
మధ్యలోనే డంప్ చేస్తారా?!
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఏడాదిన్నరలోనే పదవీ గండం!
- అయితే అభిశంసన.. లేదంటే 25వ రాజ్యాంగ సవరణ ప్రయోగం
- ట్రంప్‌ను సాగనంపేందుకు సొంత రిపబ్లికన్ పార్టీలోనే వ్యూహరచన
- 2018లో కాంగ్రెస్ ఎన్నికలకు ముందే ట్రంప్‌కు పదవీచ్యుతి?
‘అధ్యక్షుడిని వదిలించుకోవడం ఎలా?’ ఇప్పుడు అమెరికాలో అత్యధికులు పరిశోధిస్తున్న అంశమిది. అమెరికాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా రాజకీయ నిపుణులు ఈ అంశంపై దృష్టి సారిస్తున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల పాలనతోనే.. అమెరికానే కాదు.. ప్రపంచమంతా గగ్గోలు పెడుతోంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే ట్రంప్ ప్రజల్లో మెజారిటీ విశ్వాసం కోల్పోయారని.. దేశంలో మూడో వంతు మందికన్నా ఎక్కువ మందే అధ్యక్షుడిని అభిశంసించాలని కోరుకుంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఎంతో కాలం అధ్యక్షుడిగా కొనసాగబోరని.. మధ్యలోనే సొంత రిపబ్లికన్ పార్టీయే ఆయనను బలవంతంగా సాగనంపాలని వ్యూహం రచిస్తోందని అంతర్గత విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే అభిశంసనను ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉన్నాయని.. లేదంటే 25వ రాజ్యాంగ సవరణను ప్రయోగించడం ద్వారా ట్రంప్‌ను గద్దె దింపి.. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని రాజకీయ నిపుణులు జోస్యం చెప్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అభిశంసన, 25వ సవరణల ప్రయోగంపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ట్రంప్‌ను తొలగించగల మార్గాలపై ఆ విశ్లేషణల సారాంశం...
అమెరికా అధ్యక్ష అనూహ్యంగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ‘మా అధ్యక్షుడు కాదు’ అంటూ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ దేశ రాజధాని సహా అన్ని ప్రముఖ నగరాల్లోనూ భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడు ‘ట్రంప్‌ను అభిశంసించాలి’ అనే ఉద్యమం అమెరికాలో బలపడుతోంది. ఇప్పటికే పలు సంస్థలు ఇందుకోసం సంతకాలు, విరాళాల సేకరణ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను అభిశంసించగల అంశాలేవి అన్నది ఆసక్తిగా మారింది. ‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించదగ్గ అంశాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. కానీ.. ఆయన తమకు భారమని రిపబ్లికన్లు ఎప్పుడు నిర్ణయించుకుంటారనేదే ప్రశ్న’ అని పలువురు రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వచ్చిన రష్యాతో సంబంధాలు మొదలుకొని.. అధ్యక్షుడిగా జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల్లోని అంశాల వరకూ చాలా విషయాల్లో ట్రంప్‌ను అభిశంసించదగ్గ కోణాలు ఉన్నాయని వారు చెప్తున్నారు.
- కోర్టులతో ట్రంప్ పోరాటం కూడా అభిశంసన దిశగా దారితీయవచ్చు. అమెరికాలోకి శరణార్థులు, ఏడు దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన న్యాయమూర్తి జేమ్స్ రాబర్ట్ ఉత్తర్వును సమర్థిస్తూ 9వ సర్క్యూట్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వేగంగా సమీక్షించవచ్చు. ట్రంప్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టినట్లయితే.. కోర్టును ధిక్కరించడానికి ఆయన ప్రయత్నిస్తారా? అలా చేయడం.. అభిశంసించగల మొదటి తరగతి నేరమవుతుంది.
- ఇక రెండో రకం అభిసంసించగల నేరం.. ట్రంప్ వ్యక్తిగత ప్రయోజనాలు, అధ్యక్షుడిగా అధికారిక విధులు రాజీపడటం. ట్రంప్‌కు రష్యాలో విస్తృత వాణిజ్య ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన ‘సత్సంబంధాలు’ ఈ కోవలోకి రావచ్చు. అలాగే.. పలు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులో పేర్కొన్న దేశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు కూడా ఇందులోకి వస్తాయి. ట్రంప్ తనకు వ్యాపార ప్రయోజనాలు ఉన్న ముస్లిం దేశాలను ఈ ఉత్వర్వు నుంచి మినహాయించారు. అయితే.. ఆ దేశాల నుంచే ఉగ్రవాదులు వస్తుండటం గమనార్హం. ట్రంప్ ఉత్తర్వులో నిషేధించిన దేశాల నుంచి ఉగ్రవాదులు ఎవరూ రాలేదు. ఆ దేశాల్లో ట్రంప్ పెట్టుబడులూ లేవు.
- మరోవైపు.. రష్యా అధ్యక్షుడితో ట్రంప్ విచిత్ర సన్నిహిత సంబంధాలపై సీఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. పుతిన్‌కి అనుకూలంగా ప్రవర్తించడాన్ని ట్రంప్ కొనసాగిస్తే అభిశంసన ఇంకా ముందుకు జరగొచ్చు. గత ఆదివారం ట్రంప్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. పుతిన్ మీద మాట పడకుండా సమర్థించుకొచ్చారు. ‘పుతిన్ ఒక హంతకుడు’ అని టీవీ వ్యాఖ్యాత అభివర్ణిస్తే.. ‘మనకు చాలా మంది హంతకులు ఉన్నారు. మన దేశం చాలా అమాయకమైనదని మీరు అనుకుంటున్నారా?’ అని ట్రంప్ ఎదురు ప్రశ్నించారు. ఇలా దేశాధ్యక్షుడే తన దేశమైన అమెరికాను కించపరచడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ సంపాదకుడు బ్రెట్ స్టీఫెన్స్ వ్యాఖ్యానించారు. మరికొందరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ట్రంప్ తీరును తప్పుబట్టారు.
ఆ పనులయ్యాక వారే దింపేస్తారు!
ట్రంప్‌ను అభిశంసించడానికి ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూడా తన వ్యూహానికి పదును పెడుతోంది. అయితే.. ప్రస్తుత కాంగ్రెస్‌లో బలాబలాలను బట్టి అధికార రిపబ్లికన్ పార్టీ సాయం లేకుండా ఇప్పట్లో ట్రంప్ అభిశంసన సాధ్యంకాదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌లో తమ బలం పెరిగితే ఆ పార్టీ స్వయంగా అభిశంసన చేపట్టవచ్చు. మరోవైపు రిపబ్లికన్ పార్టీలో కూడా ట్రంప్ మీద ప్రేమ లేదు. నిజానికి ఆ పార్టీ అధినాయకత్వం మొదటి నుంచీ ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల సమయానికి ఆ పార్టీ స్వయంగా ట్రంప్‌ను సాగనంపాలని యోచిస్తున్నట్లు చెప్తున్నారు.
‘‘రిపబ్లికన్లు కొంత కాలం ట్రంప్‌ను సహిస్తారు. గ్యాస్, చమురు, వాల్ స్ట్రీట్‌లపై నియంత్రణల తొలగింపు, పన్నుల కోతలు, పాఠశాలల ప్రైవేటీకరణ, కార్మిక రక్షణ కుదింపు, సుప్రీంకోర్టులో కనీసం ఒక మితవాద న్యాయమూర్తి నియామకం వంటి పనులను పూర్తిచేసే వరకూ ట్రంప్‌ను భరిస్తారు. కొంత కాలానికి ట్రంప్ ఒక వైపరీత్యమని, పార్టీకి ప్రమాదకరమని, 2018 ఎన్నికలకు నష్టదాయకుడని రిపబ్లికన్ పార్టీ నాయకత్వం నిర్ధారణకు వస్తుంది. దీంతో ఆయనను వదిలించుకుని, ఉపాధ్యక్షుడు పెన్స్ ను అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయిస్తారు. ఈ వ్యూహాన్ని రిపబ్లికన్ పార్టీలోని ఉన్నతస్థాయి వర్గాలు ఇప్పటికే చర్చిస్తున్నారు. రిపబ్లికన్లు సుదీర్ఘ ప్రక్రియ అయిన అభిశంసన ద్వారా ఈ పని చేయవచ్చు. ఇలాంటి చర్యలతో దెబ్బతిన్న ట్రంప్ మరింత క్రోధంతో ఇంకా ప్రతీకార చర్యలు చేపట్టవచ్చు. లేదంటే.. 25వ రాజ్యాంగ సవరణను అనుసరించి ట్రంప్‌ను అసమర్థుడిగా నిర్ధారించి మరింత వేగంగా తప్పించవచ్చు. తద్వారా ఒక అనిశ్చితుడైన, నిరంకుశుడు కాగల అధ్యక్షుడి నుంచి అమెరికాకు విముక్తి కలిగించిన ఖ్యాతి కూడా రిపబ్లికన్ పార్టీకి లభిస్తుందన్నది వారి ఆలోచన. 2018 ఎన్నికల నాటికి పెన్స్ నేతృత్వంలో వీరంతా మళ్లీ ఏకం కావచ్చు’’ అని బ్రాండీస్ యూనివర్సిటీలోని హెల్లెర్ స్కూల్ ప్రొఫెసర్, అమెరికన్ ప్రాస్పెక్ట్ పత్రిక సహ సంపాదకులు రాబర్ట్ కట్నర్ తాజాగా రాసిన ఒక వ్యాసంలో విశ్లేషించారు.
కాంగ్రెస్‌లో అభిశంసన ఇలా...
అమెరికా రాజ్యాంగంలో రెండో అధికరణలోని సెక్షన్ 4లో అధ్యక్షుడి అభిశంసన గురించి చెప్తుంది. దేశద్రోహం, లంచం తీసుకోవడం, అధికార దుర్వినియోగం, బెదిరింపులు, నిధుల దుర్వినియోగం, పర్యవేక్షణలో వైఫల్యం, విధులు నిర్వర్తించకపోవడం, తప్పుడు నడవడిక తదితర నేరాలకు పాల్పడినపుడు అభిశంసన ద్వారా అధ్యక్షుడిని పదవీచ్యుతిడిని చేయవచ్చు. కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ సాధారణ మెజారిటీతో అధ్యక్షుడిపై నేరాభియోగం మోపి అభిశంసించడానికి ఓటు వేయాలి. ఆ తర్వాత సెనేట్ విచారణ చేపట్టి అధ్యక్షుడి మూడింట రెండు వంతుల మెజారిటీతో అభిశంసనను ధృవీకరించాలి.
నిజానికి కాంగ్రెస్‌లో అభిశంసన ప్రక్రియను ప్రారంభించడానికి.. దేశద్రోహం, హత్య వంటి నేరాలకు ఆధారాలు అవసరం లేదు. ఆచరణలో ఏ అంశాన్నైనా ఇతర నేరాలుగా పరిగణించవచ్చు. ఇంతకుముందు మోనికా లూయిన్‌స్కీ కేసులో బిల్ క్లింటన్‌ను, గతంలో వాటర్‌గేట్ కుంభకోణంలో రిచర్డ్ నిక్సన్‌పైన అభిశంసన చేపట్టారు.
25వ సవరణ ప్రయోగం ఇలా...
అధ్యక్షుడు మరణించినపుడు, లేదా ఇతరత్రా కారణాల వల్ల అధికారాలు, విధులు నిర్వర్తించలేనపుడు ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారని వివరించే నిబంధనను.. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ వివరిస్తుంది. ఇందులోని నాలుగో సెక్షన్ ప్రకారం.. ‘అధ్యక్షుడు తన అధికారాలు, విధులు నిర్వర్తించలేకపోతున్నారు’ అని ఉపాధ్యక్షుడు, మెజారిటీ మంత్రులు రాతపూర్వకంగా కాంగ్రెస్ ఉభయసభల సభాపతులకు తెలియజేయాలి.
అలా జరిగినపుడు ఉపాధ్యక్షుడు తక్షణం క్రియాశీల అధ్యక్షుడిగా అధికారాలు, బాధ్యతలు చేపడతారు. ఈ 25వ రాజ్యాంగ సవరణను కొద్ది మార్లే వినియోగించారు. జాన్ ఎఫ్. కెన్నడీ హత్యానంతరం ఒకసారి, రొనాల్డ్ రీగన్‌కు క్యాన్సర్ సర్జరీ చేసినపుడు మరోసారి, జార్జ్ డబ్ల్యు. బుష్ కొలనోస్కోపీలు చేయించుకున్నపుడు ఇంకోసారి ఉపాధ్యక్షుడు క్రియాశీల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించేలా ఈ అధికరణను అమలుచేశారు.
-(సాక్షి నాలెడ్జ్ సెంటర్)