హెలికాప్టర్లూ తయారు చేస్తాం :మసూద్ హుసైనీ.. | The helicopter will be made: Masood husaini | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్లూ తయారు చేస్తాం :మసూద్ హుసైనీ

Published Wed, Dec 25 2013 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

హెలికాప్టర్లూ తయారు చేస్తాం :మసూద్ హుసైనీ..

హెలికాప్టర్లూ తయారు చేస్తాం :మసూద్ హుసైనీ..

 ‘సాక్షి’ ఇంటర్వ్యూ    టాటా ఏరోస్ట్రక్చర్స్ చీఫ్ మసూద్ హుసైనీ..
 

 లాక్‌హీడ్ మార్టిన్‌తో కలిసి రెక్కల తయారీ
   క్యాబిన్లకు సంబంధించి డెలివరీ కూడా మొదలు
   సిబ్బందికి తగిన శిక్షణ మేమే ఇస్తున్నాం
 
 సాక్షి బిజినెస్‌బ్యూరో, హైదరాబాద్
 ‘హెలికాప్టర్‌కు అత్యంత ప్రధానమైన క్యాబిన్ పూర్తిస్థాయిలో ఇక్కడే తయారవుతోంది. వీటి డెలివరీ కూడా ఆరంభమయింది. ప్రస్తుతం అత్యంత కీలకమైన రెక్కలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. త్వరలో పూర్తి స్థాయి హెలికాప్టర్‌ను దేశీయంగానే రూపొందిస్తామన్న నమ్మకం మాకుంది. మా సంస్థ లక్ష్యం కూడా ఇదే...’’ అంటూ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లక్ష్యాన్ని చెప్పుకొచ్చారు ఆ సంస్థలో ఏరోస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ ఆఫీస్‌కు సారథ్యం వహిస్తున్న మసూద్ హుసైనీ. హైదరాబాద్‌లో టాటా సన్స్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో... ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆదిభట్లలోని ఏరోస్పేస్ సెజ్‌కు సంబంధించిన వివరాలను  ‘సాక్షి’ ప్రతినిధితో పంచుకున్నారు. వివరాలివీ...
 
 ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్ ఎలా ఉంది?
 అనుకున్న సమయానికి కొంచెం ఆలస్యమైనా... హెలికాప్టర్ క్యాబిన్ తయారీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశాం. అమెరికాకు చెందిన సిర్‌కోస్కీ ఎయిర్‌క్రాఫ్ట్‌తో కలసి దీనికోసం ఏర్పాటు చేసిన టాటా ఏరోస్పేస్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ క్యాబిన్లను రూపొందిస్తోంది. దేశీయంగా తయారైన తొలి క్యాబిన్‌ను మూడు నెలల కిందటే డెలివరీ చేశాం.
 
 ఇక తదుపరి ఫోకస్ దేనిమీద పెట్టారు?
 హెలికాప్టర్‌కు అత్యంత కీలకమైన సెంటర్ వింగ్ బాక్స్‌ను, రెక్కలను, మరో 400 విడిభాగాలను తయారు చేసే పనిలో పడ్డాం. దీనికోసం అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్‌తో కలసి ‘టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్’ను ఏర్పాటు చేశాం. దీన్ని క్రమంగా విస్తరిస్తూ మరిన్ని విడి భాగాలను తయారు చేస్తాం.
 
 అంటే పూర్తి హెలికాప్టర్ ఇక్కడే తయారు చేస్తారా...?

 అదే మా లక్ష్యం కూడా. కాకపోతే హెలికాప్టర్ తయారీ అంత ఈజీ కాదు. కొన్ని భాగాలు వెంట్రుక మందంకన్నా సన్నగా ఉంటాయి. వీటి తయారీకి అత్యంత నైపుణ్యం కావాలి. మానవ వనరుల అవసరమూ ఎక్కువే. అయితే వీటన్నిటినీ అధిగమించి త్వరలోనే పూర్తి స్థాయి హెలికాప్టర్‌ను ఆదిభట్ల ఏరో సెజ్‌లో తయారు చేస్తామన్న విశ్వాసం మాకుంది.
 
 మరి హెలికాప్టర్ భాగాల తయారీకి నిపుణులు అవసరమని మీరే అంటున్నారు కదా? ఎక్కడి నుంచి తెస్తున్నారు?
 మేం ఇక్కడ సొంత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడే యూనివర్సిటీలలో, కాలేజీలలో నుంచి క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు చేపడుతున్నాం. వాటిలో సెలక్ట్ చేసుకున్న వాళ్లకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటున్నాం.
 
 మీ సెజ్ వచ్చాక ఆదిభట్ల చుట్టుపక్కల పరిస్థితులేమైనా మారాయా?
 అందులో ఎలాంటి సందేహం లేదు. మా సెజ్‌ను ఆనుకుని సమూహ ఏరో క్లస్టర్ ఏర్పాటవుతోంది. ఐటీతో సహా పలు కంపెనీలు వస్తున్నాయి.
 
 మరి రియల్ ఎస్టేట్ సంగతో...
 దీనిగురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. రియల్ ఎస్టేట్ ధరలు మాత్రం ఆకాశానికి ఎగిశాయన్నది నిజం. కొన్ని చోట్ల ఎకరా భూమి ఏడెనిమిది కోట్ల రూపాయలు కూడా పలుకుతోంది. మా సంస్థలో సిబ్బంది తమ ఇళ్ల కోసం ప్లాట్లు కొనుక్కుందామన్నా కష్టమవుతోందంటే మీరే  అర్థం చేసుకోండి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement