అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన వ్యోమగాముల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా ‘స్టార్‌వార్స్: ద ఫోర్సెస్ అవేకెన్స్’లోని ప్రఖ్యాత ‘రేస్ థీమ్’ను అంతరిక్షం నుంచే పర్‌ఫామ్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు.
పొలారిస్ డాన్ ప్రైవేట్ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్‌ఎస్‌కు ప్రయాణించిన స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక నుంచే ఆమె ఈ మ్యూజికల్ ట్రిబ్యూట్‌లో పాల్గొన్నారు. సోలో వయోలిన్‌ను సారా వాయించగా పూర్తిస్థాయి ఆర్కెస్ట్రా బృందం భూమి నుంచి ఆమెకు వాద్య సహకారం అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘హార్మనీ ఆఫ్ రెసీలియన్స్’ పేరిట పొలారిస్ ప్రోగ్రాం బృందం శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
‘‘విశ్వభాష అయిన సంగీతమే ఈ వీడియోకు స్ఫూర్తి. అలాగే బాలల్లో క్యాన్సర్ తదితర మహమ్మారులపై పోరాటం కూడా. చుక్కలనంటే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకునేలా తర్వాతి తరాన్ని ప్రేరేపించడమే దీని ఉద్దేశం’’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ‘అందమైన మన పుడమి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమిది’ అంటూ సారా గొంతుతో వీడియో ముగుస్తుంది.
‘‘మానవాళి ఐక్యతకు, మెరుగైన ప్రపంచపు ఆకాంక్షలకు ఈ ప్రయత్నం ఓ ప్రతీక. బాలల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన ప్రతిభా పాటవాలకు ఇది అంకితం’’ అని సారా పేర్కొన్నారు. పొలారిస్ డాన్ మిషన్ కమాండర్ జరేద్ ఐజాక్‌మ్యాన్‌తో పాటు సారా గురువారం స్పేస్ వాక్ చేయడం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగాములుగా వారు నిలిచారు. ఈ వీడియో తయారీలో సెయింట్ జూడ్ చి్రల్డన్స్ రీసెర్చ్ హాస్పిటల్ కూడా పాలుపంచుకుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
అంతరిక్షం నుంచి ఐక్యతా గీతం
Published Sat, Sep 14 2024 5:11 AM | Last Updated on Sat, Sep 14 2024 5:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment