సైనిక చర్యకు వెనకాడం
ఉత్తర కొరియాకు అమెరికా హెచ్చరిక
ఐక్యరాజ్యసమితి: ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియాపై సైనిక చర్యకు వెనకాడబోమని అమెరికా హెచ్చరించింది. ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న చైనా, రష్యాల తీరును కూడా దుయ్యబట్టింది. బుధవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉత్తరకొరియా పరిణామాలపై జరిగిన అత్యవసర సమావేశంలో యూఎన్‌లో అమెరికా రాయబారి నిక్కీహేలీ మాట్లాడుతూ...ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని పరీక్షించడం ప్రపంచమంతటికీ ప్రమాదకరమని అన్నారు.
చైనా కంపెనీలపై ఆంక్షలు!:
ఉత్తరకొరియా కట్టడికి అమెరికా కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. వాటిలో ఆ దేశంతో వ్యాపార లావాదేవీలు నిర్వర్తిస్తున్న చైనా కంపెనీలపై ఆంక్షలు విధించడం ఒకటి. ఉత్తరకొరియా తన 90 శాతం వాణిజ్యాన్ని చైనాతోనే జరుపుతోంది. అమెరికా గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసినా చైనాకున్న పలుకుబడి వల్ల వెనక్కి తగ్గింది.
ఎన్నికల్లో రష్యా పాత్ర
వార్సా: గతేడాది జరిగిన ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుని ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఇతర దేశాలకూ ఇందులో పాత్ర లేదని కొట్టిపారేయలేమన్నారు.‘ సులువుగా చెప్పేయొచ్చ. అది రష్యా కావొచ్చు. ఇతర దేశాలు కావొచ్చు. కచ్చితంగా చెప్పలేం ఎవరి పనో. కానీ ఎన్నికల్లో చాలా మంది పాత్ర ఉందని అనుకుంటున్నా’ అని ట్రంప్ గురువారం వార్సా పర్యటనలో వ్యాఖ్యానించారు. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌కు ప్రయోజనం కలిగేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రచారాన్ని ప్రభావితం చేశారని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.