అంగన్‌వాడీ పాలల్లో పురుగులు
- తాగలేమంటున్న గర్భిణులు, బాలింతలు
కంబదూరు : అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న విజయ పాల ప్యాకెట్లలో పురుగులు ఉంటున్నాయి. దీంతో ప్యాకెట్ తెరవగానే పాలన్నీ కంపుకొడుతున్నాయని మండలంలోని ఓబుగానిపల్లి గ్రామానికి చెందిన గర్భిణులు, బాలింతలు వాపోయారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాలకూ గత కొన్ని రోజులుగా సరఫరా చేస్తున్న విజయ పాలు 10 రోజులకే దుర్వసన వస్తున్నాయని దీంతో పాలు తాగలేక పోతున్నామన్నారు. అనేక మార్లు పాల విషయంపై ఐసీడీఎస్ సిబ్బందికి విన్నవించినా పట్టించుకోడం లేదని ఆరోపించారు. ఇలా అయితే ఎలా తాగాలని ప్రశ్నించారు. దీనిపై ఇన్‌చార్జ్ సీడీపీఓ హేమను వివరణ కోరగా.. పాలు మూడు నెలల పాటు నిల్వ ఉండలన్న ఉద్ధేశంతో పాలను ఎక్కువగా కాచీ ప్యాక్ చేస్తారని దీంతో ఆ పాలు తాగేటప్పుడు కొంత తేడాగా ఉంటాయని అంతే తప్ప పురుగులు ఉండటం, వాసన రావడం కానీ జరగదన్నారు. దీనిపై ఆరా తీస్తామని చెప్పారు.