సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కొందుర్గులో ఇంటిగ్రేటేడ్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. వైద్య సదుపాయాలు కూడా మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామని తెలిపారు.
తెలంగాణ విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో టీచర్లలో అసహనం ఏర్పడిందన్న సీఎం.. ఈ ప్రభుత్వం 34 వేల మంది టీచర్లను బదిలీ చేసి, 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు.బదిలీలు, ప్రమోషన్ల విషయంలో చిన్న వివాదం కూడా లేకుండా పరిష్కరిస్తున్నామన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ పాలించిన పదేళ్లలో 10 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు సీఎం. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్.. ప్రభుత్వ పాఠశాలల్ని బాగుచేయలేదని విమర్శలు గుప్పించారు. పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతో బీఆర్‌ఎస్ సర్కార్ పనిచేసిందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ సర్కార్ 5 వేల పాఠశాలలను మూసివేసిందని ధ్వజమెత్తారు.
‘కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడికి పదవులు ఇచ్చారు. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేశారు. 1020 రెసిడెన్సియల్ స్కూల్స్‌లో కనీస వసతులు లేవు. టీచర్లతో పెట్టుకుంటే ఏమీ చేయరు కానీ.. పోలింగ్ రోజు బూత్‌లలో చేయాల్సింది చేస్తారు. బర్రెలు, గొర్రెలు ఇవ్వాలని కేసీఆర్ చూశారు కానీ ఉద్యోగాలు ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండుసున్నా వచ్చినా.. వాళ్ల బుద్ధి మారలేదని విమర్శించారు.ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment