పొగచూరుతున్న బతుకులు
► దీనావస్థలో కొందుర్గు పరిసర గ్రామాలు
► రాత్రి వేళల్లో పరిశ్రమల వ్యర్థాలకు నిప్పు
► పరిశ్రమ వ్యర్థాలతో శరీరంపై దద్దుర్లు
► దట్టమైన పొగ, దుర్వాసనతో అల్లాడుతున్న జనం
కొందుర్గు: కొందుర్గుతోపాటు పరిసర గ్రామాలైన గంగన్నగూడ, చెర్కుపల్లి, విశ్వనాథ్‌పూర్, చెక్కలోనిగూడ, తూంపల్లి తదితర గ్రామాలకు సంబంధించిన ప్రజలకు చర్మంపై విపరీతమైన దురద ఏర్పడి దద్దుర్లు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ దురద వల్ల వచ్చిన దద్దుర్లు ఎర్రగా ఏర్పడి మచ్చలుగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు వాడిన తగ్గడం లేదని.. ఇక చిన్నారులపై ఈ దురద ప్రభావం మరింత ఎక్కవగా చూపుతుందని పేర్కొంటున్నారు.
పరిశ్రమల కాలుష్యం వల్లనే..
కొందుర్గు పరిసర ప్రాంతంలో ఉన్న దివ్యశక్తి పేపర్ పరిశ్రమ, స్కాన్ ఎనర్జీ పరిశ్రమ, బ్రిటానియా బిస్కెట్ పరిశ్రమ, దిలీప్ టెక్స్‌టైల్స్ తదితర పరిశ్రమల వల్ల వెలువడుతున్న కాలుష్యం వల్లనే తమకు ఈ దురదలు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మొదటగా చిన్న కురుపులుగా ఏర్పడి, పెద్దగా దద్దుర్లు వస్తున్నాయని అనంతరం మచ్చలుగా మారుతున్నాయని తెలిపారు. పరిశ్రమల నిర్వాహకులు పగలంతా వ్యర్థాలను నిల్వచేసి, రాత్రివేళల్లో విడుదల చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అదేవిధంగా దివ్యశక్తి పరిశ్రమ నిర్వాహకులు పరిశ్రమ నుంచి వెలువడిన రసాయనాలతో కూడిన వ్యర్థపదార్థాలను పరిశ్రమ ఆవరణలో నిప్పంటించడం వల్ల చుట్టుపక్కల దట్టమైన పొగవస్తుందని, రోడ్డుపై వాహనాలు వెళ్లడానికి కూడా వీలుకావడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ నుంచి రాత్రి సమయంలో విడుదలవుతున్న దట్టమైన పొగవల్ల గ్రామాల్లో ఒకరికికొకరు కనిపించడం లేదంటున్నారు. పొగతో ఇళ్లముందు ఉన్న వస్తువులు కూడా నల్లగా మారుతున్నాయంటున్నారు. ఇలాగే కొనసాగితే ప్రజల జీవన మనుగడ అసాధ్యమేనంటున్నారు.
పొగవల్లనే దురదలు..
పరిశ్రమ నిర్వాహకులు రాత్రివేళల్లో వదిలే పొగవల్లనే ఇలా దురదలు వస్తున్నాయి. దురదల కారణంగా పిల్లలు రాత్రివేళల్లో నిద్ర కూడా పోవడం లేదు. ముఖ్యంగా కొందుర్గు శివారులోని దివ్యశక్తి పేపర్ పరిశ్రమ, కొందుర్గు స్కాన్ ఐరన్ పరిశ్రమ వారు వదులుతున్న పొగ ప్రభావం తీవ్రంగా ఉంది. కాలుష్యం నియంత్రించకుంటే ఇబ్బందులు తప్పవు. – సరిత, ఎంపీటీసీ, ఉత్తరాసిపల్లి
వస్తువులన్నీ మసిబారుతున్నాయి..
దివ్యశక్తి పరిశ్రమ నిర్వాహకులు రాత్రివేళల్లో వదులుతున్న పొగవల్ల ఇళ్ల ముందు ఉన్న వస్తువులన్నీ మసిబారుతున్నాయి. ఆహార పదార్థాలతోపాటు, కనీసం తాగే నీళ్లు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ విషయమై పలుసార్లు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – చంద్రశేఖర్, ఛత్రపతి యూత్ అధ్యక్షుడు కొందుర్గు
వీపును గోడకేసి రాస్తున్నాడు..
మా బాబుకు శరీరంపై మొత్తం దురద ఏర్పడి రాత్రివేళల్లో నిద్ర కూడా పోవడం లేదు. దురదకు భరించలేక వీపును గోడకేసి రాస్తున్నాడు. మా బాబుతోపాటు గ్రామంలో దాదాపు 20 మందికి పైనే ఇలాగే దురద పెట్టి శరీరమంతా దద్దుర్లు పోయాయి. రాత్రివేళల్లో గ్రామమంతా దట్టమైన పొగ కమ్ముకుంటుంది. ఈ పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. – సిద్దులూరి స్వర్ణలత, గంగన్నగూడ