరు, జీవవైవిధ్యాన్ని అందిస్తున్న నేలలపై శ్రద్ధ పెట్టి పరిరక్షించుకోవటానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాల’ని ప్రముఖ నేలల నిపుణుడు డాక్టర్‌ వి. రామ్మూర్తి సూచించారు. బెంగళూరులోని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ సాయిల్‌ సర్వే అండ్‌ లాండ్‌ యూజ్‌ ప్లానింగ్‌ (ఐసిఎఆర్‌ అనుబంధం)ప్రాంతీయ కార్యాలయం అధిపతిగా ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయం)గా ఆయన వ్యవహరిస్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో నేలల బాగోగులపై అధ్యయనం చేసి, విధాన నిర్ణేతలకు తగు సూచనలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని అనేక మండలాల్లో నేలల స్థితిగతులపై తమ సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైన విషయాలను ఆయన ‘సాక్షి సాగుబడి’కి వెల్లడించారు. 

2 రాష్ట్రాల్లో నేలలపై అధ్యయనం
తెలంగాణలోని గజ్వేల్, ఇంద్రవెల్లి, మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ జిల్లా రాయచోటి, తొండూరు మండలాల్లో, అనంతపురం జిల్లా కదిరి, ఓబుల దేవర చెరువు(ఓడిసి) మండలాల్లోని నేలల స్థితిగతులపై నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ సాయిల్‌ సర్వే అండ్‌ లాండ్‌ యూజ్‌ ప్లానింగ్‌ తరఫున అధ్యయనం చేశామని డా. రామ్మూర్తి తెలిపారు. భూమి స్థితిగతులను తెలుసుకోవడానికి అది ఏ రకం భూమి? మట్టి ఎంత లోతుంది? వంటి వివరాలతో పాటు భూసారాన్ని అంచనా వేయటానికి సేంద్రియ కర్బనం ఆయా నేలల్లో ఎంత శాతం ఉందో మట్టి పరీక్షల ద్వారా నిర్థారణ చేస్తారు.  

సేంద్రియ కర్బనాన్ని మూడు స్థాయిల్లో (తక్కువ – 0.50% లోపు, మధ్యస్థం – 0.50–0.75% మధ్య, అధికం – 0.75% కన్నా ఎక్కువ) లెక్కిస్తారు. సేంద్రియ కర్బనం తెలంగాణ నేలలతో పోల్చితే రాయలసీమ నేలల్లో తక్కువగా ఉందని డా. రామ్మూర్తి అన్నారు. ఈ తేడాలకు కారణం ప్రకృతి వైపరీత్యాలు, వర్షపాతం, సాగు పద్ధతి కారణాలని తెలిపారు. 

మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని పరీక్షలు నిర్వహించిన సాగు భూముల్లో 100% నేలల్లో సేంద్రియ కర్బన శాతం అధికంగా (అంటే.. 0.75% కన్నా ఎక్కువగా) ఉండటం విశేషం. అనంతపురం జిల్లా ఇనగలూరు పంచాయతీలోని 46.29% సాగు భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువగా, 35.26% భూముల్లో మధ్యస్థంగా, 18.45% భూముల్లో అధికంగా ఉందని వెల్లడైందన్నారు (పూర్తి వివరాలు పట్టికలో). 

వరి, పత్తి, మిర్చికి రసాయనాల వాడకం ఎక్కువ
వరి, పత్తి, మిర్చి పంటలకు రసాయనిక ఎరువులు మరీ ఎక్కువగా వేస్తున్నారు. ఎంత అవసరమో గమనించకుండా పక్క రైతును చూసి వేస్తున్నారు. పురుగుమందుల పిచికారీ కూడా అంతే. పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులను చాలా మంది రైతులు వాడటం లేదు. అదే పంటను ప్రతి ఏటా సాగు చేస్తున్నారు. అందుకే సేంద్రియ కర్బనం అడుగంటుతోందని డా. రామ్మూర్తి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రైతులు ఇప్పటికైనా జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని అన్ని సాగు భూముల్లోనూ 0.7 శాతానికి పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారాయన.

΄పొటెన్షియల్‌ క్రాప్‌ జోన్లు 
ఆయా భూముల స్వభావం, భూసార పరిస్థితులు, ఆప్రాంత వాతావరణం, వర్షపాతం, అక్కడి ప్రజల ఆసక్తి, మార్కెట్‌ స్థితిగతులపై 20 ఏళ్ల క్రితం నాటి నుంచి సమాచారం సేకరించి విశ్లేషించామని డా. రామ్మూర్తి చెప్పారు. ఈ సమాచారంతో శాస్త్రీయంగా ΄పొటెన్షియల్‌ క్రాప్‌ జోన్స్‌ నివేదికలు ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పత్తి, వరి, జొన్న, వేరుశనగ పంటలకు ఏయే జిల్లాలో ఎన్ని హెక్టార్ల భూమిలో ‘చాలా బాగా, ఒక మాదిరిగా, కొంతమేరకు’ ఆయా పంటల సాగుకు అనువుగా ఉన్నాయో చెప్పామన్నారు.

అన్ని మండలాల్లో మట్టిని అధ్యయనం చేయాలి
భూమిపై మన జీవితం ఆరోగ్యకరమైన నేలలపై ఆధారపడి ఉంటుంది. మన పాదాల కింద ఉన్న నేల ఒక జీవవ్యవస్థ. అనేక మనోహరమైన మొక్కలు, చెట్లు, జంతువులకు నిలయం. మట్టి మనకు పోషకాహారాన్ని, స్వచ్ఛమైన నీటిని, జీవవైవిధ్యాన్ని అందిస్తుంది. ప్రతి జిల్లాలో అన్ని మండలాల్లోని ΄పొలాల్లో మట్టి పరీక్షలు చేసి, అధ్యయనం చేయాలి. మన మట్టిలో వుండే పోషకాలు ఏమిటి? మట్టిలోని జీవరాశి ఏమేమి ఉన్నాయి? ఏమేమి లేవు? కాలక్రమంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? సాగు భూములు బాగుండాలంటే వాటిని ఎలా నిర్వహించుకోవాలి? అనే విషయాలపై పాలకులు శ్రద్ధ చూపాలి.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ్రపోత్సాహమిస్తే మట్టి ఎలా ఉందో పరీక్షించి ఎక్కువగా ఎరువులు వేయకుండా నివారించటంతో పాటు పంటల మార్పిడి,‡మట్టిని పంటలతో కప్పి ఉంచటం వంటి భూసంరక్షణ పద్ధతులపై రైతులకు చైతన్యం కలిగిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సుసంపన్న సాంస్కృతిక జీవనానికి, ఆరోగ్యకరమైన జీవనానికి కూడా మట్టి మూలాధారం. మట్టి ద్వారానే 95% ఆహారం మనకు వస్తోంది. ఇందులో 18 సూక్ష్మ,స్థూల పోషకాంశాలు ఉంటాయి. వీటిలో 15 పోషకాంశాలను నేల నుంచి మిగతా మూడిటిని వాతావరణం నుంచి మనం ΄పొందుతున్నాం. ఈ స్పృహతో సాగు నేలల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి.  – డాక్టర్‌ వి. రామ్మూర్తి (94803  15146), అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయం),్ర పాంతీయ కార్యాలయం, ఐసిఎఆర్‌– నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ సాయిల్‌ సర్వే అండ్‌ లాండ్‌ యూజ్‌ ప్లానింగ్, బెంగళూరు

అవును..! మీరు చదివింది, ఈ ఫొటోలో చూస్తోంది.. నిజమే! 
మన పుచ్చ తోటల్లో పాదులు నేలపై పరచుకొని ఉంటాయి. పుచ్చ కాయలు నేలపైనే పెరుగుతాయి కదా. సౌతాఫ్రికాలో ఒక కంపెనీ పాలీహౌస్‌లలో పుచ్చ పాదులు నిలువుగా ఎగబాగుకుతున్నాయి. పుచ్చ కాయలు వాటికి వేలాడుతున్నాయి. ట్రెల్లిస్‌ పద్ధతిలో పెరిగే టొమాటోల మాదిరిగా ఈ పుచ్చకాయలు వేలాడుతున్నాయి కదూ.. కాండీ బాల్‌ సీడ్‌లెస్‌ పుచ్చకాయలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరుగుతాయి. అదేమాదిరిగా కిలో బరువు పెరిగే స్మైల్‌ మెలన్స్‌ (ఇదో రకం కర్బూజ) పండ్లను కూడా నిలువు తోటల్లో పెంచుతున్నారు. టొమాటోలు వంటి కాయలు బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి తీగజాతి మొక్కలు మొయ్యగలుగుతాయి.

అయితే, ఇలాంటి నిలువు తోటలో పుచ్చకాయలు, కర్బూజ కాయల బరువు మొక్కలకు భారం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ నెట్‌ కవర్లతో కాయలను ప్లాస్టిక్‌ వైర్లకు కట్టేస్తున్నారు. ‘నిలువు తోటలో పెరిగిన పుచ్చకాయలను మేం త్వరలోనే అమ్మకానికి పెట్టబోతున్నాం. సౌతాఫ్రికా మార్కెట్‌లో మేమే ఫస్ట్‌’ అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధి ఫ్రాంకోయిస్‌ ఫౌరీ. పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లలో, మేడపై ఇంటిపంటల్లో ట్రెల్లిస్‌ పుచ్చ, కర్బూజ సాగు సాధ్యమే అని గ్రహించాలి!

12 నుంచి విశాఖ ఆర్గానిక్‌ మేళా
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్‌ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్‌ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకుప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహారప్రాసెసింగ్‌పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement