odor
-
అంగన్వాడీ పాలల్లో పురుగులు
తాగలేమంటున్న గర్భిణులు, బాలింతలు కంబదూరు : అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న విజయ పాల ప్యాకెట్లలో పురుగులు ఉంటున్నాయి. దీంతో ప్యాకెట్ తెరవగానే పాలన్నీ కంపుకొడుతున్నాయని మండలంలోని ఓబుగానిపల్లి గ్రామానికి చెందిన గర్భిణులు, బాలింతలు వాపోయారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలోని రెండు అంగన్వాడీ కేంద్రాలకూ గత కొన్ని రోజులుగా సరఫరా చేస్తున్న విజయ పాలు 10 రోజులకే దుర్వసన వస్తున్నాయని దీంతో పాలు తాగలేక పోతున్నామన్నారు. అనేక మార్లు పాల విషయంపై ఐసీడీఎస్ సిబ్బందికి విన్నవించినా పట్టించుకోడం లేదని ఆరోపించారు. ఇలా అయితే ఎలా తాగాలని ప్రశ్నించారు. దీనిపై ఇన్చార్జ్ సీడీపీఓ హేమను వివరణ కోరగా.. పాలు మూడు నెలల పాటు నిల్వ ఉండలన్న ఉద్ధేశంతో పాలను ఎక్కువగా కాచీ ప్యాక్ చేస్తారని దీంతో ఆ పాలు తాగేటప్పుడు కొంత తేడాగా ఉంటాయని అంతే తప్ప పురుగులు ఉండటం, వాసన రావడం కానీ జరగదన్నారు. దీనిపై ఆరా తీస్తామని చెప్పారు. -
పొగచూరుతున్న బతుకులు
► దీనావస్థలో కొందుర్గు పరిసర గ్రామాలు ► రాత్రి వేళల్లో పరిశ్రమల వ్యర్థాలకు నిప్పు ► పరిశ్రమ వ్యర్థాలతో శరీరంపై దద్దుర్లు ► దట్టమైన పొగ, దుర్వాసనతో అల్లాడుతున్న జనం కొందుర్గు: కొందుర్గుతోపాటు పరిసర గ్రామాలైన గంగన్నగూడ, చెర్కుపల్లి, విశ్వనాథ్‌పూర్, చెక్కలోనిగూడ, తూంపల్లి తదితర గ్రామాలకు సంబంధించిన ప్రజలకు చర్మంపై విపరీతమైన దురద ఏర్పడి దద్దుర్లు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ దురద వల్ల వచ్చిన దద్దుర్లు ఎర్రగా ఏర్పడి మచ్చలుగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు వాడిన తగ్గడం లేదని.. ఇక చిన్నారులపై ఈ దురద ప్రభావం మరింత ఎక్కవగా చూపుతుందని పేర్కొంటున్నారు. పరిశ్రమల కాలుష్యం వల్లనే.. కొందుర్గు పరిసర ప్రాంతంలో ఉన్న దివ్యశక్తి పేపర్ పరిశ్రమ, స్కాన్ ఎనర్జీ పరిశ్రమ, బ్రిటానియా బిస్కెట్ పరిశ్రమ, దిలీప్ టెక్స్టైల్స్ తదితర పరిశ్రమల వల్ల వెలువడుతున్న కాలుష్యం వల్లనే తమకు ఈ దురదలు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మొదటగా చిన్న కురుపులుగా ఏర్పడి, పెద్దగా దద్దుర్లు వస్తున్నాయని అనంతరం మచ్చలుగా మారుతున్నాయని తెలిపారు. పరిశ్రమల నిర్వాహకులు పగలంతా వ్యర్థాలను నిల్వచేసి, రాత్రివేళల్లో విడుదల చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా దివ్యశక్తి పరిశ్రమ నిర్వాహకులు పరిశ్రమ నుంచి వెలువడిన రసాయనాలతో కూడిన వ్యర్థపదార్థాలను పరిశ్రమ ఆవరణలో నిప్పంటించడం వల్ల చుట్టుపక్కల దట్టమైన పొగవస్తుందని, రోడ్డుపై వాహనాలు వెళ్లడానికి కూడా వీలుకావడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ నుంచి రాత్రి సమయంలో విడుదలవుతున్న దట్టమైన పొగవల్ల గ్రామాల్లో ఒకరికికొకరు కనిపించడం లేదంటున్నారు. పొగతో ఇళ్లముందు ఉన్న వస్తువులు కూడా నల్లగా మారుతున్నాయంటున్నారు. ఇలాగే కొనసాగితే ప్రజల జీవన మనుగడ అసాధ్యమేనంటున్నారు. పొగవల్లనే దురదలు.. పరిశ్రమ నిర్వాహకులు రాత్రివేళల్లో వదిలే పొగవల్లనే ఇలా దురదలు వస్తున్నాయి. దురదల కారణంగా పిల్లలు రాత్రివేళల్లో నిద్ర కూడా పోవడం లేదు. ముఖ్యంగా కొందుర్గు శివారులోని దివ్యశక్తి పేపర్ పరిశ్రమ, కొందుర్గు స్కాన్ ఐరన్ పరిశ్రమ వారు వదులుతున్న పొగ ప్రభావం తీవ్రంగా ఉంది. కాలుష్యం నియంత్రించకుంటే ఇబ్బందులు తప్పవు. – సరిత, ఎంపీటీసీ, ఉత్తరాసిపల్లి వస్తువులన్నీ మసిబారుతున్నాయి.. దివ్యశక్తి పరిశ్రమ నిర్వాహకులు రాత్రివేళల్లో వదులుతున్న పొగవల్ల ఇళ్ల ముందు ఉన్న వస్తువులన్నీ మసిబారుతున్నాయి. ఆహార పదార్థాలతోపాటు, కనీసం తాగే నీళ్లు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ విషయమై పలుసార్లు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – చంద్రశేఖర్, ఛత్రపతి యూత్ అధ్యక్షుడు కొందుర్గు వీపును గోడకేసి రాస్తున్నాడు.. మా బాబుకు శరీరంపై మొత్తం దురద ఏర్పడి రాత్రివేళల్లో నిద్ర కూడా పోవడం లేదు. దురదకు భరించలేక వీపును గోడకేసి రాస్తున్నాడు. మా బాబుతోపాటు గ్రామంలో దాదాపు 20 మందికి పైనే ఇలాగే దురద పెట్టి శరీరమంతా దద్దుర్లు పోయాయి. రాత్రివేళల్లో గ్రామమంతా దట్టమైన పొగ కమ్ముకుంటుంది. ఈ పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. – సిద్దులూరి స్వర్ణలత, గంగన్నగూడ -
ఇంటిప్స్
కిచెన్ ప్లాట్‌ఫాం మీద కాని, స్టవ్ మీద కాని జిడ్డు మరకలుంటే ముందుగా కొద్దిగా నీళ్లు చల్లి సోడాబైకార్బనేట్ చల్లాలి. రెండు - మూడు నిమిషాల తర్వాత స్పాంజ్‌తో కాని క్లాత్‌తో కాని తుడవాలి. థర్మాస్ ఫ్లాస్కు లోపల వాసన వస్తుంటే ఒక టేబుల్ స్పూన్ సోడాబైకార్బనేట్ వేసి నిండా నీటిని పోయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగితే వాసనపోయి శుభ్రంగా ఉంటుంది. అవసరమనిపిస్తే బ్రష్‌తో రుద్దవచ్చు. కిచెన్‌లో అవెన్, స్టవ్, ప్లాట్‌ఫాం తుడిచే స్పాంజ్లు, బ్రష్‌లు కొద్దిరోజులు వాడిన తరవాత వాసన పట్టేస్తుంటాయి. వాటిని నీటిలో ఒక టేబుల్‌స్పూన్ సోడాబైకార్బనేట్, నాలుగు చుక్కల డిష్‌వాష్ లిక్విడ్ కలిపి రాత్రంతా నానబెట్టి శుభ్రం చేయాలి. {ఫిజ్‌ను శుభ్రం చేయాలంటే లీటరు నీటిలో కప్పు సోడా బైకార్బనేట్ కలిపి ఆ మిశ్రమంలో స్పాంజ్‌ను ముంచి లోపలి అరలన్నీ తుడవాలి. తరవాత మంచినీటిలో ముంచి పిండేసిన స్పాంజ్‌తో మరొకసారి తుడవాలి.స్టెయిన్లెస్ స్టీల్ సింకులో రెండు స్పూన్ల సోడా బైకార్బనేట్ చల్లి కొద్దిగా నీటిని చల్లి రుద్ది కడిగితే కొత్తదానిలా మెరుస్తుంది. పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి. -
ఇంటిప్స్
దోసెపిండి పులిసినట్టుగా అనిపించినప్పుడు కొద్దిగా గోధుమపిండిని కలిపితే... వాసన తగ్గడంతో పాటు దోసెలు రుచిగా వస్తాయి.ఉప్పులో కొద్దిగా నిమ్మరసం కలిపి తోమితే రాగి పాత్రలు కొత్త వాటిలా మెరుస్తాయి. బిస్కట్లు మెత్తబడకుండా ఉండాలంటే... వాటిని ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు వేయాలి. -
క్లోరిన్ గ్యాస్ లీక్
నాచారం: నాచారం స్నేహపురి కాలనీ వద్ద గల వాటర్ ట్యాంకులో బుధవారం సాయంత్రం జలమండలి క్వాలిటీ అనాలిసిస్ సిబ్బంది క్లోరిన్ చేస్తుండగా గ్యాస్ లీకైంది. ఇది చుట్టు పక్కలకు వ్యాపించింది. సిబ్బంది పరుగులు తీశారు. అక్కడే విధుల్లో ఉన్న నాచారం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజేష్ విషయం తెలుసుకుని ఆపడానికి ప్రయత్నించి తీవ్ర అస్వస్థతకు గుర య్యాడు. తీవ్ర ఘాటువాసన రావడంతో స్థానికులు... సమీపంలోని మీ సేవ సిబ్బంది పరుగులు తీశారు. అస్వస్థతకు గురైన కానిస్టేబుల్ రాజేష్‌ను బాపూజీ నర్సింగ్ హోంకు తరలించారు. కుమార్ అనే వ్యక్తి వాంతులు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జలమండలి ఏఈ ఉమాపతి, నాచారం అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఏఈ ఉమాపతి మాట్లాడుతూ తమకు తెలియకుండా క్వాలిటీ అనాలిసిస్ సిబ్బంది వచ్చారని తెలిపారు. క్లోరిన్ గ్యాస్‌ను నీటిలో కలుపుతారని... అది ప్రమాదకరమైంది కాదని వివరించారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన కానిస్టేబుల్‌ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సాయిజెన్ శేఖర్, పోతగాని గోపాల్ గౌడ్, వై. సత్యనారాయణ, అనుముల అశ్వత్థామరెడ్డి, మేడల మల్లిఖార్జున్ గౌడ్, గుండు రమేష్ గౌడ్, మహేష్ ఉన్నారు. ఆరు నెలలుగా మూత: గత ఆరు నెలలుగా నాచారం స్నేహపురికాలనీ వాటర్ ట్యాంక్‌లో నీరు లేక మూత పడి ఉంది. దీనిలో క్లోరినేషన్ చేస్తుండగా గ్యాస్‌లీకై ప్రమాదం సంభవించింది. -
ఆర్డీఓ మాటంటే లెక్కే లేదా...
సాక్షి, హన్మకొండ : ‘ మీరేం మనుషులయ్యా.. మీకు ముక్కులు లేవా... ఈ దుర్వాసన ఎలా భరిస్తున్నారంటూ కార్యాలయూనికి వచ్చే వారు నిత్యం ప్రశ్నిస్తున్నారు. విజృంభిస్తున్న దోమలు.... ముక్కుపుటలు పగిలిపోయేలా దుర్గంధం వంటి అనారోగ్యకర వాతావరణంలో పని చేయలేకపోతున్నాం. ఇక భరించే శక్తి మాకు లేదు. ఆర్డీఓ మాటంటే కూడా మీకు లెక్క లేదు.. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేయక తప్పదు.’ ఈ మాటలు సామాన్యులవి కాదు... మెజిస్టీరీయల్ అధికారాలు కలిగి ఉండే ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగుల ఆవేదన. జిల్లాలో ఎంతో మంది తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయనికి వస్తే.... ఇక్కడి ఉద్యోగులే సమస్యల వలయంలో చిక్కుకున్నారు. కార్పొరేషన్లో పేరుకుపోయిన మాముళ్ల సంస్కృతికి ఇంత కాలం సామాన్యులే ఇబ్బందిపడగా... ఇప్పుడు ఏకంగా ఆర్డీఓ స్థాయి అధికారులు, ఆ కార్యాలయ సిబ్బందికి సైతం తిప్పలు పడే పరిస్థితి తలెత్తింది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము పడుతున్న బాధలను రెవెన్యూ డివిజనల్ కార్యాలయ సిబ్బంది ఏకరువు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవన యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది గ్రీవెన్స్‌సెల్‌లో వ్యక్త పరిచిన ఆవేదన, ఆక్రోశం వారి మాటల్లోనే... ‘ఓ సామాన్యుడు ఇల్లు నిర్మించుకునేందుకు పర్మిషన్ కోసం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వస్తే... అధికారులు చాలా ఆంక్షలు పెడతారు. కానీ.. మ్యాక్స్‌కేర్ హాస్పిటల్, గ్రీన్‌బావర్చి రెస్టారెంట్ వంటి నిర్మాణాలకు డ్రెరుునేజీ, సెల్లార్ పార్కింగ్ లేకుండా ఎలా పర్మిషన్ ఇచ్చారు. హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ ఆస్పత్రికి కనీసం సెల్లార్ వెహికల్ పార్కింగ్ లేదు. హాస్పిటల్‌కు వచ్చే వెహికల్స్ అన్నీ ఆర్డీఓ కార్యాలయ గేటు ముందు పార్కింగ్ చేస్తున్నారు. పైగా కొంతమంది బడాబాబులు పేషెంట్లను పరామర్శించే క్రమంలో వారి వాహనాలు, బైక్‌లను ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో పార్కింగ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో సెల్లార్, వెయిటింగ్ రూంలు ఏర్పాటు చేయకపోవడంతో రోగుల బంధువులు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో కూర్చుని ఏడ్వడం, ఆహారం తినడం చేస్తూ వ్యర్థాలను ఇక్కడే పారవేస్తున్నారు. దీంతో కార్యాలయ ఆవరణ అపరిశుభ్రంగా మారుతోంది. మ్యాక్స్‌కేర్ ఆస్పత్రికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు మూత్ర విసర్జనకు ఆర్డీఓ కార్యాలయ ఆవరణను ఉపయోగించుకుంటున్నారు. గతంలో మునిసిపల్ సిబ్బంది, హాస్పిటల్ వారు కుమ్మక్కై ఆర్డీఓ కార్యాలయం నైరుతి మూల నుంచి ప్రహరీని కూలగొట్టి ఆస్పత్రి కోసం మురుగు కాల్వ నిర్మించారు. దీని వల్ల ఆస్పత్రి నుంచి వెలువడే వ్యర్థాలు, కెమికల్స్‌తో కార్యాలయం ఆవరణ దుర్గందభరితంగా మారింది. దోమలు విజృంభిస్తున్నాయి. మరోవైపు ఇటీవల ప్రారంభించిన గ్రీన్‌బావర్చి రెస్టారెంట్లో మిగిలిపోయిన బిర్యానీ, ఆయిల్, మాంసం అంతా ఆర్డీఓ కార్యాలయం గేటు వద్ద పేరుకుపోతుంది. దీనివల్ల భరించలేని దుర్గంధం వస్తోంది.ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మునిసిపల్ అధికారులను వరంగల్ ఆర్డీఓ గారు ఈ ఏడాది జులై 23న స్వయంగా సూచించారు. ఇప్పటివరకూ ఫలితం లేదు. ఇప్పటికైనా మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో వెహికల్ పార్కింగ్‌కు సెల్లార్ ఏర్పాటు చేసుకునేలా చూడాలి.. లేకుంటే సీజ్ చేయాలి.ఆర్డీఓ కార్యాలయం గుండా నిర్మించిన మురుగుకాల్వను వెంటనే మూసివేయాలి. గ్రీన్‌బావర్చి రెస్టారెంట్ వ్యర్థాల వల్ల దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి... మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకోకుంటే బుధవారం నుంచి ఆందోళనలు చేపడతాం.’ అని ఆర్డీ కార్యాలయ ఉద్యోగులు హెచ్చరించారు.