భారత ఫార్మా కంపెనీలపై దర్యాప్తు
- అమెరికా కాంగ్రెస్ నిర్ణయం
-జనరిక్ ఔషధ ధరల పెంపుపై ఆరా
- జాబితాలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, మైలాన్
వాషింగ్టన్: ఎంపిక చేసిన కొన్ని జనరిక్ ఔషధాల ధరలను పెంచుతూపోవడంపై భారత ఫార్మా దిగ్గజాలు సన్, డాక్టర్ రెడ్డీస్, మైలాన్ తదితర 14 సంస్థలపై యూఎస్ కాంగ్రెస్ దర్యాప్తును చేపట్టింది. కొన్ని జనరిక్ ఔషధాల ధరలను పెంచుతూ పోవడంపై వివరణ ఇవ్వాల్సిందిగా 14 కంపెనీలను నోటీసుల ద్వారా హౌస్ కమిటీ ర్యాకింగ్ సభ్యుడు ఎలిజా ఇ కమింగ్స్, సెనేటర్ బెర్నార్డ్ శాండర్స్ ఆదేశించారు. సాధారణ అనారోగ్య పరిస్థితుల దగ్గర్నుంచి ప్రాణాపాయాన్ని కలిగించే వ్యాధుల చికిత్సకు వినియోగించే ఔషధాల వరకూ ధరల అంశంపై వీరిరువురూ దర్యాప్తు చేపట్టినట్లు అమెరికా ప్రతినిధుల సభ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. దర్యాప్తులో భాగంగా చికిత్స వ్యయాలను తగ్గించేందుకు వీలుగా తగిన చర్యలను వీరు సూచించనున్నట్లు తెలిపింది. తద్వారా అమెరికాలో రోగులకు చేయూత అందించనున్నట్లు వివరించింది.
ఏడాది కాలంగా
గత రెండేళ్లలో 10 రకాల జనరిక్ ఔషధాల ధరలు పెరిగిన తీరుపై కమింగ్స్, శాండర్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా గత ఏడాది కాలంలో వీటి ధరలు ఆశ్చర్యకరంగా పెరిగాయని, వీటికి కారణాలు తెలుసుకోవలసి ఉన్నదని వ్యాఖ్యానించారు. కొన్ని సందర్భాలలో రోగులు వీటిని ఖరీదు చేసేందుకు వీలులేకుండా పెరిగాయని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు హెల్త్‌కేర్ సప్లై చైన్ అసోసియేషన్ నుంచి తీసుకున్న గత రెండేళ్ల గణాంకాలను ప్రస్తావించారు. నోటీసులిచ్చిన కంపెనీల జాబితాలో అక్టావిస్, అపోటెక్స్ కార్ప్, ఎండో ఇంటర్నేషనల్, గ్లోబల్ ఫార్మాస్యూటికల్స్, హెరిటేజ్ ఫార్మాస్యూటికల్స్, లానెట్ కంపెనీ, మారథాన్ ఫార్మాస్యూటికల్స్, మైలాన్, పీఏఆర్ ఫార్మాస్యూటికల్, టెవా, వెస్ట్‌వార్డ్ ఫార్మాస్యూటికల్, జైడస్ ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి.
సందేహాలు తీరుస్తాం
యూఎస్ కాంగ్రెస్ నోటీస్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ కంపెనీ ప్రతినిధి చెప్పారు. నోటీస్‌లో లేవనెత్తిన అంశాలపై తగిన విధంగా స్పందించనున్నట్లు తెలిపారు. నోటీస్‌లో పేర్కొన్న ఔషధాల ధరలను పెంచే ప్రయత్నాలు చేయలేదని వివరించారు. కాగా, సన్ ఫార్మా కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
2012 నుంచీ వివరాలు
2012 నుంచీ ఆదాయాలు, ఔషధాల అమ్మకాలు, ధరలు, ధరల పెంపునకు కారణాలు, ధరల పెంపు నిర్ణయాలు తీసుకున్న అధికారుల వివరాలు అందించాల్సిందిగా సభ్యు లు కంపెనీలను కోరారు. కోట్లమంది అమెరికన్లకు ఔషధాలు అందుబాటులోకి తీసుకురావడమే నిజానికి జనరిక్స్ పరమార్థమని ప్రైమరీ హెల్త్ సబ్‌కమిటీ, హెల్త్, ఎడ్యుకేషన్ సెనేట్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న శాండర్స్ ధరల పెరుగుదలపై వ్యాఖ్యానించారు. జనరిక్స్ ధరల పెరుగుదలకు మూలకారణాలను తెలుసుకోవలసిన అవసరమున్నదని పేర్కొన్నారు. జనరిక్ ఔషధ ధరల పెరుగుదల తీరును వివరిస్తూ ఆస్త్మా, ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సకు వినియోగించే అల్బుటరోల్ సల్ఫేట్‌ను ప్రస్తావించారు. ఈ ఔషధం (2ఎంజీ) 100 ట్యా బ్లెట్ల ధర 4,014% పెరిగినట్లు తెలిపారు.