చైనా తీరుపై మండిపడ్డ ట్రంప్..
పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్న ఉత్తర కొరియా అణుముప్పును కట్టడి చేయడంలో చైనా ఏమాత్రం సహకరించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇందుకు ప్రతీకారంగా చైనాపై వాణిజ్యపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అధ్యక్షుడు ట్రంప్ బుధవారం యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. జర్మనీ హంబర్గ్‌లో జరగనున్న జీ-20 సదస్సులో భాగంగా ట్రంప్ చైనా అధ్యక్షుడు గ్జీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీకి ముందే ఆయన చైనాపై విరుచుకుపడటం గమనార్హం.
ఉత్తరకొరియా చేపడుతున్న అణ్వాయుధ, క్షిపణి పరీక్షలను ఆ దేశ మిత్రపక్షమైన చైనా కట్టడి చేయాలని, అందుకు ప్రతిఫలంగా చైనాతో అమెరికా మంచి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుందని ట్రంప్ ఊరించారు. ఉత్తర కొరియా ఇటీవల అమెరికా, పశ్చిమ దేశాలను ఢీకొట్టగలిగే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణీని పరీక్షించడం అమెరికాకు కలవరం రేపుతున్నది. ఈ క్షిపణి ప్రయోగంతో అమెరికాకు అణుముప్పు పెరిగిందని భావిస్తున్న అగ్రరాజ్యం.. దీనిని కట్టడి చేయడంలో విఫలమైన చైనాను టార్గెట్ చేసుకోవాలని భావిస్తోంది. ’ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనా-ఉత్తర కొరియా మధ్య వాణిజ్యం 40శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో చైనా ఎందుకు కొరియాను కట్టడి చేయడం లేదు’ అంటూ గతంలో ట్రంప్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. అయినా, కొరియాను దారిలోకి తీసుకురాకపోవడంతో ఇక చైనాకు వాణిజ్యపరంగా చెక్ పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. జీ-20 సదస్సులో భాగంగా ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా భేటీ కానున్నారు.
చైనా, రష్యాపై అమెరికా ఫైర్
ఉత్తర కొరియా తాజాగా చేపట్టిన బాలిస్టిక్ క్షిపణుల పరీక్షల నేపథ్యంలో చైనా, రష్యా తీరుపై అమెరికా మండిపడింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో చైనా, రష్యా చేతిలో చేయి వేసి ముందుకు సాగుతున్నాయని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ మండిపడ్డారు. ఉత్తర కొరియా తీరును ఖండిస్తూ.. ఆ దేశంపై మరిన్ని తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఐరాస భద్రతా మండలి తీర్మానం చేయడానికి అడ్డుపడుతున్న చైనా, రష్యా తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.