అభిశంసన నుంచి బయటపడినట్లు పత్రికలో వార్తను చూపుతున్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం సెనేట్‌లో వీగిపోయింది. తద్వారా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌కు రాజకీయ విజయం లభించినట్లయింది. ట్రంప్‌పై డెమొక్రాట్లు పెట్టిన అభిశంసన తీర్మానం రిపబ్లికన్ల ఆధిక్యంలోని సెనేట్‌లో వీగిపోవడంతో ట్రంప్‌కి ఊరట లభించింది. అయితే, అభిశంసనకు గురైన అధ్యక్షులెవరూ తర్వాతి ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. అభిశంసనను ఎదుర్కొన్నా, తిరిగి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోన్న తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంపే అవుతారు.
అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకున్నారన్న ఆరోపణలతో ట్రంప్‌పై గత డిసెంబర్‌లో డెమొక్రటిక్ పార్టీ అమెరికన్ కాంగ్రెస్‌లో అభిశంసనను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఆమోదం పొందిన అభిశంసన తీర్మానాన్ని తాజాగా సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగం 52–48 ఓట్ల తేడాతో, కాంగ్రెస్ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం 53–47 ఓట్ల తేడాతో వీగిపోయాయి. అభిశంసనను తిప్పికొట్టేందుకు 100 మంది సభ్యుల సభలో మూడింట రెండొంతుల ఓట్లు అవసరం. సెనేట్‌లో అ«ధికార రిపబ్లికన్ పార్టీకి 53 సీట్లు, డెమొక్రటిక్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి.
ట్రంప్‌పై వెల్లువెత్తిన ఆరోపణలు..
రాబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ ఇచ్చే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు ట్రంప్ ఉక్రెయిన్ సాయం తీసుకున్నారనీ, బదులుగా ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు విమర్శలొచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బిడెన్‌పైనా, ఆయన కొడుకు హంటర్‌పై ఉన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేయాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడితెచ్చారన్న విమర్శలొచ్చాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారనీ డెమొక్రటిక్ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే ట్రంప్‌పై అభిశంసన తీర్మానం తీసుకువచ్చింది.
ఖండించిన ట్రంప్..: తనపై అభిశంసనకు డెమొక్రటిక్ పార్టీ చేసిన యత్నం సిగ్గుచేటని అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. 2020లోనూ, ఆ తరువాత కూడా అమెరికా ప్రజల పక్షాన నిలుస్తానని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు అధ్యక్షభవనం ప్రకటించింది. తొలి నుంచీ తనపై ఆరోపణలు అవాస్తవమని చెబుతున్న ట్రంప్.. అభిశంసనపై దేశం విజయం సాధించిందనీ, అధ్యక్షభవనం నుంచి ప్రకటన చేస్తానని ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే, అమెరికా ప్రజల ఆకాంక్షలనూ, రాజ్యాంగ బాధ్యతలను సెనేటర్లు విస్మరిస్తున్నారనీ, వాస్తవాలను గుర్తించడంలో వారు విఫలమవుతున్నారని డెమొక్రటిక్ పార్టీ విమర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment