అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్–ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్–ఉన్ శిఖరాగ్ర సమావేశం మొదలుకావడానికి ముందే యావత్ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తోంది. తటస్థ వేదిక సింగపూర్‌లో మంగళవారం ప్రారంభం కానున్న ఈ భేటీ ఆశించిన ఫలితాలు సాధించి చరిత్ర సృష్టిస్తుందా? లేక విఫలమై ప్రపంచదేశాల్లో అణు ఉద్రిక్తతలకు దారితీస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అణ్వాయుధాల వినియోగం, వ్యాప్తి నిరోధానికి తాను ‘శాంతి యాత్ర’కు వెళుతున్నట్టు సింగపూర్‌కు బయలుదేరే ముందు ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల అధ్యక్షుల మధ్య జరగనున్న ఈ ఉన్నతస్థాయి సమావేశం దశ,దిశ ఏమిటన్నది ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇరువురు నేతల అంతుచిక్కని స్వభావాలను పరిశీలిస్తే మాత్రం ఈ భేటీ అనూహ్యంగానే ముగుస్తుందనే ఊహాగానాలు సాగుతున్నాయి.
అమెరికా –ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య జరగనున్న మొట్టమొదటి సమావేశంగా ఇది చరిత్రకు ఎక్కనుంది. ఈ రెండు దేశాల నేతలు కనీసం ఫోన్‌లో కూడా నేరుగా సంభాషించిన సందర్భాలు ఇప్పటివరకు లేవు. సంప్రదాయ బద్ధ శిఖరాగ్ర సమావేశాల్లో ఎజెండా ముందుగానే ఖరారవుతుండగా, ఈ చర్చల్లో మాత్రం గోప్యత, అనూహ్యత పాళ్లే ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రారంభం కావడానికి ముందే ఈ దేశాల నేతలు సానుకూల ఫలితాలపై ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఘాటైన విమర్శలు చేస్తూ జీ–7 దేశాల సమావేశం నుంచి బయటకొచ్చిన ట్రంప్ నేరుగా సింగపూర్‌కు పయనమయ్యారు. ఈ పరిణామాల ప్రభావం శిఖరాగ్ర సమావేశంపై ఏ మేరకు చూపుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.
అణ్వాయుధాల నిరోధం...
అణ్వస్త్రాల వ్యాప్తి, తయారీ నుంచి వైదొలిగేందుకు కిమ్ సానుకూలంగా స్పందిస్తాడని అమెరికా ఆశిస్తోంది. దక్షిణ–ఉత్తర కొరియాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం ముగింపు పలకడానికి కూడా ఈ భేటీ ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఈ విషయంలో విశ్వాసం కలిగించే చర్యలను గతంలోనే ఉత్తరకొరియా తీసుకున్నందున అగ్రరాజ్యం అమెరికాకు కొంత నమ్మకం ఏర్పడింది. అయితే తన బలం, గుర్తింపునకు ఆయువుపట్టుగా ఉన్న అణ్వాయుధాల నుంచి కిమ్ పూర్తిస్థాయిలో వైదొలుగుతాడా? అన్న సందేహాలు మాత్రం వెన్నాడుతున్నాయి. మరోవైపు ఉత్తరకొరియా దశాబ్దాలుగా ఏకాకిగా, బహిష్కరణలు, నిషేథాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సింగపూర్ భేటీ రూపంలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఉత్తర కొరియా దేశాధ్యక్షులుగా ఉన్న కిమ్ తాత, తండ్రి తమ విదేశ పర్యటనలను కమ్యూనిస్టు దేశాలతో పాటు అలీనదేశాల పర్యటనలకే పరిమితమయ్యారు. కిమ్ కూడా తమ దేశం నుంచి కాలు బయటపెట్టకుండానే అణుహెచ్చరికల ద్వారా అమెరికాతో సహా ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. అప్పుడప్పుడు చైనాకు, ఇటీవల దక్షిణ కొరియాలో పర్యటించిన కిమ్ తొలిసారి సింగపూర్ వస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో స్కూలు చదువు పూర్తి చేసిన కిమ్ కీలక బాధ్యతలు చేపట్టే వరకు గడిపిన జీవితం ఇంకా మిస్టరీగానే ఉంది.
శత్రువులు మిత్రులుగా మారతారా ?
అజన్మ శత్రువులుగా కొనసాగుతున్న అమెరికా–ఉత్తరకొరియాల మధ్య స్నేహసంబంధాలు చిగురించడానికి సింగపూర్ భేటీ ఉపయోగపడుతుందా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా అణ్వాయుధాల ప్రయోగానికి సంబంధించి ట్రంప్–కిమ్ హెచ్చరికలు, ప్రతి హెచ్చరికల నేపథ్యంలో ఏర్పడిన వాతావరణానికి భిన్నంగా ఈ శిఖరాగ్ర సమావేశం జరిగితే మంచిదని ఈ విషయాల్లో అంతర్జాతీయ పరిశీలకులు కోరుకుంటున్నారు. దశాబ్దాల పాటు అణు ఆయుధాల తయారీలో నిమగ్నమై, గతేడాది ఆధునిక థర్మో న్యూక్లియర్ పరికరాలు సైతం ప్రయోగించి ఉత్తరకొరియా తన సత్తా చాటుకుంది.
అమెరికాలోని ఏ లక్ష్యాన్ని అయినా చేధించేందుకు అవసరమైన క్షిపణి సామర్థ్యాన్ని సాధించినట్టు గతంలోనే హెచ్చరికలు చేసింది. ఈ ధోరణిలో హఠాత్ మార్పునకు సూచికగా ఈ ఏడాది ప్రారంభం నుంచే కిమ్ సంకేతాలివ్వడం మొదలుపెట్టాడు. ఇక తమ దేశ ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్టు, దక్షిణ కొరియా పట్ల సానుకూలంగా వ్యవహరించనున్నట్టు చెప్పడమే కాకుండా ఈ దిశలో చర్చలకు కూడా మార్గం సుగమం చేశాడు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌తోనూ చర్చలకు ప్రతిపాదించడంతో పాటు తానే చొరవ తీసుకున్నాడు.
ఎవరి వ్యూహాలు వారివి...
అమెరికాలో తన పట్టును నిలుపుకోవడంతో పాటు, తన దేశ ప్రజలే కాకుండా, యావత్ ప్రపంచం దృష్టిలో సమర్థనేతగా గుర్తింపు పొందేందుకు దీనిని ఓ సువర్ణావకాశంగా ఉపయోగించుకోవాలని ట్రంప్ భావిస్తున్నాడు. ఉత్తరకొరియాను తమ దారికి తెచ్చిన నేతగా చరిత్రలో నిలిచిపోవాలని ఆశిస్తున్నాడు. దీనితో పాటు పెరుగుతున్న చైనా, రష్యా ఆధిపత్యానికి చెక్‌పెట్టి ఆసియా ఖండంపైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రస్తుత చర్చలు కలిసొస్తాయనే ఆలోచనతో ఉన్నాడు. మరోవైపు అమెరికా, ఇతర దేశాల ఆర్థిక,సైనిక ఆంక్షల నేపథ్యంలో కూనరిల్లుతున్న తన దేశాన్ని నిలబెట్టుకుని, ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందేందుకు శిఖరాగ్రసమావేశాన్ని వేదికగా చేసుకోవాలని కిమ్ ఆశాభావంతో ఉన్నాడు.
ఓ దేశాధినేతగా ప్రపంచ ప్రజల ఆదరాభిమానాలు కూడా పొందేందుకు, అగ్రరాజ్యం అమెరికాతోనే బేరసారాలు సాగించిన దేశంగా నిలిచేందుకు, ఒక సైనిక, అణుశక్తిగా గుర్తింపు పొందేందుకు ఇది దోహదపడుతుందని ధోరణితో కిమ్ ఉన్నాడు, ఉత్తరకొరియాతో శిఖరాగ్ర చర్చల సందర్భంగా ట్రంప్ తన దుందుడుకు స్వభావానికి భిన్నంగా వ్యవహరిస్తారా? లేక అందుకు భిన్నంగా దౌత్యనీతిని ప్రదర్శించి పెద్దన్నపాత్రను పోషిస్తారా అన్నది చూడాల్సి ఉంది. అగ్రదేశాధినేతగా ట్రంప్ సామర్థ్యానికి కిమ్‌తో భేటీ ఓ సవాల్‌గానే నిలవనుంది. అనూహ్య నిర్ణయాలు, వ్యవహారశైలితో మారిన మనుషులుగా ట్రంప్–కిమ్ భేటీ సఫలమై శాంతి నోబెల్ సాధించే దిశలో చరిత్రను తిరగరాస్తారా అన్నది కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment