వాషింగ్టన్: భారత్, అమెరికా సమాజాలు, సంస్థలు ప్రజాస్వామిక విలువలపై నిర్మితమై ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమ వైవిధ్యాన్ని ఇరు దేశాలు గర్వకారణంగా భావిస్తున్నాయని చెప్పారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికాలో అడుగుపెట్టిన మోదీకి గురువారం శ్వేతసౌధంలో సాదర స్వాగతం లభించింది. అధికారిక లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్, అమెరికా రాజ్యాంగాలు ‘దేశ ప్రజలమైన మేము’ అనే మూడు పదాలతోనే ప్రారంభమవుతాయని గుర్తుచేశారు. తనకు అద్భుతమైన స్వాగతం పలికిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ దంపతులకు, అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఇక్కడ తనకు లభించిన స్వాగతం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప గౌరవమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో నివసిస్తున్న 40 లక్షల మందికిపైగా భారతీయులకు గర్వకారణమని అన్నారు.
ప్రజాస్వామ్య బలానికి ఇదొక రుజువు: మోదీ
‘అందరి ప్రయోజనాల కోసం, అందరి సంక్షేమం కోసం’ అనే ప్రాథమిక సూత్రాన్ని భారత్, అమెరికా ఎంతగానో విశ్వసిస్తున్నాయని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల క్రితం ఒక సామాన్యుడిగా అమెరికా వచ్చానని, అప్పుడు వైట్‌హౌస్ బయటి నుంచే చూశానని అన్నారు. ప్రధానమంత్రి హోదాలో చాలాసార్లు ఇక్కడికి వచ్చానని చెప్పారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భారతీయ–అమెరికన్ల కోసం వైట్‌హౌజ్ గేట్లు తెరవడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని అన్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు కష్టపడి పని చేస్తున్నారని, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని మోదీ ప్రశంసించారు.
చదవండి: అది మా డీఎన్‌ఏలోనే ఉంది: బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో మోదీ
భారత్–అమెరికా స్నేహం మొత్తం ప్రపంచాన్ని బలోపేతం చేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయని వివరించారు. ప్రజాస్వామ్య బలానికి భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యమే ఒక రుజువు అని వెల్లడించారు. కీలకమైన అంశాలపై అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చించబోతున్నానని పేర్కొన్నారు. చర్చలు సానుకూలంగా జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా పార్లమెంట్‌ను రెండోసారి ఉద్దేశించి ప్రసంగించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు.
భారత్ సహకారంతో ‘క్వాడ్’ బలోపేతం: బైడెన్
భారత్–అమెరికా సంబంధాలు 21వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల సంబంధాల్లో ఒకటి అని జో బైడెన్ స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో మోదీని ఆహా్వనిస్తూ ఆయన మాట్లాడారు. ఈ రోజు రెండు దేశాలు కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి అంశాలపై ఇరుదేశాలు సన్నిహితంగా కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. స్వేచ్ఛాయుత, భద్రమైన ఇండో–పసిఫిక్ లక్ష్యంగా భారత్ సహకారంతో ‘క్వాడ్’ కూటమిని బలోపేతం చేస్తున్నామని బైడెన్ వివరించారు.
చదవండి: Narendra Modi: ఎదురొచ్చి మరీ మోదీకి బైడెన్ దంపతుల సాదర స్వాగతం.. ప్రత్యేక విందు
Comments
Please login to add a commentAdd a comment