ఆర్డీఓ మాటంటే లెక్కే లేదా... | RDO office employees Concerns | Sakshi
Sakshi News home page

ఆర్డీఓ మాటంటే లెక్కే లేదా...

Published Tue, Aug 12 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

ఆర్డీఓ మాటంటే లెక్కే లేదా...

ఆర్డీఓ మాటంటే లెక్కే లేదా...

సాక్షి, హన్మకొండ : ‘ మీరేం మనుషులయ్యా.. మీకు ముక్కులు లేవా... ఈ దుర్వాసన ఎలా భరిస్తున్నారంటూ కార్యాలయూనికి వచ్చే వారు నిత్యం ప్రశ్నిస్తున్నారు. విజృంభిస్తున్న దోమలు.... ముక్కుపుటలు పగిలిపోయేలా దుర్గంధం వంటి అనారోగ్యకర వాతావరణంలో పని చేయలేకపోతున్నాం. ఇక భరించే శక్తి మాకు లేదు.

ఆర్డీఓ మాటంటే కూడా మీకు లెక్క లేదు.. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేయక తప్పదు.’ ఈ మాటలు సామాన్యులవి కాదు... మెజిస్టీరీయల్ అధికారాలు కలిగి ఉండే ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగుల ఆవేదన. జిల్లాలో ఎంతో మంది తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయనికి వస్తే.... ఇక్కడి ఉద్యోగులే సమస్యల వలయంలో చిక్కుకున్నారు.
 
కార్పొరేషన్‌లో పేరుకుపోయిన మాముళ్ల సంస్కృతికి ఇంత కాలం సామాన్యులే ఇబ్బందిపడగా... ఇప్పుడు ఏకంగా ఆర్డీఓ స్థాయి అధికారులు, ఆ కార్యాలయ సిబ్బందికి సైతం తిప్పలు పడే పరిస్థితి తలెత్తింది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము పడుతున్న బాధలను రెవెన్యూ డివిజనల్ కార్యాలయ సిబ్బంది ఏకరువు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన  భవన యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది గ్రీవెన్స్‌సెల్‌లో వ్యక్త పరిచిన ఆవేదన, ఆక్రోశం వారి మాటల్లోనే...
 
‘ఓ సామాన్యుడు ఇల్లు నిర్మించుకునేందుకు పర్మిషన్ కోసం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వస్తే... అధికారులు చాలా ఆంక్షలు పెడతారు. కానీ.. మ్యాక్స్‌కేర్ హాస్పిటల్, గ్రీన్‌బావర్చి రెస్టారెంట్ వంటి  నిర్మాణాలకు డ్రెరుునేజీ, సెల్లార్ పార్కింగ్ లేకుండా ఎలా పర్మిషన్ ఇచ్చారు. హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ ఆస్పత్రికి కనీసం సెల్లార్ వెహికల్ పార్కింగ్ లేదు. హాస్పిటల్‌కు వచ్చే వెహికల్స్ అన్నీ ఆర్డీఓ కార్యాలయ గేటు ముందు పార్కింగ్ చేస్తున్నారు. పైగా కొంతమంది బడాబాబులు పేషెంట్లను పరామర్శించే క్రమంలో వారి వాహనాలు, బైక్‌లను ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో పార్కింగ్ చేస్తున్నారు.
 
ఆస్పత్రిలో సెల్లార్, వెయిటింగ్ రూంలు ఏర్పాటు చేయకపోవడంతో రోగుల బంధువులు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో కూర్చుని ఏడ్వడం, ఆహారం తినడం చేస్తూ వ్యర్థాలను ఇక్కడే పారవేస్తున్నారు. దీంతో కార్యాలయ ఆవరణ అపరిశుభ్రంగా మారుతోంది. మ్యాక్స్‌కేర్ ఆస్పత్రికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు మూత్ర విసర్జనకు ఆర్డీఓ కార్యాలయ ఆవరణను ఉపయోగించుకుంటున్నారు. గతంలో మునిసిపల్ సిబ్బంది, హాస్పిటల్ వారు కుమ్మక్కై ఆర్డీఓ కార్యాలయం నైరుతి మూల నుంచి ప్రహరీని కూలగొట్టి ఆస్పత్రి కోసం మురుగు కాల్వ నిర్మించారు.
 
దీని వల్ల ఆస్పత్రి నుంచి వెలువడే వ్యర్థాలు, కెమికల్స్‌తో కార్యాలయం ఆవరణ దుర్గందభరితంగా మారింది. దోమలు విజృంభిస్తున్నాయి. మరోవైపు ఇటీవల ప్రారంభించిన గ్రీన్‌బావర్చి రెస్టారెంట్‌లో మిగిలిపోయిన బిర్యానీ, ఆయిల్, మాంసం అంతా ఆర్డీఓ కార్యాలయం గేటు వద్ద పేరుకుపోతుంది. దీనివల్ల భరించలేని దుర్గంధం వస్తోంది.ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మునిసిపల్ అధికారులను వరంగల్ ఆర్డీఓ గారు ఈ ఏడాది జులై 23న  స్వయంగా సూచించారు.

ఇప్పటివరకూ ఫలితం లేదు. ఇప్పటికైనా మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో వెహికల్ పార్కింగ్‌కు సెల్లార్ ఏర్పాటు చేసుకునేలా చూడాలి.. లేకుంటే సీజ్ చేయాలి.ఆర్డీఓ కార్యాలయం గుండా నిర్మించిన మురుగుకాల్వను వెంటనే మూసివేయాలి. గ్రీన్‌బావర్చి రెస్టారెంట్ వ్యర్థాల వల్ల దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి... మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకోకుంటే బుధవారం నుంచి ఆందోళనలు చేపడతాం.’ అని ఆర్డీ కార్యాలయ ఉద్యోగులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement