విద్య, ఆరోగ్యానికే మా ప్రాధాన్యం
విద్య, ఆరోగ్యానికే మా ప్రాధాన్యం
Published Fri, Jul 7 2017 7:41 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
హైదరాబాద్: విద్య, ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ రెండు అంశాలపై ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. సీజీహెచ్‌ఎస్ (కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం) కింద హిమాయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌సెంటర్-5ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లకు కేంద్ర ప్రభుత్వం రూ.144 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.
అదేవిధంగా రాష్ట్రంలో అఖిల భారత వైద్య శాస్త్ర విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ఏర్పాటు ప్రతిపాదనలు ఆమోదించిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. వైద్యుల కొరతను, అనుభవజ్ఞులైన ప్రభుత్వ వైద్యుల సంఖ్య ఆధారంగా వైద్యుల పదవీ కాలాన్ని మూడేళ్లు పెంచినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 1.5 లక్షల మంది సీజీహెచ్‌ఎస్ కింద లబ్ది పొందుతున్నారన్నారు. హిమయత్ నగర్ లోని సీజీహెచ్‌ఎస్ వెల్ నెస్ సెంటర్ పరిధిలో 4 వేల మంది లబ్దిదారులున్నారన్నారు. విశాల ప్రయోజనాల రీత్యా డిస్పెన్సెరీని పాలీ క్లినిక్ గా మార్చడం జరుగుతుందని, హిమయత్ నగర్ సీజీహెచ్‌ఎస్ నియంత్రణలో రెండెకరాల స్థలం ఉందని ఆయన వెల్లడించారు.
Advertisement