వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న భారతీయులకు ఊరట లభించనుంది. అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభకు చెందిన జ్యుడీషియరీ కమిటీ రూపొందించిన రీకన్సిలియోషన్ బిల్లులో వివరాల ప్రకారం... గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సూపర్ ఫీ చెల్లించడానికి ముందుకు వస్తే గ్రీన్‌కార్డుని అప్పటికప్పుడే పొందవచ్చు.
అదే విధంగా లీగల్ డ్రీమర్స్ (తల్లిదండ్రుల హెచ్–1బీ వీసాతో చిన్నారులుగా దేశానికి వచ్చి 21 ఏళ్లు నిండిన వారు) ఈ సప్లిమెంటరీ ఫీజు కడితే వారికి శాశ్వత నివాసం, పౌరసత్వం లభిస్తుంది. త్వరలోనే ఈ బిల్లు కాంగ్రెస్ ముందుకు రానుంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల్ని ప్రతీ ఏడాది అమెరికా 1.40 లక్షలు మంజూరు చేస్తుంది. దీంట్లో ఏ ఒక్క దేశానికీ 7 శాతానికి మించి గ్రీన్‌కార్డులు మంజూరు చేయకూడదనే పరిమితి ఉంది.
భారతీయులు అధిక సంఖ్యలో గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేస్తూ ఉండడంతో ఈ కోటా వల్ల దరఖాస్తుదారులు ఎక్కువగా పెరిగిపోతున్నారు. కాటో ఇనిస్టిట్యూట్‌కు చెందిన వలస విధాన నిపుణుడు డేవిడ్ బెయిర్ అధ్యయనం ప్రకారం ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం వేచి చూస్తున్న భారతీయుల సంఖ్య ఏప్రిల్ 2020 నాటికి 7.41 లక్షలుగా ఉంది. వీరందరికీ కార్డు రావాలంటే 84 ఏళ్లు వేచి చూడాలని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ ఫీ చెల్లిస్తే గ్రీన్‌కార్డు రావడం అన్నది సువర్ణావకాశమని బెయిర్ అన్నారు. 5 వేల డాలర్లు చెల్లించే వారందరికీ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తే అంతకు మించినది ఏముంటుందని పేర్కొన్నారు.
ఇక అత్యవసర రంగాలైన ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయంతో పాటుగా రవాణా, ఐటీకి చెందిన కంపెనీల్లో పని చేసేవారికి వారి యాజమాన్యం స్పాన్సర్ చేయకపోయినా.. 5 వేల డాలర్లు చెల్లించి గ్రీన్‌కార్డు పొందే అవకాశం ఉంటుంది. ఒక రకంగా బైడెన్ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ఈ పని చేస్తూ ఉందని న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ లా సంస్థ వ్యవస్థాపకుడు సైరస్ డి మెహతా అన్నారు. బడ్జెట్ రీ కన్సిలేషన్ బిల్లులో భాగంగా దీనిని చేర్చడంతో కాంగ్రెస్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందుతుందని మెహతా ధీమాగా చెప్పారు.
బిల్లులో ఏముందంటే..
► ఉద్యోగ ఆధారిత వలసదారులు గ్రీన్‌కార్డు ప్రయార్టీ తేదీ కంటే ఇంకా రెండేళ్లు ఎక్కువ గా నిరీక్షించాల్సి వచి్చనప్పుడు 5 వేలడాలర్ల సూపర్ ఫీ చెల్లిస్తే అప్పటికప్పుడు వారికి గ్రీన్ కార్డు మంజూరు చేస్తారు.
► కుటుంబ ఆధారిత వలసదారులు, అమెరికా పౌరులెవరైనా స్పాన్సర్ చేస్తే గ్రీన్‌కార్డు రావాల్సిన సమయంలో కంటే రెండేళ్లు ఎక్కువ నిరీక్షించిన తర్వాత సప్లిమెంట్ ఫీజు కింద 2,500 డాలర్లు చెల్లించాలి.
► వలస విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ దేశాల పరిమితి కోటా ఎత్తేయడం, హెచ్–1బీ వీసా వార్షిక కోటా పెంచడం వంటి వాటికి ఈ బిల్లులో చోటు దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment