అంతరిక్ష వ్యర్థాలతో దేశాల మధ్య యుద్ధం!
మాస్కో: అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలు(స్పేస్ జంక్)తో కొత్త ప్రమాదాలు ముంచుకొస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలకు సైతం దారితీయొచ్చని మాస్కోలోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలి కాలంలో అమెరికా, రష్యా స్పేస్ ఏజెన్సీలు గుర్తించినటువంటి అంతరిక్ష వ్యర్థాలలో 10 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్నటువంటి శిథిలాలను సైతం వేల సంఖ్యలో గమనించారు.
వివిధ దేశాలు పంపినటువంటి శాటిలైట్లను ఇవి ఢీ కొన్నప్పుడు వాటికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఒకవేళ ఏదైనా దేశం పంపిన ముఖ్యమైన మిలిటరీ శాటిలైట్ ఈ అంతరిక్ష వ్యర్థాల ద్వారా ధ్వంసమైతే.. ప్రత్యర్థి దేశాల వారు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భావించే అవకాశం ఉందని, ఇది దేశాల మధ్య యుద్ధాలకు సైతం కారణం కాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
గతంలో.. చైనా తమ దేశానికి చెందిన కాలం చెల్లిన ఓ వాతావరణ శాటిలైట్ను 2007లో ధ్వంసం చేసింది. దీని ద్వారా మూడు వేలకు పైగా శిథిలాలు అంతరిక్షంలో మిగిలిపోయాయి. 2013లో రష్యాకు చెందిన బ్లిట్స్ శాటిలైట్ అంతరిక్ష వ్యర్థాలు ఢీ కొనడం ద్వారా ధ్వంసమైంది. అయితే చైనా శాటిలైట్ ధ్వంసంలో ఏర్పడిన శిథిలాలే తమ శాటిలైట్ ధ్వంసానికి కారణమని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలోని భూ కక్ష్యలో పెరిగిపోతున్న శిథిలాలు దేశాల మధ్య చిచ్చురేపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.