space junk
-
అంతరిక్ష చెత్త.. అమాంతం పైపైకి
మానవ, పారిశ్రామిక వ్యర్థాలతో అవనిపై అమాంతం పెరుగుతున్న చెత్తకొండలతో ఎంతో ముప్పు పరిణమిస్తోంది. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోనూ చెత్త పేరుకుపోతోంది. భూమిపై వ్యర్థాలను పునశ్శుద్ధి కర్మాగారాల ద్వారా అయినా కాస్తంత వదిలించుకోవచ్చుగానీ అంతరిక్ష చెత్తలోని నట్లు, బోల్ట్‌లు, ఇతర భాగాలు అలాగే పేరుకుపోయి కొత్త కృత్రిమ ఉపగ్రహాలకు ‘అంతరిక్ష బాంబుల్లా’ తయారయ్యాయి. పాడైపోయిన పాత ఉపగ్రహాల శిథిలాల స్పేస్‌జంక్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రయోగాలకు పెద్ద అవరోధంగా మారింది. పేలిపోయిన ఇంటెల్‌శాట్ 33ఇ యూరప్, మధ్య ఆఫ్రికా, పశి్చమాసియా, ఆ్రస్టేలియా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలందిస్తున్న ఇంటెల్‌శాట్ 33ఇ ఉపగ్రహం నాలుగు రోజుల క్రితం పనిచేయడం మానేసింది. 2016 ఆగస్ట్‌లో బోయింగ్ సంస్థ ఈ శాటిలైట్‌ను డిజైన్ చేసింది. పనిచేయడం మానేసిన కొద్దిసేపటికే అది పేలి 20 ముక్కలుగా కక్ష్యలో చెల్లాచెదురుగా పడిందని యూఎస్ స్పేస్ ఫోర్సెస్ స్పేస్(ఎస్4ఎస్) సంస్థ ధృవీకరించింది. ఇలా అనూహ్యంగా ఉపగ్రహాలు అంతరిక్ష చెత్తలా మారితే సమీప ఉపగ్రహాలకు మరణశాసనం రాసినట్లే. శాటిలైట్ ముక్కలు వేగంగా భ్రమిస్తూ కక్ష్యదాటి సమీప శాటిలైట్లను ఢీకొట్టి వాటికి భారీ నష్టం చేకూరుస్తాయి. దీంతో ఇతర శాటిలైట్లు కూడా పాడయ్యే ప్రమాదముంది. ఇలా గొలుసుచర్య జరిగితే పెద్ద ఉపద్రవమే సంభవిస్తుంది. అక్కడ సమీప శాటిలైట్లన్నీ ధ్వంసమై భూమిపై సమాచార, ప్రసార వ్యవస్థలు స్తంభించిపోతాయి. భవిష్యత్తులో ఆ ఎత్తుల్లోని ఆ కక్ష్యలను కొత్త ఉపగ్రహాల కోసం వాడుకోలేని పరిస్థితి దాపురిస్తుంది. భూమి నుంచి కొంత పరిధిలోని ఎత్తుల్లో మాత్రమే శాటిలైట్లను ప్రవేశపెట్టగలం. అవి మాత్రమే మానవాళి అవసరాలకు పనికొస్తాయి. సుదూరాల్లో శాటిలైట్లను ప్రవేశపెట్టలేం. అందుబాటులో ఉన్న కక్ష్యలను అన్ని దేశాలకు అత్యంత విలువైన అంతరిక్ష వనరులుగా చెప్పొచ్చు. ఇప్పుడీ అంతరిక్ష చెత్తతో ఆ వనరులను భవిష్యత్తులో మానవుడు ఉపయోగించుకోలేని దురవస్థ రావొచ్చు. ఎందుకిలా జరుగుతోంది? సౌర తుపాన్లు ఇందుకు కారణంగా భావిస్తున్నారు. శక్తివంతమైన సౌర తుపాన్ల ధాటికి శాటిలైట్ల పనితీరు దెబ్బతిని అవి నియంత్రణ కోల్పోతున్నాయి. గతంలోనూ ఇలా కొన్ని శాటిలైట్లు హఠాత్తుగా పనిచేయడం ఆగిపోవడం, కొన్ని ఢీకొనడం, ఇంకొన్ని నియంత్రణ పరిధి ఆవలికి వెళ్లిపోవడం జరిగాయి. లక్షలాది ముక్కలు యూరోపియన్ స్పేస్‌ఏజెన్సీ గణాంకాల ప్రకారం 10 సెంటీమీటర్లకన్నా పెద్ద పరిమాణంలో ఉన్న ముక్కలు 40,000దాకా అంతరిక్షంలో పోగుబడ్డాయి. ఇక 1 సెంటీ మీటర్ కన్నా చిన్నసైజు ముక్కలు 13 కోట్లదాకా ఉంటాయని తెలుస్తోంది. మనిషి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాలు, రాకెట్ల కారణంగా అంతరిక్షంలో దాదాపు 13,000 టన్నుల మేర చెత్త పేరుకుపోయింది. ఇది 90 భారీ తిమింగలాల బరువుతో సమానం. ఇందులో 4,300 టన్నుల చెత్త కేవలం రాకెట్ నుంచి విడిపోయిన విడిభాగాల కారణంగా పోగుబడింది. తాజాగా ముక్కలైన ఇంటెల్‌శాట్ 33ఈ ఉపగ్రహం ఏకంగా 35,000 కి.మీ.ల ఎత్తులో పరిభ్రమించేది. ఇంత దూరంలో ఉన్న ముక్కలను లెక్కబెట్టడం కూడా చాలాకష్టం. ఈ ఏడాది జూన్‌లో రెసర్స్–పీ1 ఉపగ్రహం 480 కి.మీ.ల ఎత్తులో భూ దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ హఠాత్తుగా బద్దలై 100 ముక్కలైంది. తిరిగే క్రమంలో ఇవి మరింతగా ముక్కలై చిన్నవిగా సమస్యను మరింత జఠిలతరం చేస్తాయి. జూలైలో గడువు ముగిసిన రక్షణ, వాతావరణరంగ 5డీ–2ఎఫ్8 వ్యోమనౌక ముక్కలైంది. ఆగస్ట్‌లో లాంగ్‌మార్చ్6ఏ(సీజెడ్–6ఏ) రాకెట్ సైతం చిధ్రమైంది. అందుబాటులోకి డీకమిషన్ ఆధునిక సాంకేతికత చెత్త మరీ ఎక్కువగా పేరుకుపోకుండా ఏదైనా శాటిలైట్ జీవితకాలం ముగుస్తుందనిపించిన వెంటనే దానిని సురక్షితంగా భూకక్ష్యలోకి తీసుకొచ్చి మహాసముద్రాల్లో పడేసే ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచి్చంది. గతంలో స్కైల్యాబ్ వంటి ఘటనలతో జనం బెంబేలెత్తిపోయినా ఇప్పుడా పరిస్థితి లేదనే చెప్పాలి. గత నెలలో యురోపియన్ స్పేస్ ఏజెన్సీ క్లస్టర్–2 సల్సా శాటిలైట్‌ను ఇలాగే జాగ్రత్తగా డీకమిషన్ చేశారు. భారీ వస్తువును అంతరిక్షంలోకి పంపితే అంతమేర చెత్తను పంపినట్లు లెక్కించాలి. దశాబ్దాలపాటు సేవలందించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఒకవేళ కక్ష్యలో ముక్కలైతే 22 కోట్ల ముక్కలుగా మారుతుందని ఓ అంచనా. అందుకే దీనిని సురక్షితంగా లాగుడుబండి లాంటి వ్యోమనౌకతో లాక్కొచ్చి మహాసముద్రంలో పడేయాలని అమెరికా ఇప్పటికే ఒక భారీ ప్రణాళిక సిద్దంచేసింది. ఈ బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ ప్రైవేట్ అంతరిక్షసంస్థకు అప్పజెప్పింది. తొలగించాల్సిన బాధ్యత ఎవరది? ఏ దేశానికి చెందిన శాటిలైట్ ముక్కలైతే వాటిని తొలగించాల్సిన బాధ్యత కూడా ఆ దేశానిదే. అంతరిక్ష వస్తువుల కారణంగా చెత్తగా మారిన కక్ష్యలను మళ్లీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 1972లో అంతర్జాతీయ ఒప్పందం చేసుకున్నారు. అయితే అంతరిక్ష చెత్త పెరగడానికి కారకులయ్యారంటూ తొలిసారిగా గత ఏడాది మాత్రమే జరిమానా విధించారు. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఈ జరిమానా విధించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షంలో వ్యర్థాలు, ఆ శాటిలైట్లు భూమిపై దొర్లకుండా..
అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్త వివిధ దేశాలకు సవాల్ విసురుతోంది. టెక్నాలజీ పరంగా ఎదిగేందుకు అంతరిక్షంలో పంపించిన శాటిలైట్లలో కొన్ని డెబ్రిస్(చెత్త)గా మారాయి. ప్రపంచ దేశాలు పోటీపడి మరీ పంపిస్తున్న శాటిలైట్లతో అంతరిక్షంలో ట్రాఫిక్ పెరిగిపోతోంది. కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల శిథిలాలతో అంతరిక్షం చెత్తకుప్పగా మారిపోతోంది. అంతరిక్షంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ప్రయోగాలకు కొన్నిసార్లు అంతరాయం ఏర్పడుతుంది. యూఎస్ స్పేస్ కమాండ్ అంచనా ప్రకారం భూమి చుట్టూ దాదాపు 25వేలఅంతరిక్ష వ్యర్ధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని శిథిలాలు భూమిపైకి చేరతున్నాయి.మరోపక్క అంతరిక్ష వ్యర్థాలు విచ్ఛిన్నమై రేణువుల్లా విడిపోయి అంతరిక్ష కక్ష్యను కలుషితం చేస్తున్నాయి. ఇవికాకుండా రాకెట్ల నుంచి రాలిపడిన మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షం చుట్టూ పేరుకుపోయాయి. దీనివల్ల అంతరిక్షంలో డెబ్రిస్ (చెత్త)తో నిండిపోతుంది. అనేక శాటిలైట్లు పాడైన స్థితిలో శిధిలాలుగా మారి అంతరిక్షంలో భూకక్ష్య చుట్టూ ప్రమాదకర వేగంతో తిరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒక శిథిలం భూమి వైపు దూసుకొస్తోంది. అది నేలపై పడటమో లేదా వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడమో జరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష శిథిలాల సంఖ్య లక్షకు పైగా పెరుగుతుందని అంచనా. సాదారణంగా రెండు ఉపగ్రహాలు ఢీకొన్నప్పుడు కెస్లర్ సిండ్రోమ్ అని పిలువబడే ఘర్షణ ఏర్పడి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటీవల క్యూబ్‌శాట్ Exo-0 అని పిలువబడే ఎయిర్‌బస్ పరికరాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. ఇది కాలం చెల్లిన ఉపగ్రహాలు భూమిపైకి దొర్లకుండా నిరోధిస్తుంది. దీని ద్వారా పనిచేయని ఉపగ్రహాలు భూమిపైకి దొర్లకుండా ఒక అయస్కాంత శక్తితో అడ్డుకుంటుంది. ఈ ఎయిర్‌బస్ పరికరం సింపుల్‌గా మోటార్‌ను పోలి ఉంటుంది. ఇది మ్యాగ్నటిక్ ఫీల్డ్‌తో పనిచేస్తుంది. రోటార్ మూవ్‌మెంట్‌ను బట్టి ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఇది శాటిలైట్ తిరిగే దశను కదలనీయకుండా ఉంచుతుంది. దీనివల్ల ఉపగ్రహాలు నేలపై పడటం వంటిది జరగదు. -
ప్రపంచదేశాలకు ‘చెత్త’ సవాల్.. ఆకాశం కూడా ఆగమాగం.. ఏంటీ పరిస్థితి?
భూగోళాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ‘చెత్త’. నానాటికీ పెరుగుతున్న వ్యర్థాలను వదిలించుకునేందుకు చాలా దేశాలు పెద్ద కసరత్తే చేస్తున్నాయి. కాగా.. ఇదే సందర్భంలో అంతరిక్షంలోనూ పేరుకుపోతున్న చెత్త వివిధ దేశాలకు సవాల్ విసురుతోంది. ప్రస్తుతం రోదసీలో 3,409 శాటిలైట్లు చెత్తగా మారిపోయాయి. ఇవికాకుండా దాదాపు 34 వేల స్పేస్ జంక్ ముక్కలు, మిలియన్ల కొద్దీ చిన్నపాటి ముక్కలు అంతరిక్షాన్ని కమ్మేశాయి. 2030 నాటికి రోదసీలో ఉండే శాటిలైట్ల సంఖ్య 58 వేలకు దాటిపోవచ్చని అంచనా. దీనివల్ల గగనతలం భవిష్యత్‌లో పెద్ద ముప్పునే ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, అమరావతి అంతరిక్ష ప్రయోగాలు మానవాళి చరిత్రను సమూలంగా మార్చేశాయి. ఉపగ్రహాల (శాటిలైట్స్) వినియోగంతో టీవీ, ఫోన్, ఇంటర్నెట్, జీపీఎస్ తదితర సేవలతో పాటు ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను ముందే పసిగట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్క క్లిక్‌తో సమస్త సమాచారాన్ని అరచేతిలో చూడగలుగుతున్నాం. ఇదంతా శాటిలైట్స్ వల్లే సాధ్యమైంది. సోవియట్ యూనియన్ 1957 అక్టోబర్ 4న స్పుతి్నక్ శాటిలైట్ ప్రయోగంతో అంతరిక్ష యుగం మొదలైంది. వివిధ దేశాల ఆధ్వర్యంలో మాత్రమే శాటిలైట్ ప్రయోగాలు కొనసాగగా.. ఇటీవల ప్రైవేట్ కంపెనీలు సైతం ఈ రంగంలోకి ప్రవేశించాయి. ఐక్యరాజ్య సమితి ఔ టర్ స్పేస్ అఫైర్స్ విభాగం లెక్కల ప్రకారం 2022 జనవరి నాటికి భూమి చుట్టూ 8,261 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ‘ఆర్యభట్ట’. 1975 ఏప్రిల్ 19న ఆర్యభట్టతో మొదలుపెట్టిన భారత్ ఇప్పటివరకు సుమారు 180 శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపించింది. ఇవికాక సుమారు 38 దేశాలకు చెందిన 350కి పైగా శాటిలైట్లను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మనదేశ శాటిలైట్లలో 40 వరకు సేవలందిస్తుండగా.. మిగిలినవి విశ్వంలో నిరుపయోగంగా ఉన్నాయి. నాణేనికి రెండో వైపు.. ప్రపంచ దేశాలు పోటీపడి మరీ పంపిస్తున్న శాటిలైట్లతో అంతరిక్షంలో ట్రాఫిక్ పెరిగిపోతోంది. కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల శిథిలాలతో గగనతలం చెత్తకుప్పగా మారిపోతోంది. యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్ (యూసీఎస్) లెక్కల ప్రకారం స్పేస్‌లో ఉన్న మొత్తం 8,261 శాటిలైట్లలో ప్రస్తుతం 4,852 మాత్రమే సేవలందిస్తున్నాయి. మిగిలిన 3,409 శాటిలైట్లు నిరుపయోగమై వ్యర్థాలుగా మారిపోయాయి. ఇవికాకుండా రాకెట్ల నుంచి రాలిపడిన దాదాపు 34 వేల స్పేస్ జంక్ ముక్కలు (10 సెం.మీ కంటే పెద్దవి), మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షం చుట్టూ పేరుకుపోయాయి. ఇటీవల అమెజాన్, స్పేస్–ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు అంతరిక్షంలోకి అడుగుపెట్టి శాటిలైట్ల ప్రయోగాలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల 2030 నాటికి రోదసీలో శాటిలైట్ల సంఖ్య 58 వేలకు పైగా దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అంతరిక్షంలో స్పేస్ ట్రాఫిక్ పెరిగిపోవడంతోపాటు డెబ్రిస్ (చెత్త)తో నిండిపోతుందని అంచనా. పెనుసవాల్.. స్పేస్ జంక్ అంతరిక్షంలో ఉపగ్రహాలు తిరిగే వృత్తాకార మార్గాన్ని కక్ష్య (ఆర్బిట్) అంటారు. శాటిలైట్స్‌ను మూడు రకాల ఆర్బిట్స్‌లో ఉంచుతారు. ఇవి భూమి నుంచి 300కి.మీ. వరకు లోయర్ ఆర్బిట్, 700–1,000 కి.మీ వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఆర్బిట్స్, 36 వేల కి.మీ. జియో సింక్రనస్ ఆర్బిట్ (కమ్యూనికేషన్ శాటిలైట్స్) ఉంటాయి. ఏటా వందల సంఖ్యలో శాటిలైట్లను కక్ష్యల్లోకి పంపుతుండటంతో వాటి మధ్య దూరం తగ్గిపోయి స్పేస్ ట్రాఫిక్ ఏర్పడుతోంది. దీంతో కొత్త ఉపగ్రహాలను పంపేటప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్షంలో రాకెట్ పరికరాల శిథిలాలను స్పేస్ డెబ్రిస్ అంటారు. ఎక్కువ అంతరిక్ష శిథిలాలు 600–700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయి. సాఫ్ట్‌బాల్ పరిమాణంలో 34 వేల స్పేస్ డెబ్రిస్ శిథిలాలు ఉన్నాయని, ఒక మిల్లీమీటర్ కంటే పెద్ద పరిమాణంలో 128 మిలియన్ల శిథిలాలు ఉన్నాయని నాసా ప్రకటించింది. ప్రతి 10 వేల శిథిలాలలో ఒకటి ప్రమాదానికి కారణమవుతుందని అంచనా వేసింది. ఇలాంటి శిథిలాలు 1999 నుంచి ఇప్పటిదాకా 25 ఐఎస్ఎస్ను తాకినట్టు స్పేస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మరోపక్క అంతరిక్ష వ్యర్థాలు విచ్ఛిన్నమై రేణువుల్లా విడిపోయి అంతరిక్ష కక్ష్యను కలుíÙతం చేస్తున్నాయి. ఈ వ్యర్థ రేణువుల్లో కొన్ని గంటకు 40 వేల కి.మీ. వేగంతో భూకక్ష్య వైపు దూసుకొస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు అంతర్జాతీయ కమిటీ వాస్తవానికి అంతరిక్ష వ్యర్థాల్లో మూడింటి ఒక భాగం అమెరికా, రష్యాలవే. వేల కి.మీ. వేగంతో తిరుగుతున్న డెడ్ శాటిలైట్లు, రాకెట్ శిథిలాలను తొలగించడం కత్తిమీద సాములా మారింది. దీంతో అమెరికా వివిధ దేశాల స్పేస్ శాస్త్రవేత్తలతో 1993లో ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కో–ఆర్డినేషన్ కమిటీని నియమించింది. ఐక్యరాజ్య సమితి 1959లోనే ‘ఔటర్ స్పేస్ శాంతియుత ఉపయోగాల కమిటీ’ (యూఎన్–సీఓపీయూఓఎస్)ని నియమించింది. ఈ రెండు కమిటీల్లోనూ భారత్ ప్రారంభ సభ్యదేశంగా ఉంది. ఈ కమిటీల్లోని శాస్త్రవేత్తలు అంతరిక్ష శిథిలాల తొలగింపుపై ఓ నివేదికను రూపొందించాయి. దీనిప్రకారం అధునాతన రాడార్లు, టెలిస్కోపులను ఉపయోగించి అంతరిక్ష వ్యర్థాలను పసిగట్టి ముందస్తు హెచ్చరికలు చేస్తుంటారు. కాలం చెల్లిన శాటిలైట్లను కక్ష్య నుంచి తప్పించి భూ వాతావరణంలోకి తెచ్చే యోచన జరుగుతోంది. స్పేస్ డెబ్రిస్‌ను తొలగించే యంత్రాంగం ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం వద్దా లేదు. – ఎంవైఎస్ ప్రసాద్, మాజీ డైరెక్టర్, షార్ ‘నాసా’ ట్రాక్ చేస్తోంది స్పేస్‌లోకి వెళ్లిన ప్రతి వస్తువుకు పొజిషనింగ్ నంబర్ ఇచ్చి వాటి కదలికలను అనుక్షణం ‘నాసా’ ట్రాక్ చేస్తోంది. దీనినే స్పేస్ సర్వేలెన్స్ నెట్వర్క్ ట్రాకింగ్ అంటారు. నాసా అంచనా ప్రకారం ప్రతిరోజూ ఒక శిథిలం భూమి వైపు దూసుకొస్తోంది. అది నేలపై పడటమో లేదా వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడమో జరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష శిథిలాల సంఖ్య లక్షకు పైగా పెరుగుతుందని, ఇవి ట్రాక్ చేయడానికి చిన్నవే అయినా అంతరిక్ష నౌకను దెబ్బతీసేంత పెద్దవని యూఎస్ మిలటరీ సైతం ప్రకటించింది. అంతరిక్ష యాత్రకు ప్రాణాంతకం లేదా విపత్తు కలిగించే వేల వస్తువులు, నష్టాన్ని కలిగించేంత సామర్థ్యం గలవి మిలియన్ల కొద్దీ ఉన్నాయని అంచనా వేసింది. జియో సింక్రనస్ ఆర్బిట్‌లో భారీ బరువుండే ఉప గ్రహాలుంటాయి. ఈ ఆర్బిట్‌లోని పనికిరాని శాటిలైట్లను పైస్థాయికి పంపేస్తారని.. ఇక్కడ డెబ్రిస్‌ని అంచనా వేయలేమని ‘షార్’ మాజీ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ చెప్పారు. అయితే, అధిక ‘డెడ్ శాటిలైట్లు’, శిథిలాలు 600–700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయని, ఇవే ప్రధాన సమస్య అని ఆయన స్పష్టం చేశారు. -
రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే..
వాషింగ్టన్: భూమిపై నుంచి అంతరిక్షానికి రాకెట్ ప్రయోగాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ప్రతి సంవత్సరం ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలను పంపిస్తున్నాయి. అంతరిక్షాన్ని శోధించడానికి పరికరాలను పంపడమూ ఎక్కువైంది. ఈ రంగంలోకి ప్రైవేట్ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. మరి గగనవీధిలోకి పంపించిన ఉపగ్రహాలు, పరికరాలు ఏమవుతున్నాయి. పని కాలం ముగిసిన తర్వాత అవి అక్కడే పేలిపోయి, వ్యర్థాలుగా మారుతున్నాయి. కొన్ని పుడమి మీదకు ప్రచండ వేగంతో దూసుకొస్తుంటాయి. గ్రహ శకలాలూ భూమిపై పడుతుంటాయి. అంతరిక్ష చెత్తగా పిలిచే ఇలాంటి వ్యర్థాల కారణంగా రానున్న రోజుల్లో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ ఉపగ్రహాల శకలాలు, సంబంధిత అంతరిక్ష చెత్త భూమిపై పడి మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్న దుర్ఘటనలు సంభవించినట్లు ఇప్పటికైతే దాఖలాలు లేవు. కానీ, వేలాది సంవత్సరాల క్రితం గ్రహశకలాలు ఢీకొట్టడం వల్లే రాక్షస బల్లులు అంతరించిపోయాయని చరిత్రకారులు, శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అంతరిక్ష చెత్త వల్ల మనుషుల ప్రాణాలు పోవడం అనేది నమ్మశక్యంగా లేనప్పటికీ మరో పదేళ్లలో ఈ ప్రమాదాలు జరిగి అవకాశాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం ఫలితాలు ‘నేచర్ ఆస్ట్రానమీ’ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. దక్షిణ అక్షాంశంలో ప్రమాదం అధికం పనిచేయని ఉపగ్రహాలు సైతం వాటి కక్ష్యలో నిరంతరం తిరుగుతూ ఉంటాయి. వాటిలోని ఇంధనం, బ్యాటరీల్లో పేలుడు ఘటనలతో ముక్కలు చెక్కలవుతాయి. అతి సూక్ష్మ శకలాలుగా విడిపోతాయి. వాటిలో కొన్ని భూమ్యాకర్షణ శక్తిని లోనై మనవైపు దూసుకొస్తాయి. భారీ గ్రహశకలాలు భూమిని ఢీకొడితే ఊహించలేనంత నష్టం వాటిల్లుతుంది. సహజ అంతరిక్ష చెత్తగా వ్యవహరించే గ్రహశకలాలు అరుదుగా గానీ భూమివైపునకు దూసుకురావు. సమస్యంతా కృత్రిమ అంతరిక్ష చెత్తతోనే. అంటే ఉపగ్రహాలు, రాకెట్లు. వీటి ముప్పును అంచనా వేయడానికి అధునాతన గణిత శాస్త్ర విధానాలను ఉపయోగించారు. ఉత్తర ఆకాంశంతో పోలిస్తే దక్షిణ అక్షాంశంలోనే అంతరిక్ష చెత్త ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. న్యూయార్క్, బీజింగ్, మాస్కోలతో పోలిస్తే జకార్తా, ఢాకా, లాగోస్‌లో మూడు రెట్లు ఎక్కువ ప్రాణాపాయమని అధ్యయనంలో తేలింది. రాకెట్లు, ఉపగ్రహాల నుంచి ఊడిపడే శకలం భూమిపై పది చదరపు మీటర్ల మేర పరిధిలో ప్రభావం చూపిస్తుంది. అక్కడ ఒకరు లేదా ఇద్దరు మరణించేందుకు 10 శాతం ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్ష చెత్త భూమిపైకి రాకుండా నిరోధించవచ్చని అంటున్నారు. అది చాలా ఖరీదైన వ్యవహారమని అభిప్రాయపడుతున్నారు. -
కలప ఉపగ్రహం.. ఎందుకంటే?
కలపేంటి? ఉపగ్రహమేంటి? ఇదేదో కొయ్యగుర్రంలాంటిదేమో అనుకుంటున్నారా? కానే కాదు. ఒకసారి అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత మిగిలిన ఉపగ్రహాల మాదిరిగానే పూర్తిస్థాయిలో పనిచేయగల అసలు సిసలు ఉపగ్రహం. ఇప్పటి వరకు ఉపగ్రహాలను అల్యూమినియం వంటి లోహాలు, ప్లాస్టిక్ తదితర పదార్థాలతో తయారు చేస్తూ వస్తున్నారు. ఇవి తిరిగి నేలకు చేరుకున్నా, వీటి వ్యర్థాలను పర్యావరణానికి చేటు కలిగించకుండా నిర్మూలించడం ఒక పట్టాన సాధ్యమయ్యే పనికాదు. అలాగే, ఇవి అంతరిక్షంలోనే చక్కర్లు కొడుతూ మిగిలిపోయినా ఇబ్బందే! ఇప్పటికే చాలా ఉపగ్రహ వ్యర్థాలు అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నాయి. వీటినే ‘స్పేస్‌జంక్’ అంటున్నారు. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఉండేందుకే జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ, సుమిటిమో ఫారెస్ట్రీ నిపుణులు కలపతో ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇందులో అత్యవసరమైన కొద్ది భాగాలను మాత్రమే అల్యూమినియంతో తయారు చేసినవి అమర్చారు. దీనిని 2023లో అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రపంచంలోనే ఇది తొలి కలప ఉపగ్రహం. నిర్దేశించిన పని పూర్తి చేసుకున్నాక, ఇది భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే కాలి బూడిదైపోతుంది. కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. చదవండి: వైరల్‌గా మత్స్యకన్య ‘మెసేజ్’ -
అంతరిక్ష వ్యర్థాలతో దేశాల మధ్య యుద్ధం!
మాస్కో: అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలు(స్పేస్ జంక్)తో కొత్త ప్రమాదాలు ముంచుకొస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలకు సైతం దారితీయొచ్చని మాస్కోలోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలి కాలంలో అమెరికా, రష్యా స్పేస్ ఏజెన్సీలు గుర్తించినటువంటి అంతరిక్ష వ్యర్థాలలో 10 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్నటువంటి శిథిలాలను సైతం వేల సంఖ్యలో గమనించారు. వివిధ దేశాలు పంపినటువంటి శాటిలైట్లను ఇవి ఢీ కొన్నప్పుడు వాటికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఒకవేళ ఏదైనా దేశం పంపిన ముఖ్యమైన మిలిటరీ శాటిలైట్ ఈ అంతరిక్ష వ్యర్థాల ద్వారా ధ్వంసమైతే.. ప్రత్యర్థి దేశాల వారు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భావించే అవకాశం ఉందని, ఇది దేశాల మధ్య యుద్ధాలకు సైతం కారణం కాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గతంలో.. చైనా తమ దేశానికి చెందిన కాలం చెల్లిన ఓ వాతావరణ శాటిలైట్‌ను 2007లో ధ్వంసం చేసింది. దీని ద్వారా మూడు వేలకు పైగా శిథిలాలు అంతరిక్షంలో మిగిలిపోయాయి. 2013లో రష్యాకు చెందిన బ్లిట్స్ శాటిలైట్ అంతరిక్ష వ్యర్థాలు ఢీ కొనడం ద్వారా ధ్వంసమైంది. అయితే చైనా శాటిలైట్ ధ్వంసంలో ఏర్పడిన శిథిలాలే తమ శాటిలైట్ ధ్వంసానికి కారణమని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలోని భూ కక్ష్యలో పెరిగిపోతున్న శిథిలాలు దేశాల మధ్య చిచ్చురేపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.