హెచ్ -1బీ వీసా రెన్యువల్‌పై అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు ఉద్యోగ ప్రయోజనాల కోసం దేశంలో తాత్కాలికంగా ఉండేందుకు వీలు కల్పించే హెచ్-1బీ వీసాను ఇక్కడే (అమెరికాలో) ఉండి తమ వీసాల పునరుద్ధరణ కోసం అప్లయ్ చేసుకోవాలని కోరింది.
పాస్ పోర్ట్, వీసా మంజూరు, రెన్యువల్ చేసే యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ కార్యాలయం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ డ్రైవ్‌లో ప్రారంభ దశలో 20,000 మంది దరఖాస్తుదారులు వీసా రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం, పైలట్ డ్రైవ్ కింద వీసా రెన్వువల్ చేసుకునేలా యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో వెసులు బాటు ఉంది. కానీ వీసా రెన్యువల్ కోసం దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది.
ఈ నెల ప్రారంభంలో స్టేట్ డిపార్ట్‌మెంట్ షేర్ చేసిన నిబంధనల ప్రకారం 20,000 మంది దరఖాస్తుదారులు ప్రస్తుతం యుఎస్‌లో ఉండాలి. పునరుద్ధరణ ప్రక్రియ సమయంలో దేశం విడిచి వెళ్లకూడదు.
హెచ్-1బీ వీసా కోసం దేశం వదిలి
ప్రస్తుతం అమెరికన్ టెక్ సెక్టార్‌లో ఎక్కువ మంది భారతీయ నిపుణులే ఉన్నారు. వారికి అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా అందిస్తుంది. ఈ వీసా వ్యవధి ఆరేళ్లు మాత్రమే. ఆరేళ్ల తర్వాత రెన్యువల్ కోసం మన దేశానికి వచ్చి చేసుకోవాల్సి ఉంటుంది.
వీసా రెన్యువల్ కోసం తప్పని తిప్పలు
అయితే, వీసాల పునరుద్ధరణ సమయంలో భారతీయులకు అనేక ఇబ్బందులు తలెత్తుతుండేవి. ఒక్కసారి హెచ్-1బీ వీసా రెన్యువల్ కాకపోతే భార్య, పిల్లలతో కలిసి అమెరికాను వదిలి సొంత దేశమైన భారత్‌కు రావాల్సి వచ్చేది. దీంతో ప్రతి ఏడాది అమెరికాలో నివసిస్తున్న లక్షల మంది భారతీయులు బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి.
మోదీ పర్యటన.. రూల్స్ పక్కన పెట్టిన అమెరికా
ప్రధాని మోదీ గత ఏడాది అమెరికా పర్యటించారు. పర్యటన అనంతరం జోబైడెన్ ప్రభుత్వ దాదాపూ 20 ఏళ్లగా అమలు చేస్తున్న నియమనిబంధనలు పక్కన పెట్టేసింది. వీసా రెన్యువల్ కోసం అమెరికాను వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడే ఉండి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత హెచ్-1బీ వీసా పునరుద్ధరణ కోసం పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
2022లో మొత్తం 3.2 లక్షల హెచ్-1బీ వీసాలు
ఇక మోదీ ఎఫెక్ట్‌తో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు హెచ్-1బీ వీసా రెన్యువల్‌తో పాటు, వీసాల జారీ విషయంలో ప్రత్యేక ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ సిటిజన్‌షిప్ సర్వీసెస్ (USCIS) ప్రకారం జారీ 2022లో అగ్రరాజ్యం వలసదారులకు 4.41 లక్షల హెచ్-1బీ వీసాలను జారీ చేయగా.. అందులో భారతీయులు 3.2 లక్షల మంది పొందారు.
Comments
Please login to add a commentAdd a comment