నాన్సీపై సైకత్‌ పోటీ | Saikat Chakrabarti Against Nancy Pelosi In US Congress | Sakshi
Sakshi News home page

నాన్సీపై సైకత్‌ పోటీ

Published Sat, Feb 8 2025 5:46 AM | Last Updated on Sat, Feb 8 2025 5:46 AM

Saikat Chakrabarti Against Nancy Pelosi In US Congress

డెమోక్రాటిక్‌ పార్టీ ప్రైమరీ రేసులో భారత సంతతి యువనేత 

వాషింగ్టన్‌: అమెరికా హౌస్‌ మాజీ స్పీకర్, 21వసారి కాంగ్రెస్‌కు పోటీ పడుతున్న నాన్సీ పెలోసీ(85)కి భారత సంతతికి చెందిన యువ రాజకీయ నేత నుంచి అనూహ్యంగా గట్టి పోటీ ఎదురవనుంది. శాన్‌ఫ్రాన్సిస్కో కంగ్రెషనల్‌ స్థానానికి డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున పెలోసీపై పోటీ చేయనున్నట్లు సైకత్‌ చక్రవర్తి ప్రకటించారు. పురుషాధిక్యత కలిగిన అమెరికా రాజకీయాల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని నాయకురాలిగా పెలోసీ కొనసాగుతున్నారు. 

2026 నవంబర్‌లో జరిగే ఎన్నికకు మళ్లీ ఎన్నికయ్యేందుకు ఆమె ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఆమె ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ప్రతినిధుల సభలో సభ్యురాలిగా 2027 జనవరి వరకు పెలోసీ కొనసాగుతారు. ఈ పదవికి 2026 నవంబర్‌లో ఎన్నిక జరగనుంది. అదే సమయంలో డెమోక్రాటిక్‌ ప్రైమరీకి 2026 ఆరంభంలో ఎన్నిక నిర్వహిస్తారు.

శాన్‌ఫ్రాన్సిస్కో డెమోక్రాట్లకు కంచుకోట వంటిది. ప్రైమరీలో గెలుపొందిన వారే భవిష్యత్తులో ప్రతినిధుల సభకు ఎన్నికయ్యే అవకాశాలెక్కువ. ‘నాన్సీ పెలోసీ మరోసారి పోటీ చేయనున్నారని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోవడం ఖాయం. కానీ, ఇది ఆమెకు 21వ సారి. 45 ఏళ్ల క్రితం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి అమెరికాకు ఇప్పటికి ఎంతో తేడా ఉంది. డెమోక్రాటిక్‌ పార్టీ కొత్త నాయకత్వాన్ని కోరుకుంటోందన్నది సుస్పష్టం. అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్‌ మస్క్ ల పాలన చూసి ప్రజలు ప్రత్నామ్నాయం కోరుకుంటున్నారు. అందుకే నాన్సీ పెలోసీపై ఈసారి బరిలోకి దిగాలనుకుంటున్నా’అని సైకత్‌ గురువారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. పెద్దపెద్ద దాతలిచ్చే విరాళాల కంటే ఓటర్లతో మమేకం అయ్యేందుకు కృషి చేస్తానన్నారు.  

ఎవరీ సైకత్‌ చక్రవర్తి? 
1986లో టెక్సాస్‌లో బెంగాలీ కుటుంబంలో జని్మంచిన సైకత్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి 2007లో కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీ చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా సిలికాన్‌ వ్యాలీలో కొంతకాలం పనిచేశారు. 2015లో సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ అధ్యక్ష ప్రచార కమిటీలో సేవలందించారు. దీంతోపాటు రాజకీయ సలహాదారుగా డెమోక్రాటిక్‌ పారీ్టకి చెందిన అలెగ్జాండ్రియా ఒకాసియో– కార్టెజ్‌కు చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా గతంలో వ్యవహరించారు. 2018లో కాంగ్రెస్‌కు పిన్న వయస్సులోనే గెలిచిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 

ఆమె గెలుపులో సైకత్‌ కీలకంగా ఉన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి నాలుగు దశాబ్దాలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న నాన్సీ వయోభారంతోపాటు ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. ఈ నేపథ్యంలో యువ రాజకీయ కెరటం సైకత్‌ రంగ ప్రవేశం నాన్సీ పెలోసీపై ఒత్తిడి పెంచనుంది.అమెరికా చరిత్రలోనే హౌస్‌ స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ నాన్సీ పెలోసీ. కాంగ్రెస్‌ ప్రతినిధిగా సుదీర్ఘకాలంలో ఎందరో అధ్యక్షులు తీసుకువచి్చన చట్టాలకు మద్దతివ్వడం లేదా తిరస్కరించడంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షుల తర్వాత మూడో శక్తివంతమైన పదవి హౌస్‌ స్పీకర్‌.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement