భారత్‌ అభివృద్ధే ప్రపంచాభివృద్ధి | Address by PM Narendra Modi to the Joint Session of the US Congress | Sakshi
Sakshi News home page

భారత్‌ అభివృద్ధే ప్రపంచాభివృద్ధి

Published Sat, Jun 24 2023 4:48 AM | Last Updated on Sat, Jun 24 2023 4:48 AM

Address by PM Narendra Modi to the Joint Session of the US Congress - Sakshi

కాంగ్రెస్‌లో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ, వెనుక కమలా హ్యారిస్, హౌస్‌ స్పీకర్‌ కెవిన్‌ మెక్‌కార్తీ

వాషింగ్టన్‌:  మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయడంలో ‘అయితే, కానీ’లకు ఎంతమాత్రం తావులేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఉగ్రవాదాన్ని నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు.

ప్రధాని మోదీ గురువారం వాషింగ్టన్‌ డీసీలో అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంట్‌) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 60 నిమిషాలపాటు మోదీ ప్రసంగం కొనసాగింది. పార్లమెంట్‌ సభ్యులు, సెనేటర్లతోపాటు సందర్శకుల గ్యాలరీల నుంచి వందలాది మంది భారతీయ–అమెరికన్లు మోదీ ప్రసంగాన్ని వీక్షించారు.

అమెరికాలో 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు, భారత్‌లో 26/11 దాడులు జరిగి దశాబ్దం పూర్తయినా ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచానికి ఇప్పటికీ సవాలు విసురుతూనే ఉన్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మతి తప్పిన సిద్ధాంతాలు కొత్తరూపును, కొత్త గుర్తింపును సంతరించుకుంటున్నాయని, అయినప్పటికీ వాటి ఉద్దేశాలు మాత్రం మారడం లేదని ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి ముమ్మాటికీ శత్రువేనని స్పష్టం చేశారు. ముష్కర మూకలను అణచివేయడంలో ఎవరూ రాజీ పడొద్దని సూచించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ పొరుగు దేశాలను ఎగుమతి చేస్తున్న దుష్ట దేశాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ఏం మాట్లాడారంటే..   

భారీగానే కాదు.. వేగంగానూ అభివృద్ధి  
‘‘గత దశాబ్ద కాలంలో వంద మందికిపైగా అమెరికా పార్లమెంట్‌ సభ్యులు భారత్‌లో పర్యటించారు. భారతదేశ అభివృద్ధిని తెలుసుకోవాలని, అక్కడి ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. భారత్‌ ఇప్పుడేం చేస్తోంది? ఎలా చేస్తోంది? అన్నదానిపై అందరికీ ఆసక్తి ఉంది. ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో నేను మొదటిసారి పర్యటించినప్పుడు భారత్‌ ప్రపచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది.

ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. మేము భారీగానే కాదు, వేగంగానూ అభివృద్ధి సాధిస్తున్నాం. భారత్‌ ప్రగతి సాధిస్తే మొత్తం ప్రపంచం ప్రగతి సాధిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం .. భూగోళంపై ఆరింట ఒక వంతు జనాభా భారత్‌లోనే ఉంది.  
ఇండో–పసిఫిక్‌లో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం..  
వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఇతర దేశాల సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి చార్టర్‌ సూచిస్తోంది. ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్‌ ఆర్డర్‌) అన్ని దేశాలూ అనుసరించాలి. చార్టర్‌ను గౌరవించాలి. కానీ, ఇండో–పసిఫిక్‌పై బలప్రయోగం, ముఖాముఖి ఘర్షణ అనే నీలినీడలు ప్రసరిస్తున్నాయి. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. భారత్‌–అమెరికా భాగస్వామ్యానికి ఇది కూడా ఒక ప్రాధాన్యతాంశమే.

స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌ ఆవశ్యకతపై అమెరికాతో మా అభిప్రాయాలు పంచుకున్నాం. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం పరిఢవిల్లాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలతో, భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. ‘క్వాడ్‌’ వంటి కూటములు ఈ ప్రయత్నంలో ఒక భాగమే. ఇండో–పసిఫిక్‌ బాగు కోసం క్వాడ్‌ కృషి చేస్తోంది. ఉక్రెయిన్‌ సంఘర్షణ ఆసియా ప్రాంతంలో సమస్యలు సృష్టించిన మాట వాస్తవమే. ఇది యుద్ధాల శకం కాదని, చర్చలు, దౌత్యమార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని సూటిగా చెప్పా.  

ఇదొక గొప్ప గౌరవం  
140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ అమెరికా పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రెండుసార్లు ఈ అవకాశం దక్కడం గర్వకారణం. మనం ఒక ముఖ్యమైన కూడలిలో ఉన్నాం. గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధ(ఏఐ)లో ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అదేసమయంలో మరో ఏఐ(అమెరికా, ఇండియా)లో మరిన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ శతాబ్దం ఆరంభంలో రక్షణ సహకారం విషయంలో మనం(భారత్, అమెరికా) అపరిచితులమే.  పెద్దగా రక్షణ సహకారం లేదు. కానీ, ఇప్పుడు భారత్‌కు అమెరికా అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామిగా మారింది.  

75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణం  
ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత్‌ తల్లిలాంటిది. భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా వర్ధిల్లుతున్నాయి. సమానత్వం, ప్రజల గౌరవానికి స్ఫూర్తినిచ్చేదే ప్రజాస్వామ్యం.  ఆలోచనకు, వ్యక్తీకరణకు రెక్కలు తొడిగేది ప్రజాస్వామ్యం. ప్రాచీన కాలం నుంచి ప్రజాస్వామ్య విలువలకు భారత్‌ ఆయువుపట్టుగా నిలుస్తోంది. వెయ్యి సంవత్సరాల పరాయి పాలన తర్వాత భారత్‌ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణాన్ని పండుగలా జరుపుకుంది. ఇది కేవలం ప్రజాస్వామ్య ఉత్సవం కాదు, వైవిధ్య వేడుక. సామాజిక సాధికారత, ఐక్యత, సమగ్రత వేడుక.   

డిజిటల్‌ చెల్లింపుల అడ్డా భారత్‌  
యువ జనాభా అధికంగా ఉన్న ప్రాచీన దేశం భారత్‌. సంప్రదాయాలకు పెట్టింది పేరు భారత్‌. నేటి యువత భారత్‌ను టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నారు.  భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దేశంలో ప్రత్యక్ష నగదు బదిలీల విలువ 320 బిలియన్‌ డాలర్ల మార్కును దాటింది. ఈ ప్రక్రియలో 25 బిలియన్‌ డాలర్లు ఆదా చేశాం. భారత్‌లో ఇప్పుడు అందరూ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వీధి వ్యాపారుల సైతం యూపీఐ సేవలను వాడుకుంటున్నారు. గత ఏడాది ప్రపంచంలో జరిగిన ప్రతి 100 రియల్‌ టైమ్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో 46 చెల్లింపులు భారత్‌లోనే జరిగాయి. వేలాది మైళ్ల పొడవైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు, చౌక డేటాతో భారత్‌లో సాంకేతిక విప్లవం కొనసాగుతోంది.

మహిళల సారథ్యంలో అభివృద్ధి
ప్రాచీన కాలం నాటి వేదాలు నేటి మానవాళికి గొప్ప నిధి లాంటివి. మహిళా రుషులు సైతం వేదాల్లో ఎన్నో శ్లోకాలు, పద్యాలు రాశారు. ఆధునిక భారతదేశంలో మహిళలు ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ప్రజలను ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో మహిళల సారథ్యంలో అభివృద్ధి జరగాలన్నదే మా ఆకాంక్ష. గిరిజన తెగకు చెందిన ఓ మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 10.5 లక్షల మంది మహిళలు వివిధ పదవులు చేపట్టారు.

సైన్యం, నావికాదళం, వైమానిక దళంలోనూ విశేషమైన సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశం భారత్‌. అంగారక గ్రహంపైకి మనుషులను చేర్చేందుకు చేపట్టిన మార్చ్‌ మిషన్‌లో మహిళామణులు పనిచేస్తున్నారు. మహిళలకు సాధికారత కలి్పసే సమూల మార్పులు రావడం ఖాయం. ఆడపిల్లల చదువులు, వారి ఎదుగుదల కోసం పెట్టుబడి పెడితే వారు మొత్తం కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు.   

సంస్కరణల సమయమిది..  
ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం వచి్చంది. ప్రపంచం మారుతోంది. అంతర్జాతీయ సంస్థలూ మారాల్సిందే. భారత్‌–అమెరికా మరింత సన్నిహితమవుతున్నాయి. పరస్పర సంబంధాల విషయంలో నూతన ఉషోదయం కనిపిస్తోంది. భారత్‌–అమెరికా సంబంధాలు కేవలం ఈ రెండు దేశాలనే కాదు, ప్రపంచ భవితవ్యాన్ని కూడా నిర్ధారిస్తాయి. మహాత్మా గాం«దీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌తోపాటు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడినవారిని మేమే స్మరించుకుంటున్నాం.

భారత్‌లో 2,500కు పైగా రాజకీయ పారీ్టలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలను 20 వేర్వేరు పార్టీలు పరిపాలిస్తున్నాయి. దేశంలో 22 అధికార భాషలున్నాయి. వేలాది యాసలున్నాయి. కానీ, మేమంతా ఒకే స్వరంతో మాట్లాడుతాం. ప్రపంచంలోని అన్ని నమ్మకాలు, విశ్వాసాలకు భారత్‌లో స్థానం ఉంది, వాటిని గౌరవిస్తున్నాం. వైవిధ్యం అనేది భారత్‌లో ఒక సహజ జీవన విధానం. అమెరికా పార్లమెంట్‌లో భారతీయ–అమెరికన్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సభలో సమోసా కాకస్‌ ఫ్లేవర్‌ ఉంది. ఇది మరింత విస్తరించాలి. భారత్‌లోని భిన్న రుచులు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నా’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement