
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న చట్టబద్ధ వలసదారుల పిల్లల ‘పౌరసత్వం’ కల నిజమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది. అమెరికాలో హెచ్–1బీ, ఇతర దీర్ఘకాలిక నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్’లుగా పిలుస్తారు. ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు. అప్పుడు వారివారి స్వదేశాలకు అమెరికా సాగనంపుతుంది. ఈ ప్రమాదం నుంచి వీరందరినీ బయటపడేసేందుకు బైడెన్ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని వైట్‌హౌస్ ప్రకటించింది.
భారీసంఖ్యలో డ్రీమర్ల తల్లిదండ్రులు దశాబ్దాలుగా అమెరికా శాశ్వత నివాస ధ్రువీకరణ ‘గ్రీన్ కార్డు’ కోసం ఎదురుచూస్తున్నారు. వీరు గ్రీన్‌కార్డుల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుండటంతో వారి పిల్లల వయసు 21 దాటుతోంది. అలాంటి వారు అమెరికాను వీడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రీమర్లు 21ఏళ్ల వయసులోపు వరకూ డిపెండెంట్‌లుగా తమ తల్లిదండ్రులతోపాటే అమెరికాలోనే ఉండొచ్చు. 21 ఏళ్లు దాటితే వారికి ఆ డిపెండెంట్ హోదా పోతుంది. అమెరికా పౌరసత్వ కల వీరందరికీ అలాగే ఉండిపోయింది. ‘ఇంప్రూవ్ ది డ్రీమ్’ గణాంకాల ప్రకారం రెండు లక్షల మంది డ్రీమర్లు ఉన్నారని, అందులో అధికశాతం మంది భారతీయులేనని సమాచారం.
వీరి పౌరసత్వ కల నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ చెప్పారు. అమెరికా వలస విధానంలో సంస్కరణలు తేవాల్సిన తరుణం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇమ్మిగ్రేషన్ బిల్లు సెనేట్‌కు పంపారు. పాత చట్టానికి సవరణలు, వాడని వీసాలను స్వాధీనం చేసుకోవడం, చాన్నాళ్లు వేచి ఉండే పద్ధతికి స్వస్తి పలకడం, ‘ఒక్కో దేశానికి గరిష్ట పరిమితిలోనే అనుమతులు’.. ఇలా అనేక కుటుంబ ఆధారిత వలస విధానంలో సంస్కరణలు ఆ బిల్లులో ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. డ్రీమర్లు అమెరికాలో పనిచేసుకునేందుకు, చట్టం అనుమతించిన వయసు పరిమితిని దాటినా వారికి రక్షణ కల్పించే అంశాలూ ఈ బిల్లులో ఉన్నాయని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కూడా అయిన జెన్‌సాకీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment