
వాషింగ్టన్: హెచ్–4 వీసాదారులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అనుమతులను రద్దుచేయాలన్న డీహెచ్‌ఎస్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ) ప్రతిపాదనను అమలుచేసే దిశగా మరో అడుగు ముందుకు పడింది. హెచ్–1బీ వీసా కలిగిన వ్యక్తుల జీవిత భాగస్వాములకు, వారి 21 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఇచ్చేదే ఈ హెచ్–4 వీసా. హెచ్–4 వీసా కలిగిన వారు కూడా ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులిస్తూ 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఈ అనుమతులను రద్దు చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా, డీహెచ్‌ఎస్ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించాల్సిందిగా మే 22న అమెరికా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయితే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్ష మందికి పైగా భారతీయులు, తమ కొలువులను కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ లక్ష మంది భారతీయుల్లో స్త్రీలే అత్యధికంగా ఉన్నారు.
కనీసం సంవత్సరం తర్వాతే..
ఒక వేళ హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయినా, అది అమలు కావడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుందని అమెరికాలో వలస చట్టాల న్యాయనిపుణుడు రాజీవ్ ఖన్నా చెప్పారు. ‘హెచ్–4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకునే అనుమతిని రద్దుచేసే ప్రక్రియ ప్రస్తుతం చివరి నుంచి రెండో దశలో ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రతిపాదనకు మద్దతు లభిస్తే, ఫెడరల్ రిజిస్టర్‌లో దీనిని పోస్ట్ చేస్తారు. 30 లేదా 60 రోజుల్లోపు మళ్లీ ప్రజలు తమ అభిప్రాయాలు తెలపవచ్చు. అనంతరం నిబంధనకు తుదిరూపు వస్తుంది’ అని ఆయన వివరించారు.
వలస విధానాల్లో పూర్తి సంస్కరణలు తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం తొలి నుంచీ మొగ్గుచూపుతుండటం తెలిసిందే. అందులో భాగంగానే, గతేడాది ఫిబ్రవరిలో తొలిసారిగా హెచ్–4 వీసాలకు ఉద్యోగానుమతులు రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం చేసింది. అనంతరం గతేడాది అక్టోబర్‌లో డీహెచ్‌ఎస్ ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడింది. అయితే హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దు చేస్తే అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ప్రతిభావంతులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment