డెమోక్రాట్లను గెలిపిస్తే భారత్‌కు మేలు | Joe Biden promises to reform H-1B visa system and eliminate country quota | Sakshi
Sakshi News home page

డెమోక్రాట్లను గెలిపిస్తే భారత్‌కు మేలు

Published Mon, Aug 17 2020 2:26 AM | Last Updated on Mon, Aug 17 2020 10:29 AM

Joe Biden promises to reform H-1B visa system and eliminate country quota - Sakshi

వాషింగ్టన్‌: తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే, భారత్‌ సరిహద్దుల్లోనూ, ఇతర భూభాగాల్లోనూ, భారత్‌ ఎదుర్కొంటోన్న సవాళ్లను అధిగమించడంలో అమెరికా భారత్‌ పక్షం వహిస్తుందని డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడడానికీ, ఇండో అమెరికన్‌లు పరస్పర సహకారంతో కలిసి జీవించడానికి, ఇరుదేశాల మధ్య స్నేహాన్ని కొనసాగించడానికి కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞచేశారు.

అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో జో బైడెన్‌ తలపడుతున్నారు. ‘పదిహేనేళ్ల క్రితం భారత దేశంతో చారిత్రాత్మక అణ్వాయుధ ఒప్పందం కొరకు ప్రయత్నం చేశాను. భారత్, అమెరికాల మధ్య మైత్రీ సంబంధాలు బలపడితే, యావత్‌ ప్రపంచం సురక్షితంగా ఉంటుందని ఆనాడే నేను చెప్పాను’’అని భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలోని భారతీయులను ఉద్దేశించి, ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్‌ వ్యాఖ్యానించారు.

అధ్యక్షుడిగా ఎన్నికైతే ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రపంచం ఎదుర్కొంటోన్న వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్య రక్షణపై దృష్టిసారిస్తామని బైడెన్‌ చెప్పారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో, దేశ చరిత్రలోనే అత్యధికంగా భారతీయులను వివిధ పదవుల్లో నియమించినట్లు, ఇప్పుడు అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉపాధ్యక్షురాలిగా పోటీలో నిలిపామని ఆయన అన్నారు. భారత దేశానికి చెందిన హిందూ, సిక్కు, ముస్లిం, జైన్, ఇతరులపై జరుగుతోన్న దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని ఆయన అన్నారు.

హెచ్‌–1బీ వీసా...
హెచ్‌–1బీ వీసాల విధానాన్ని సంస్కరించి, గ్రీన్‌ కార్డుల కోసం దేశాల వారీగా ఇచ్చే కోటా విధానాన్ని రద్దు చేస్తామని బైడెన్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో జాతి విద్వేషాలు పెరుగుతున్నాయని, ఇతర దేశాల వారిపై ఆంక్షలు విధిస్తూ, హెచ్‌–1బీ వీసాలపై హానికరమైన, కఠిన చర్యలకు పూనుకుంటున్నారని బైడెన్‌ వ్యాఖ్యానించారు. గ్రీన్‌ కార్డుల సంఖ్యను పెంచుతామని, కుటుంబ సభ్యుల రాకపై ఆంక్షలు తొలగిస్తామని, అమెరికాలో చదివిన విద్యార్థులపై ఆంక్షలు ఎత్తివేస్తామని, ఉపాధి కోసం వచ్చేవారికి ఉద్యోగ వీసాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. అమెరికాలో భారతీయుల రక్షణ కోసం, తొలిసారిగా డెమొక్రాటిక్‌ పార్టీ ఒక విధానపత్రంతో ముందుకు వచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement